P Ramesh, News18, Kakinada
ఆంధ్రాలో క్రైమ్ కల్చర్ మారిపోతుంది. కత్తులు, కర్రలు పట్టుకునే స్థాయి దాటిపోయింది. ఏకంగా ఇప్పుడు గన్ కల్చర్ మొదలవుతోంది. ఇది సాధారణ ప్రజలతో పాటు పోలీసులను కూడా భయపెడుతోంది. ఇటీవల కాలంలో ఈ తరహా కల్చర్ పెరగడంతో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (East Godavri District)లో గంజాయి ప్రభావం ఎక్కువగా ఉంది. ఇది పరాకాష్టకు చేరి కొత్త గన్ హీరోలు పుట్టుకొస్తున్నారు. కొద్దికాలం కిందట కాకినాడ (Kakinada) లో ఈతరహా హడావుడి జరిగింది. కోనసీమ (Konaseema) లోనూ ఒకరు గన్‌తో హల్ చల్ చేశారు. అంతకముందు నకిలీ గన్ తో కాకినాడ జిల్లా పిఠాపురంలో ఒకరు సినిమా థియేటర్ వద్ద హడావుడి చేయడంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు
ప్రస్తుతం ఈ గన్ హడావుడి చూస్తుంటే జనం భయపడుతున్నారు. కొన్నేళ్ల కిందట నకిలీ తుపాకీ చూపించి ఓ రైస్ మిల్లులో మొత్తం నగదును కాజేశారు. ఈ సంఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలులో చోటు చేసుకుంది. వాస్తవానికి మారణాయుధాల చట్టం చాల కఠినమైనది. కేవలం వ్యక్తి గత ప్రాణరక్షణకు ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తే మాత్రమే కొంత మందికి గన్ లైసెన్స్ ఇస్తారు. కానీ ప్రస్తుతం ఎవరి వద్ద గన్ ఉన్నా అది నకలీదా, నిజమైందా అనేది అర్థం కావడం లేదు.
ఇలా జిల్లాలో ఈగన్ చూపించి చాలా చోట్ల దందాలు చేస్తున్నారనే ఆరోపణలుఉన్నాయి. ఇటీవల కాలంలో విశాఖపట్నం, రాజమండ్రికి చెందిన కొంత మంది గన్స్ పట్టుకుని కాకినాడ జిల్లా పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నారని తెలుస్తోంది. అయితే అవి బొమ్మ తుపాకులా నిజమైనవా అనేది మాత్రం తెలియకపోవడంతో గన్ అంటే భయమున్నవారు ఈగన్ కల్చర్ చూసి అవాక్కవుతున్నారు.
ఈ పరిస్థితి పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. సాధారణంగా హైదరాబాద్, ముంబాయి, బెంగుళూరు, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో మాత్రమే ఈతరహా సంస్కృతి ఉందనేది తెలుసు. కానీ ప్రస్తుతం చిన్న చిన్న ప్రాంతాలకు గన్ కల్చర్ రావడం చూస్తుంటే ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు కొంత మంది సామాజిక వేత్తలు. ఇటీవల కాలంలో రాజమండ్రిలో ఇద్దరు గన్ తో దొరికిపోయారు.
90 ఎమ్ ఎమ్ పిస్టల్ ను కలిగి ఉన్న సత్యనారాయణ అనే వ్యక్తితోపాటు,హరి సూర్య అనే మరోకరిని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఈపిస్టల్ వీరి వద్దకు ఏలా వచ్చిందని ఆరా తీస్తే విజయనగరం జిల్లాకు చెందిన బొత్స మోహన్ అనే వ్యక్తి నుండి 2017లో దీనిని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. అసలు ఈబొత్స మోహన్ ఏవరు. అతడికి 90 ఎమ్ ఎమ్ పిస్టల్ ఏలా వచ్చింది అనే కోణంలో రాజమండ్రి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అదుపులోకి తీసుకుని వారి వద్దనుండి ప్రాథమిక సమాచారం సేకరించిన పోలీసులు, పిస్టల్‌తోపాటు 6 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఇప్పటికే ఓ బృందం విజయనగరం కూడా వెళ్లినట్లు సమాచారం. ఈ పిస్టల్ కలిగిన సత్యనారాయణ, హరిసూర్యలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. వాస్తవానికి పిస్టల్ ఉన్నా దానికి సంబంధించిన లైసెన్స్ కలిగి ఉండాలి. కానీ వీరి వద్ద పిస్టల్ మాత్రమే ఉంది. అందులోనూ ఆ పిస్టల్ ఎక్కడ నుండి వచ్చిందన్న ఆధారాల్లేవు. అసలు సూత్రధారి బొత్స మోహన్‌ను విచారిస్తే ఈ కేసులో మరిన్ని నిజాలు బటయకొస్తాయని అంటున్నారు పోలీసులు. మొత్తంమీద రాజమండ్రిలో జరిగిన ఈగన్ హడావుడి ఇప్పుడు ఉభయగోదావరి జిల్లాలో కలకలం సృష్టించిందనే చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.