P Ramesh, News18, Kakinada
ఓ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) పథకాల (AP Government schemes) తో మోతెక్కిస్తుందన్న ప్రచారం పెరుగుతుంటే, పల్లెలో మాత్రం కాంతి మసక బారుతోంది. ఇందుకు కారణం పంచాయతీలు భారీగా బకాయిలతో మునిగితేలుతున్నాయి. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో పంచాయతీ బకాయిలు చూస్తుంటే పంచాయతీ రాజ్ అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. కోట్లలో ఉన్న బకాయిలు ఎలా చెల్లించాలనే దానిపై దర్జన భర్జన పడుతున్నారు. ఇటీవల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) రంగం పేట మండలంలో 12 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక్కడ ఒక్క రంగంపేట పంచాయతీకే రూ.2 కోట్లు బకాయిలు ఉండటంతో పంచాయతీ అధికారులకు ఏం చేయాలో తెలియడం లేదు.
జగన్ సర్కార్ వచ్చిన తర్వాత కొన్ని చోట్ల గ్రామ పంచాయతీల వద్దే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారు. అక్కడ నిర్వాహణ మొత్తానికి బిల్లులు కేటాయిస్తుంది. కాని నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. 14వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి కొన్ని బిల్లులను చెల్లించినప్పటికీ సామర్థ్యం సరిపోవడం లేదు. దీంతో గ్రామ పంచాయతీల్లో తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వాహణ కష్టతరంగా మారింది. గతంలో ఎన్.హెచ్.ఆర్.ఎమ్.యు నిధులు వచ్చేవి. కానీ అవి ఇప్పుడు పూర్తి స్థాయిలో రావడం లేదు. దీంతో సాధారణ నిధుల నుండి ఖర్చు చేయాలి. కానీ సాధారణ నిధులను సీఎఫ్ఎమ్ఎస్ విధానంలో బిల్లులు పెట్టాల్సి ఉంది. రాష్ట్ర స్థాయి అధికారుల చేతికి సాధారణ నిధులు వెళ్లిపోతున్నాయి. దీంతో ఏ చిన్న పని చేద్దామన్నా నిధులు రావడం లేదు. ఈప్రభావంతో చిన్న చిన్న పనులకు కూడా పంచాయతీలు గగ్గొలు పెడుతున్నాయి.
దాదాపుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల కాలంలో వచ్చిన కరెంటు బిల్లుల బకాయిలు అధికారులకు వణుకు పుట్టిస్తున్నాయి. ప్రతీయేటా ఈ నిధులను యధావిధిగా ఏపీఈపీడీసీఎల్ కు జమ చేసేవారు. కానీ ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ బకాయిలు ఎక్కువగా ఉండటంతో ఇబ్బంది ఏర్పడింది. పంచాయతీలకు సంబంధించి నిధులు విడుదల చేయాలని పంచాయతీ సర్పంచ్‌ల సంఘం ఒక పక్క ఉద్యమం చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
రాజధాని అమరావతిలో సమావేశమైన సర్పంచుల సంఘం బిల్లులు చెల్లించకపోతే ఉద్యమ బాట తప్పదని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుండి స్పందన లేదు. ఇప్పటికైనా పెండింగ్ బకాయిలపై ప్రభుత్వం స్పందించకపోతే తమకు గడ్డుకాలమేనని సర్పంచిలు ఆందోళన చెందుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.