P Ramesh, News18, Kakinada
పచ్చదనంతో, ఎంతో అందంగా కనిపిస్తున్న ఈపంట బాగా ఏపుగా పెరిగిందని అనుకుంటే మాత్రం తప్పులో కాలిసినట్టే. ఎందుకంటే అసలు ఈపచ్చదనం వెనుక మొత్తం నష్టమే మిగిలింది. ఇంతలా పచ్చదనం కనిపిస్తున్నా ఎందుకు నష్టం వచ్చిందని తెలుసుకోవాలనుకుంటే కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ రైతులు గాధ వినాల్సిందే. కాకినాడ జిల్లా (Kakinada District) లో మిర్చి రైతులు నిండా మునిగిపోయారు. తమకు ఎంతో లాభం వస్తుందనుకున్న మిర్చి పంట నష్టాల భాట పట్టించిందని ఆవేదన చెందుతున్నారు. పేనుకొరుకుడు తెగులు మిర్చిపంటపై దాడి చేయడంతో మిర్చి రైతులకు ఈ ఏడాది గడ్డుకాలం తప్పలేదు. ఒకొక్క ఎకరానికి లక్షరూపాయాలు చొప్పన నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ గ్రామంలో మిర్చి పంట ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ పండించిన పంటను ఇతర తెలుగు రాష్ట్రాలతోపాటు, ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటారు. అయితే ఒక్కసారిగా వచ్చిన ఈతెగులుతో రైతులు పూర్తిగా డీలా పడిపోయారు. గతంలో ఎన్నడూ చూడని నష్టాన్ని తాము చూడాల్సి వచ్చిందని అంటున్నారు రైతులు.
ప్రస్తుతం కాకినాడ జిల్లాలో మిర్చి రైతులు బాధ మాములుగా లేదు. ఎందుకంటే దాదాపుగా ఎకరానికి లక్షకు పైగా పెట్టుబడి పెట్టేశారు. దీనికి తోడు కౌలు చిత్తు కూడా ఇవ్వాల్సి ఉంది. మరోపక్క చూస్తే పంట మొత్తం పచ్చదనం కాని ఫలితం మాత్రం శూన్యంగా మారింది. పేనుకొరుకుడు తెగులు ఇంతిలా ముంచుతుందని వారు అనుకోలేదు. అధికారులు వస్తున్నారు పోతున్నారు, తప్పితే ఫలితం లేదు. దీనిపై పాలకులు కూడా నోరు మెదపకపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏం చేయాలో తెలియక పెంచిన పంటను రైతులే పీకి పారేస్తున్నారు.
ఈ తెగులు మొత్తం పంటంతా వ్యాపించడంతో మొత్తం పంట కాలిస్తే తప్ప ఫలితం ఉండదనేది సీనియర్ రైతుల వాదన. అయితే పూర్తిగా విషయాలు తెలుసుకోకుండా, పరిశీలన లేకుండా పంటను తీసేయొద్దని చెబుతున్నారు ఉద్యానవన శాఖ అధికారులు. దీనిపై ఓ క్లారిటీ వచ్చే వరకూ పంటను అలానే ఉంచాలని చెబుతున్నప్పటికీ, కాలం సాగిపోతున్నా తమకు ఫలితం దక్కడం లేదని, మరోపంట వేసేందుకైనా ఈ పంట తొలగించక తప్పదని రైతులు చెబుతున్నారు.
800 ఎకరాల్లో నష్టం
మొత్తం ఇప్పటి వరకూ అదికారిక లెక్కల ప్రకారం 150 హెక్టార్లలో పంట నష్టం అంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంట మొత్తం 800 ఎకరాల్లో ఉంటుందని అంటున్నారు. రైతులకు మిర్చి రైతులకు సంబంధించి ఇప్పటి వరకూ ఎక్కడా ఎటువంటి రాయితీలుగాని, నష్టపరిహారం గాని ఇవ్వలేదు. ఇస్తారానే హామీ కూడా లేదు. గత ఏడాది అరకొర పంటతో నెట్టుకొచ్చిన రైతులు ఈ ఏడాది పూర్తిగా నష్టపోయారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kakinada, Local News