P Ramesh, News18, Kakinada
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో హెచ్3ఎన్2 వైరస్ (H3N2 Virus) భయం నెలకొంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) జ్వరాలతో జిల్లా అతలాకుతలమవుతోంది. గత కొన్నిరోజులుగా జ్వర పీడితులు ఆసుపత్రుల పాలవుతున్నారు. ప్లూ తీవ్రతకు హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి కారణమేమోననే అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ ప్రభావంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను తాజాగా అప్రమత్తం చేసింది. పెరుగుతున్న ఫ్లూ కేసుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది కేంద్రం. మరోపక్క దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జ్వరబాధితుల వివరాల కోసం సర్వేను కూడా ప్రారంభించింది. మరీ ఆ సర్వేలో ఫలితాలు మాత్రం అందరిని భయపెడుతున్నాయి.
పది రోజుల్లో మొత్తం సర్వే పూర్తి చేయాలని ఆదేశాలొచ్చాయి. తొలి రోజు సర్వేకే జ్వర లెక్కలు ఎక్కువున్నాయని అంటున్నారు. అయితే వీటిలో ఏది ఫ్లూ జ్వరమో, లేక ఏది వైరస్ వ్యాప్తో తెలియక కంగారు పడుతున్నారు వైద్య బృందం. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఇంటిలో అందరికీ జ్వరాలున్నట్లు కూడా చెబుతుండగా, మరికొందరు జలుబు, గొంతునొప్పి, ఒంటినొప్పులతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఇది ప్రాణాపాయం మాత్రం కాదని నిర్థారణకు వచ్చినప్పటికీ జాగ్రత్తలు తప్పవంటున్నారు వైద్యులు.
కొన్ని గ్రామాల్లో జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి తదితర లక్షణాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు బాధితులు. కాకినాడ నగరంలో హాస్పిటల్స్ కిక్కిరిసాయి. జీజీహెచ్ కు రోజూ వందలాది మంది జ్వరంతో వణుకుతూ వస్తున్నారు. ఫ్లూ పంజా విసురుతున్న కొత్త వ్తెరస్ వేరియంట్ ప్రభావం ఉందేమోననే అనుమానాలు మరింత పెరిగాయి. ప్రతి ఇంటికి వెళ్లి జ్వర బాధితులను గుర్తించాలని, తద్వారా కొత్త వేరియంట్ గా అనుమానిస్తున్న వైరస్ కు సంబంధించి లక్షణాలు బయటపడే అవకాశం ఉందని సిబ్బందిని ఆదేశించారు జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా.
సచివాలయాల పరిధిలో వాలంటీర్,ఏఎన్ఎం,ఆశా వర్కర్లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటికి వెళ్లనున్నారు. పది రోజుల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని కుటుంబాల వద్దకు వెళ్లి ఫీవర్ సర్వే పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం జ్వరాల తీవ్రత చిన్నారులు,వృద్దుల్లో మరింత ఎక్కువగా ఉంది. ఈ నేపధ్యంలో ఏదైనా ఇంట్లో ఒకరికి మించి ఎక్కువ మందికి జ్వరాలుంటే స్ధానిక ఆసుపత్రికి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద ప్రారంభమైన సర్వే ప్రభావంతో జ్వరపీడితులకు వైద్యం అందే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Kakinada, Local News