P Ramesh, News18, Kakinada
కోనసీమ (Konaseema) లో పండగలంటే ఆ సందడే వేరు. ప్రతీయేటా ఇక్కడ జరిగే పండగలకు ఓ విశిష్టత ఉంటుంది. ఇక అందులో సంక్రాంతి పండగైతే (Sankranthi Festival) కోనసీమలో జరిగే సందడి వేరే చెప్పనక్కర్లేదు. అందులో ముఖ్యంగా ప్రభల తీర్థం. ప్రభలను చెరువులు దాటిస్తూ, పోటా పోటీగా ముందుకు సాగుతూ మూడు రోజుల పాటు కనువిందు ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా అంబాజీపేటలో జగన్నాథతోటలో జరిగే ప్రభల ఉత్సవం మరింతగా ఆకట్టుకుంటుంది. 400 సంవత్సరాల పైబడి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని అంటున్నారు. మేళ తాళాలతో భారీ ప్రభలను ప్రదర్శించి పోటిపడుతుంటారు గ్రామస్తులు. ప్రభల జాతర తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి పర్యాటకులు రావడం ప్రభల ఉత్సవం ప్రత్యేకతగా చెప్పవచ్చు.
ఇక్కడ మరో విశిష్టత ఏమిటీ అంటే గంగలకుర్రు మరియు గంగలకుర్రు అగ్రహారం రుద్రప్రభలు ఈ తోటకి రావాలంటే మధ్యలో గోదావరి పాయ, కౌశిక దాటాలి. ఆ గంగలకుర్రు ప్రభలను ఆ కాలువలోంచి ఏమాత్రం తొట్రూ లేకుండా "హరాహరా" అంటూ తీసుకువచ్చే ఆ గ్రామస్తుల ధైర్యం చూడడానికి రెండుకళ్ళు చాలవు. ఎందుకంటే కాలువలో మామూలుగానే నడవలేము. అలాంటిది ఒక 30 మందిమోస్తే కానీ లేవని ప్రభ ఆకాలువ లోంచి తోటలోకి తీసుకువచ్చే సన్నివేశం చూసేవారికి ఒళ్లు గగుర్పొడుస్తుంది.
ఇక ఆకాలువలోకి వచ్చేముందు వరిచేలను సైతం ఆ ప్రభలు దాటాల్సి వస్తుంది. ఆయా చేలలో పంటను తొక్కుతూ వచ్చినా సంబంధిత రైతులు భాదపడక సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు తమ చేల గుండా వెళ్ళడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఈ ఉత్సవమును దర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన కోనసీమప్రజలే కాక, దేశవిదేశాలలోని వివిధ ప్రాంతాల వారువచ్చిదర్శించి తరిస్తారు. చాలా మంది ఇప్పటికీ సంప్రదాయ వేషధారణలో, పచ్చటి కొబ్బరి చాప కట్టిన ఎద్దుల బండ్లపై ఈ ఉత్సవాలకు రాడం ఆనవాయితీ. దేశవిదేశాలలో స్థిరపడిన యువత సైతం కనుమ రోజు ఇక్కడకు చేరుకుని స్వయంగా ప్రభలను మోసుకొచ్చే దృశ్యం చూడముచ్చటగా ఉంటుంది.
ప్రాచీనకాలంలో మొట్టమొదటిగా ఈ తోటలోనే 11 గ్రామాలరుద్రులు సమావేశమయ్యారని పూర్వికుల మాట. ఈ తోటలో ఏవిధమైన గుడి గానీ, గోపురంగానీ వుండవు. ఇది పూర్తిగా కొబ్బరి తోట. ఈ ఏకాదశ రుద్రులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశం అవ్వడంతో ఈ తోట విశేషప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఏకాదశరుద్రుల కొలువు. హిందూధర్మశాస్త్రాల ప్రకారము ఏకాదశరుద్రులు ఒక్కచోట కొలువు తీరేది ప్రపంచం మొత్తం మీద, ఈ భూమండలం అంతటికీ ఒక్కచోటే. అదీవేదసీమ అయినటువంటి కోనసీమలోనే. లోక కల్యాణార్ధం ఈ పదకొండు గ్రామాల శివుళ్ళు జగ్గన్నతోటలో సమావేశమై లోకవిషయాలు చర్చిస్తారని చెబుతుంటారు.
సుమారు 400 సంవత్సరాల క్రితం నుండీ ఈ సంప్రదాయం వుందనీ.. అత్యంత తీవ్రమైన పరిస్థితులు వచ్చిన 17వ శతాబ్ధములోనూ ఈ 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశం అయ్యి లోకరక్షణగావించారనీ ప్రతీతి. అప్పటి నుండీ క్రమం తప్పకుండా ప్రతీసంవత్సరమూ కనుమరోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా, భూమి తలక్రిందులైనా ఈ రుద్రులను ఒక్కచోట చేర్చుతారు ఆయా గ్రామస్తులు. సంస్థానదీశులైన శ్రీ రాజావత్సవాయి జగన్నాధ మహారాజుకు చెందిన ఈ తోట, జగ్గన్న తోట అనే పేరుతో స్థిరపడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Kakinada, Local News