అన్నదాతలు వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు.. పురాతన కాలం నాటి వస్తువులు, బంగారం, లంకెబిందెలు... విగ్రహాలు ఇలాంటివి ఎన్నో సందర్భాల్లో బయట పడ్డాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. తాజాగా అలాంటి ఓ ఘటన ఇప్పుడు కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. రైతు పొలం చదును చేస్తుండగా పెద్ద శబ్దం వినిపించింది.
కాకినాడ జిల్లా తుని సమీపంలోని గొంపకొండ ప్రాంతంలో రైతులు తమ పొలాలను చదును చేస్తున్నారు. అయితే అన్నదాతలు పొలం పనుల్లో బిజీగా ఉండగా... ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. అంతా కంగారు పడి ఏంటి అని అక్కడ తవ్వి చూశారు. దీంతో ఆ పొలంలో 12వ శతాబ్దం యలమంచిలి చాళుక్యుల కాలం నాటి రాతికుండలు, ప్రమిదలు, శిలాఫలకాలు బయటపడ్డాయి. ఇవి మాత్రమే కాదు.. పురాతన ఇటుకలు, గుడి శిధిలాలు, రాతి శాసనాలు సైతం ఆ ప్రాంతంలో లభ్యమయ్యాయి.
అయితే గతంలో ఈ గొంపకొండ ప్రాంత సమీపంలో ఓ పట్టణం ఉండేదని.. అగ్ని ప్రమాదం లేదా మశూచి లాంటి భయంకరమైన వ్యాధి కారణంగా అక్కడున్న ప్రజలు ఊరి ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వలసపోయి ఉంటారని చరిత్రకారులు భావిస్తున్నారు. అందుకే అక్కడ ఉన్న ఆలయం ఆ తర్వాత కాలంలో మట్టిలో కూరుకుపోయి ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు.
అయితే తవ్వకాల్లో బయటపడిన ఈ శిల్ప సంపద క్రీ.శ. 800-1240 మధ్య కాలంలో వెలసిల్లిన ఆలయాల నిధిగా పురావస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యలమంచిలి చాళుక్యుల పాలన సమయంలో ఆ ప్రాంతంలో ‘జననాధపట్నం’ అనే పట్టణం ఉండేదని.. తదనంతరం ‘జగన్నాధపురం’ అనే గ్రామం చలామణిలోకి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ నివసిస్తున్న రైతులు.. వారికి పొలం పనుల్లో దొరికిన ఈ గుడి రాళ్లను సరిహద్దు కంచెగా, అలాగే తవ్వకాల్లో బయటపడిన దేవతామూర్తి విగ్రహాలను స్థానిక దేవతలుగా పూజిస్తున్నారని చెప్పుకొచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kakinada, Local News