P.Ramesh, News18, Kakinada
భారీవర్షాలు పడినప్పుడు గోదావరి వరదలు (Godavari Floods) సర్వసాధారణమైపోయింది. ఇంకా చెప్పాలంటే వరదలొస్తాయి, ఓ నాలుగు రోజుల పాటు సర్ధుకుపోవాలి. మళ్లీ ఆ తర్వాత షరా మాములే. ఇది ఇక్కడ ప్రజలకు ఎన్నో ఏళ్లుగా అలవాటైపోయింది. కానీ అదే వరదల్లో నీరంతా సముద్రం పాలవుతోంది. ఆ నీటినే మనం రక్షిస్తే ఎంతమందికి స్వచ్ఛమైన నీరు అందించవచ్చో తెలుసా..ఈ ఒక్క చిన్న లాజిక్‌ను మిస్సవుతున్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి. వరదొస్తే బియ్యం, ఉప్పు-పప్పులతో సరిపెట్టేసి ఎక్కడో ఒక చోట పునరావసం కల్పించి నాలుగు రోజులు గట్టెక్కిస్తున్న నేతలు వరదనీటిని సముద్రం పాలుకాకుండా చేసే ప్రయత్నాలు మాత్రం ఇసుమంతైనా చేయడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
మీకు తెలుసా మనిషికి రోజుకు ఎంత నీరు అవసరమో..!
ఒక మనిషికి సగటున రోజుకి 130 లీటర్ల నీరు(అన్ని అవసరాలకు కలిపి) అవసరం. ప్రస్తుతం గోదావరి నుండి దాదాపుగా రోజుకి 5 నుండి 7 లక్షల క్యూసెక్కుల నీటిని కింద సముద్రంలోకి వదులుతున్నారు. వరదల నేపథ్యంలో గత వారం రోజులుగా తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాలో నీటిని సముద్రం వైపు మళ్లించాల్సి వస్తోంది. కాని ఇదే నీటిని గనుక రక్షిస్తే కొన్ని వందల గ్రామాలకు మంచినీటితో పాటు, అవసరాలకు తగ్గట్టుగా నీటిని అందించవచ్చు. కొన్ని లక్షల ఎకరాలకు సాగునీటిని అందివ్వవచ్చు. కోట్లు కుమ్మరించి అభివృద్ధి అని చెప్పే నేటి తరం నాయకులకు ఈ లాజిక్ ఎప్పుడు తెలుస్తోందో అంటున్నారు గోదావరి వాసులు.
గేట్లు తెరవడం..నీటిని వదలడం..!
గోదావరి నది దవళేశ్వరం వద్ద 14 నుండి 15 మీటర్ల వరకూ ఊగిసలాడుతోంది. 175 గేట్లను లెవెల్‌గా ఎత్తుతున్నారు. మహారాష్ట్రలో కురిసిన వానలు, ఉభయగోదావరి, ఏజెన్సీ ప్రాంతాల్లో కురిసిన వర్షాల ప్రభావంతో గోదావరికి ఈ ఏడాదిలో 3వ సారి భారీగా నీరు చేరుతోంది. ఈ నీరు లంక, ఏజెన్సీ గ్రామాలను ముంచుతూ సముద్రం పాలవుతోంది.
సంవత్సరాల తరబడి వరదలొస్తూనే ఉన్నాయి. ప్రతీయేటా గోదావరి పరివాహక ప్రాంతాలు, అలాగే ఏజెన్సీలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండటం తప్పితే మరొక పరిష్కారం కనిపించడం లేదు.వాస్తవానికి పోలవరం (Polavaram Project) ద్వారా ఈ సమస్య పూర్తవుతుందని అంతా ఆశిస్తున్నప్పటికీ రోజు రోజుకి ప్రాజెక్టులో మరింత జాప్యం జరుగుతోంది. కోట్లు కుమ్మరించినా నేటికి పరిష్కారం చూపలేకపోతున్నారు మన నేతలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Godavari river, Local News