P.Ramesh, News18, Kakinada
గోదావరికి వరదలు (Godavari Floods) వచ్చాయంటే ముంపు ప్రాంతాలకు కాస్త ఇబ్బందే అయినప్పటికీ, మరికొంత మందికి మాత్రం అదొక సంబరం. దానికి కారణం వేరే ఉంది. వరదల్లో వచ్చే ఆ ఎరుపురంగు నీటిలో నుండి ఎంతో విలువైన మత్స్య సంపద బయటకొస్తుంది. వాటి ధర మాట అటు ఉంచితే అసలు ఆ చేపలు (Fish) మాత్రం ఎలాంటి వారైనా ఆరంగించేయొచ్చని, ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటున్నారు. ఆరోగ్యానికి ఉపకరించే ఆ రకాల గోదావరి చేపలు కొనుగోలు చేసేందుకు గుమిగూడుతున్నారు మత్స్యప్రియులు. మరి ఆ విశేషాలెంటో చూద్దాం రండి. గోదారోళ్ల అతిథి మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ ఆ గోదావరి జిల్లాలో చేపలు చాలా ఫేమస్. ఎవరైనా అతిథిలు వచ్చారంటే చేప లేకుండా కూర ఉండదంటే అతిశయోక్తి కాదు. అందులోనూ గోదారమ్మ పరవళ్లు తొక్కే ఈ వానాకాలం, వరదలు వచ్చినప్పుడు రకరాకల చేపలు అందుబాటులో ఉంటాయి.
అలాంటి ప్రత్యేకమైన చేపలను తీసుకొచ్చి మసాలా దట్టించి అతిథులకు వడ్డిస్తారు..ఆ చేపలను నోట్లో వేసుకున్న ఎవ్వరైనా...అబ్బా అమోఘం అనాల్సిందే..! రాజమండ్రి వద్ద దవళేశ్వరం ప్రాజెక్టు తెలియని వారుండరు. విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్లాలంటే గోదావరి దాటాల్సిందే. ఆ గోదావరి ఒడ్డుపక్కనే ఓ చేపల బజారు ఉంది. అది దాదాపుగా అక్కడకు వచ్చే పర్యాటకులకు, లోకల్ వాళ్లకు మాత్రమే తెలిసిన మార్కెట్.
ఈ మార్కెట్ సందడంతా కేవలం గోదావరి నది పారినప్పుడు. కానీ, వరదలొచ్చినప్పుడైతే అక్కడి మత్స్యకారులకు అదో సంబరం. ఎందుకంటే పలు రకాల చేపలు, ఆరోగ్యానికి ఉపయోగించే చేపలు కూడా ఆ గోదారి ఎర్రనీళ్లలో దొరుకుతాయి. వేగంగా వెళ్లే గోదావరిలో వలవేసి పట్టిన జాలర్లు, నేరుగా చేపలను అక్కడ ప్రాంతంలో విక్రయిస్తారు.ధరలు మాత్రం ఒక్కొక్క చేప ఒక్కొ రకమైన ధర పలుకుతోంది. గోదావరి బొమ్మిడాలనైతే శుభ్రం చేసి మరీ ఇస్తారు. ఇక్కడ నుండి ఇతర జిల్లాలకు, తెలంగాణాకు కూడా ఎక్స్‌పోర్టు అవుతాయని మత్స్యకారులు చెబుతున్నారు. బొమ్మిడాలను శుభ్రం చేసి ముక్కులుగా కోసి ఇచ్చేందుకు కొంచెం మాత్రం ఎక్కవ ధర చెల్లించాల్సి ఉంటుంది.
ఆ చేపల రకాలివిగో..!
చేపల్లో పండుగప్ప, బొమ్మిడాయిలు, గోదారి కట్టిపరిగలు, దొందులు, మోసులు వంటి చేపలు ఇక్కడ విరివిగా దొరుకుతాయి. వీటిలో అత్యధిక రేటు పులసకే ఉంటుంది. ఇది మరికొద్ది రోజులు మాత్రమే ఉంటుందని అత్యధిక ధర పలికేది పులసేనని అంటున్నారు విక్రయదారులు. మరి ఇంత ఫేమస్ అయిన ఈ చేపలను రుచి చూడాలనుందా..? అయితే ఓ సారి గోదావరి తీరానికి వెళ్లండి లేటేందుకు మరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Fish, Local News