హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Godavari River: ఏడారిలా గోదారి.. ఆ రెండు జిల్లాలకు భవిష్యత్తులో కష్టాలు తప్పవా..?

Godavari River: ఏడారిలా గోదారి.. ఆ రెండు జిల్లాలకు భవిష్యత్తులో కష్టాలు తప్పవా..?

గోదావరి నది (Photo Credit: Facebook)

గోదావరి నది (Photo Credit: Facebook)

Godavari: ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద.. వర్షాలు సకాలంలో కురవకపోయినా రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితి తప్పదనే సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలను చూసి రాజస్థాన్ (Rajasthan) ఎడారి అనుకోకండి. నిత్యం గలాగలా పారే గోదావరి.. నదీగర్భంలో నీటి నిల్వ గణనీయంగా తగ్గిపోవడంతో ఇసుక మేటలు బయటకు కనిపిస్తూ ఎడారిని తలపిస్తోంది.

ఇంకా చదవండి ...

P Anand Mohan, News18, Visakhapatnam

ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద.. వర్షాలు సకాలంలో కురవకపోయినా రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితి తప్పదనే సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలను చూసి రాజస్థాన్ (Rajasthan) ఎడారి అనుకోకండి. నిత్యం గలాగలా పారే గోదావరి.. నదీగర్భంలో నీటి నిల్వ గణనీయంగా తగ్గిపోవడంతో ఇసుక మేటలు బయటకు కనిపిస్తూ ఎడారిని తలపిస్తోంది. వాస్తవానికి జూన్ మూడవ వారం నుంచి గోదావరి (Godavari River) నిండులా దర్శనమివ్వాల్సి ఉండగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం.., ఎగువ ప్రాంతాల క్యాచ్ మెంట్ ఛానల్స్ నుంచి నీరు రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఈ సమయానికి 10 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో ఉండగా ఈ ఏడాది కేవలం 4 వేల 500 క్యూసెక్కుల నీరు మాత్రమే ఎగువ ప్రాంతాల నుంచి వస్తోంది.

దీంతో నీటి నిల్వ గణనీయంగా తగ్గుముఖం పట్టింది. మరోవైపు ఈ ఏడాది తూర్పు.. మధ్య.. పశ్చిమ డెల్టాలకు సాగు నీరు ముందుగా విడుదల చేయడం నీటి నిల్వ తగ్గడానికి మరొక కారణంగా కనిపిస్తోంది. ఈ నెల 1 నుంచి డెల్టా కాలువలకు నీటి సరఫరా అవుతోంది. గత రెండు వారాలుగా ప్రతీనిత్యం 7 వేల 600 క్యూసెక్కుల నీటిని జలవనరుల శాఖ అధికారులు కాలువలకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటికి.., డిశ్చార్జ్ అవుతోన్న నీటి మధ్య మూడు వేల క్యూసెక్కుల వ్యత్యాసం ఉండటంతో ధవళేశ్వరం బ్యారేజ్ లో నీటి నిల్వ అమాంతం తగ్గిపోయింది. దీంతో రాజమండ్రి వాసులు నీటి కష్టాలు పడుతున్నారు.

ఇది చదవండి: ఏపీలో ఇక సినిమా చూడటం కష్టమేనా..? ఎంఓయూపై థియేటర్ల అభ్యంతరం..


జలకళ సంతరించుకుని ఉరకలేయాల్సిన సమయంలో గోదావరి ఎడారిని తలపించేలా మారడం వెనుక పాలకుల అవగాహనా రాహిత్యం.. అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రతీ ఏటా జూన్ మూడవ వారం వచ్చే సరికి గోదావరి నీరు రంగమారి ఎర్ర నీరు వచ్చి చేరుతుంది. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ముందుగా వర్షాభావ పరిస్థితులను అధికారులు. పాలకులు అంచనా వేయడంలో విఫలమవ్వడంతోనే ఈ దుస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు రాజమండ్రి వాసులు.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా డెల్టా భూములకు సాగు నీటితో పాటు తాగునీటి అందించే జీవనది ఇప్పుడు నీరు లేక వెలవెలబోవడానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాగునీరు అందించడం ఎంత అవసరమో తాగునీటి సరఫరా పై కూడా దృష్టి సారించాల్సి ఉన్నా ఆ దిశగా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడాన్ని తప్పుబడుతున్నారు. ఇది పూర్తిగా అవగాహనారాహిత్యంతో పాటు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం ఉందని మండిపడుతున్నారు.

