P Ramesh, News18, Kakinada
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ప్రభావం కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ తుది దశలో పథకాల నిర్వాహణ తీరు చూస్తుంటే మాత్రం అయోమయంగా మారింది. ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) లో జరుగుతున్న తంతు ఇలానే ఉంది. జగనన్న భూసర్వే తీరు చూస్తుంటే ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దారుణంగా ఉంది. చాలా చోట్ల ఈసర్వే సాగుతున్నతీరు విస్మయానికి గురిచేస్తోంది. ఒకపక్క అడుగు భూమికి కూడా లెక్క చూపించాలన్న ప్రభుత్వ ప్రయత్నం బాగానే ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి ప్రభుత్వం లెక్కలు తేల్చకపోయింది. చాలా చోట్ల భూసర్వే సమస్యాత్మకంగా మారింది. ముఖ్యంగా కాకినాడ జిల్లా (Kakinada District) లో చాలా మండలాల్లో జగనన్న భూసర్వే ఇబ్బందులుగా మారింది. ఈ సర్వే జరిగితే ఆన్‌లైన్ భూ ప్రక్రియ మొదలవుతుంది.
ఒకే నెంబర్ ఆధారంగా గ్రామంలో మొత్తం భూమి ఒక నెంబరు కిందకి తీసుకురావాలన్నది ప్రభుత్వం లక్ష్యం. కానీ భూమి కొలతలతోపాటు, గ్రామాల్లో పాత లెక్కలకు, కొత్త కొలతలకు వ్యత్యాసాలు రావడంతో ఇబ్బంది ఏర్పడుతోంది. ఈప్రభావంతో ఆన్‌లైన్చేయని భూములు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోతుంది.
ఆగుతూ.. సాగుతూ
ఈ భూసర్వే విషయంలో చాలా తేడాలు కనిపిస్తున్నాయి. తొలుత డ్రోన్ కెమెరాల ద్వారా భూమి భౌగోళికంగా అంచనా వేసారు. ఆ అంచనాలకు సంబంధించి కెమెరా చిత్రాలను ప్రింటింగ్ వేయించి, వాటి ద్వారా కొలతలను సరి చేస్తున్నారు. ఈ మొత్తం ఒక ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఆధారంగా ఆన్‌లైన్ చేస్తారు. ఈ ఆన్‌లైన్ ను రిజిస్ట్రేషన్ శాఖకు అనుసంధానం చేయడంతో ఖచ్చితమైన భూమి కనిపిస్తోంది. ఆతర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరమవుతుంది. ఈ విధానం అమలు చేయడానికి మొదటజిల్లాకు కొన్ని గ్రామాలను ఎంపిక చేశారు. అక్కడి నుండి మొదలైన ఈ విధానం పూర్తయి ప్రస్తుతం భూసర్వేకు ప్రధాన మార్గదర్శిగా చేసి భూసర్వే చేపడుతున్నారు.
ఇప్పటికే చాలా చోట్ల ఈప్రక్రియ పూర్తయ్యింది. అయితే కొన్ని గ్రామాలకు అంచనాల నివేదికలు రాకపోవడంతో ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇలా జరగడం వల్ల ఆర్ఎస్ఆర్ డేటాలో తేడాలున్న భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు భూముల సర్వే పథకంపై దృష్టి పెట్టి భూ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Local News