అంబేద్కర్ కోనసీమ జిల్లా.. పచ్చటి పంటపొలాలు.. అబ్బురపరిచే ప్రకృతి అందాలకు నెలవు. ఇక్కడ కనచూపు మేరలో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తోంది. అలాంటి కోనసీమ రైతులకు ఇప్పుడు సాగు నీటి కష్టాలొచ్చాయి. నీరు లేక ఎండిపోతున్న వరి పొలాలు ఎండిపోతున్నాయి. అమలాపురం రూరల్ మండలంలోని జనుపల్లి, నల్లమిల్లి, నడిపూడి, రావుల చెరువు, వేమవరం తదితర గ్రామాల్లోని థైలాండ్ ప్రాంతంలో చేలు చాలావరకు ఎండిపోయి బీటలు వారాయి. ఈ గ్రామాలు మాత్రమే... జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో పరిస్థితి ఇలానే ఉంది. సాగునీటి కోసం అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. కానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. తమ కళ్ల ముందే..పంటలు ఎండిపోతుండడంతో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు.
Mushroom: పుట్టగొడుగులు శాఖాహారమా..? మాంసాహారమా..? ఎలా సాగు చేస్తారు.. లాభాలు తెలుసా..?
జిల్లా అధికారులు.. స్థానిక అధికారులకు.. ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసిన రైతులు.. ఇప్పుడు నిరసనలకు దిగుతున్నారు. అధికారులు ఎదుటే ఎండిపోతున్న పంట పొలాల్లో మోటార్ బైక్స్ నడిపి నిరసన వ్యక్తం చేస్తున్నారు. జనుపల్లిలో ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారుల ఎదుట రైతులు పొలాల్లో మోటార్ సైకిళ్ళు నడిపారు. నీరు లేక వరి పొలాలు.. బీటలు వారాయని.. తమను ఆదుకోవాలని కోరుతున్నారు. నీరు అందించి పంటలను రక్షించాలని .. తమను అప్పుల బారి నుంచి కాపాడలంటూ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికయినా అధికారులు స్పందించి సాగు నీరు అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
కోనసీమ జిల్లాలో రబీ సీజన్‌లో 1.90 లక్షల ఎకరాల్లో వరిసాగవుతోంది. గతంలో తొలకరి పంటను త్యాగం చేసిన రైతులు..రబీపైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఈ పంట కూడా చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో... వారంతా ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 69 గ్రామాల్లో 5287 ఎకరాల విస్తీర్ణంలో సాగునీటి సమస్యలు తలెత్తినట్లు జిల్లా యంత్రాంగం ఇప్పటికే గుర్తించింది. సమస్యను పరిష్కరించేందుకు... సమీప ప్రాంతాల్లో డ్రైన్లపై క్రాస్‌బండ్‌లు వేసి రైతులకు సాగు నీటిని ఇంజిన్ల ద్వారా మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. అమలాపురం సబ్‌డివిజన్‌లో 63, రాజోలు సబ్‌డివిజన్‌లో 9, రామచంద్రపురం సబ్‌డివిజన్‌లో 18 క్రాస్‌బండ్‌లు ఏర్పాటుచేసి.. ఎత్తిపోతల ద్వారా కాల్వ చిట్టచివరి భూములకు నీరందిస్తున్నామని జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా తెలిపారు.
ఐతే గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు మాత్రం కొంత ఉపశమనం కలిగించాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో పలు చోట్ల శుక్రవారం ఉదయం నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి. పంట ఎండిపోయే దశలో వానలు కురవడంతో.. రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Konaseema, Local News