ఇది చదవండి: మరింత పటిష్టంగా ఆరోగ్యశ్రీ.. ఇకపై వైద్యం మరింత ఈజీ.. సీఎం జగన్ కీలక ఆదేశాలు..


ప్రతి ఏటా మహారాష్ట్రలో ముందుగా వర్షాలు కురవడంతో వరదనీరు దిగువకు వచ్చేది.. ఈ ఏడాది వర్షాలు ఇప్పుడే ప్రారంభం కావడంతో అక్కడి రిజర్వాయర్లు నిండితేగాని దిగువకు నీరు వచ్చే పరిస్థితి లేదు.. దీంతో పాటు భద్రాచలం.. శబరి.. ఇంద్రావతి నదుల క్యాచ్ మెంట్ ఏరియాల్లో కూడా తీవ్రమైన వార్షాభావం నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో గోదావరి పూర్తిగా జలకళను సంతరించుకోవాలంటే మరింత జాప్యం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం భద్రాచలంలో కూడా నీటి మట్టం కనిష్ట స్థాయికి చేరింది. ఇక పోలవరం నుంచి నీరు ధవళేశ్వరం బ్యారేజ్ కి చేరాలన్నా కనీసం 25.72 అడుగుల నీటి మట్టం ఉండాలి. అలా ఉంటేనే దిగువకు నీటి సరఫరా సాధ్యం అవుతుంది. అయితే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ వద్ద కూడా నీటి మట్టం 22 మీటర్ల వరకే ఉంది. ఇక గోదావరికి పూర్తి స్థాయిలో నీరు వచ్చి చేరాలంటే ఎగువ క్యాచ్ మెంట్ ఏరియాలతో పాటు మహారాష్ట్రలో వర్షాలు కురవాల్సిన అవసరం ఉంది.

ఇది చదవండి: వైసీపీలో ఏం జరుగుతోంది..? సీనియర్ నేతల కామెంట్స్ దేనికి సంకేతం..?ఇటువంటి పరిస్థితులను అధికారులు ముందుగా అంచనా వేయకుండా అనాలోచితంగా వ్యవహరించారంటూ మండిపడుతున్నారు రాజమండ్రి వాసులు.. ధవళేశ్వరం బ్యారేజ్ ఎగువ ఇప్పటికే వేసిన ఇసుక మేటలను తొలగించి ఉంటే నీటి కష్టాలు తప్పేవని అభిప్రాయపడుతున్నారు. బ్యారేజ్ నీటి సామర్ధ్యం మూడు టీఎంసీలు కాగా ఇసుక మేటల ప్రభావంతో ప్రస్తుతం అందులో సగం నీటిని మాత్రమే నిల్వ చేసే పరిస్థితి నెలకొంది. మరోవైపు పలు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లకు నీటిని తరలించడం పై నియంత్రణ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం అయ్యిందంటే ఇక ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక అధికారులు సమన్వయలోపంతో వ్యవహరిస్తే కోనసీమ.., సహా డెల్టా ప్రాంతాలనికి నీటి కష్టాలు తప్పవంటున్నారు గోదావరి జిల్లాల ప్రజలు.

తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు జీవనది గోదావరి తీరం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ప్రతీరోజు వేలాది ఉభయ తెలుగురాష్ట్రాల ప్రజలతో పాటు దేశంలో నలుమూలల నుంచి రాజమండ్రి విచ్చేస్తుంటారు. పితృకార్యాలు వంటి కార్యక్రమాలతో పాటు గోదావరి స్నానఘట్టాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. అయితే ప్రస్తుతం రాజమండ్రి వద్ద గోదావరి నదీ పూర్తిగా ఎడారిలా మారింది. ఘాట్ల నుంచి నడిచివెళ్తే గానీ నీరు కనిపించే పరిస్థితి లేదు. గోదావరిలో ఇటువంటి పరిస్థితి నెలకొంటుందని తామేప్పుడు ఊహించలేదని అంటున్నారు బయట ప్రాంతాల నుంచి వెళ్లే ప్రజలు. ఇసుక మేటలను తొలగించడం ద్వారా కనీసం అవసరాలకు అనుగుణంగా అయినా నీటి నిల్వ సామర్ధ్యం పెంచుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికైనా ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Godavari river

ఉత్తమ కథలు