P Ramesh, News18, Kakinada
మాఘ మాసం సూర్య భాగవానుడికి అత్యంత ప్రీతికరమైన మాసంగా చెబుతారు. ఈ నెలలో ప్రతీ ఆదివారం సూర్య భాగవానుడిని పూజిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం మాఘ మాసంలో సముద్ర స్నానం తప్పనిసరిగా చేయాలంటారు. అందుకే దేవుళ్ళకు కూడా ఇదే నెలలో సముద్ర స్నానం చేయిస్తారు. భారీగా ఉత్సవాలు, జాతరలు ఇదే నెలలో ఉంటాయి. వైష్ణవ సాంప్రదాయం ఆధారంగా మాఘ మాసంలో చేసే పూజలకు, సూర్య ఆరాధన పూజలకు పుణ్యం వస్తుంది అనేది భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఈ మాఘ మాసంలో సముద్ర స్నానమాచరించి సూర్య నమస్కారం చేసుకుంటే కోటి దేవుళ్లను పూజించిన ఫలితం దక్కుతుందనేది ఎక్కువుగా విశ్వసిస్తారు.
కాకినాడ జిల్లా (Kakinada District) లో ఉన్న ఉప్పాడ సముద్రంలో నెల రోజులు పాటు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఎక్కువగా ఈ నెలలో వచ్చే ఆదివారాల్లో ఉదయం నుంచే సముద్ర స్నానాలు చేయడం ఆచారంగా వస్తోంది. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో సముద్ర తీరంలో నెల రోజులు సందడి ఉంటుంది.
సఖినేటిపల్లి మండలం అంతర్వేది (Antharvedi Temple) లో కొలువై ఉన్న దేవ దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహుడి కళ్యాణ మహోత్సవాలు ఈ మాఘ మాసంలో నిర్వహిస్తారు. పిఠాపురం కుంతీ మాధవుని ఉత్సవాలు ఈ మాసంలో జరుగుతాయి.దాదాపుగా వైష్ణవ ఆధారిత సాంప్రదాయ ప్రకారం నడిచే దేవాయాల్లో ఉత్సవాలకు ప్రసిద్ది మాఘ మాసం. ఇక్కడ విశేషం ఏంటంటే ఉత్సవాలు తర్వాత ఉత్సవ మూర్తులకు సముద్రంలో చక్ర స్నానం చేయిస్తారు.
స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మాఘ మాసాన్ని పురస్కరించుకుని గరుడ పుష్పక వాహనంపై స్వాములను ఊరేగించి, గ్రామోత్సవం అనంతరం చక్రస్నానాన్ని నిర్వహించారు. వేదమంత్రోచ్చారణలు, గోవిందా గోవిందా అంటూ దేవదేవుని నామస్మరణల మధ్య స్వామి వారిని (సముద్ర) చక్రవారిస్నానం జరిపించారు. గోవిందా గోవిందా అంటూ నామస్మరణతో అంతర్వేది మార్మోగిపోయింది. నదులలో 12 సంవత్సరాలకి ఒకసారి పుష్కర స్నానాలు వస్తాయని, స్వామి వారి కళ్యాణం అనంతరం స్వామి వారు స్నానమాచరించిన ప్రదేశం ప్రతి ఏటా పుష్కర పుణ్య ఫలం దక్కుతుందనే ఆచారంతో భక్తులు వేలాదిగా స్నానాలు ఆచరిస్తున్నారు.
మాఘమాసంలో సముద్రాలకు దూర ప్రాంతాల్లో ఉన్నవారు అక్కడ చెరువులు, నదులలో కూడా స్నానమాచరిస్తారు. ప్రతీయేటా ఒక్కసారైనా సముద్రస్నానం, నదీ స్నానం చేయాలనేది పురాణాలు చెబుతున్నాయి. ఇదే మాసంలో చలి ప్రభావం ఉంటుంది. ఆరోగ్యపరంగా ప్రవహించే నీటిలో స్నానం చేయడం చాలా మంచిదని పండితులు చెబుతారు. ముఖ్యంగా నదులు, సముద్రాలు అనేవి ప్రకృతి ఇచ్చిన వరం కావడంతో వీటిలో స్నానం చేస్తే ప్రకృతిని ఆరాధించినట్లవుతుందని మరికొందరు చెబుతుంటారు. మొత్తం మీద ప్రతీయేట సముద్ర తీరం మాత్రం భక్తులతో కళ కళలాడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Kakinada, Local News