(Ramesh, News18, East Godavari)
హిందూ సాంప్రదాయల్లో చేసే పనులన్నింటికి ఓ పద్ధతి ఉంటుంది. అందుకే తెలుగు సంస్కృతితో పాటు, ఇక్కడ జరిగే పండగలకు, ప్రత్యేక కార్యక్రమాలకు అంతటి విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో సనాతన ధర్మం ఆధారంగానే ఎక్కువగా పనులు జరుగుతుంటాయి. ఇంటిలో పెళ్లి దగ్గర నుండి, ఏ కార్యక్రమం చేపట్టనా ఓ పద్ధతి ప్రకారం చేస్తుంటారు. పండితులు చెప్పిన విధానాలనే పాటిస్తారు. ముఖ్యంగా గోమాత పూజకైతే ఓ ప్రత్యేకత. ఎవరైనా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టే ముందు మహాలక్ష్మి సమానురాలైన ఆవును ఇంట్లోకి అడుగుపెట్టించిన తర్వాత మాత్రమే ఇతరులు అడుగు పెడతారు.
అలాంటి ప్రత్యేకత ఉంది గోవులకు. ముఖ్యంగా సంక్రాంతి సమయాల్లో ఆవులకు నిత్యం పూజలు చేస్తారు. గంగిరెద్దుల నిర్వాహణ కుటుంబాలైతే ఇదే జాతికి చెందిన ఎద్దులను పూజిస్తారు. నందీశ్వరుడితో సమానమైన ఎద్దును ఇంటింటా తిప్పుతారు. గంగిరెద్దు ఇంటిముందు వేసిన ముగ్గు మద్యలో ఉంచిన గొబ్బెమ్మలను తొక్కాలనేది సాంప్రదాయం. అంతటి పేరు ప్రఖ్యాతలుంటాయి ఆవులకి, ఎద్దులకి. ముఖ్యంగా హిందూ సాంప్రదాయ పద్దతులు తెలిసిన వారెవరైనా సరే ఆవులకంటూ ప్రత్యేకంగా పూజలు చేయడం ఎక్కువగా చూస్తుంటాం. పూజల్లో కూడా ఆవు పాలను ఉపయోగిస్తారు. దీపారధనలో ఆవునెయ్యిని ఉపయోగించడం మనం చూస్తుంటాం. ప్రతీ శుభకార్యంలో ఆవు పాత్రలేనిదే దాదాపుగా ఏ శుభకార్యక్రమం జరగదనేది పండితుల మాట.
ఇంతటి ఘనమైన చరిత్ర గల ఆవు చనిపోతే ఇప్పటికీ పల్లెల్లో ఆవు అంత్యక్రియలు దాదాపుగా మనిషికి జరిగినంత గొప్పగానే జరుగుతాయి. అత్యంత విలువైన జన్మ మానవుడిదంటారు. మనిషి చనిపోతే ఎంతఘనంగా కర్మకాండలు నిర్వహిస్తారో గోవులకు దాదాపుగా అలాగే చేస్తారు. ఇటీవల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆలమూరు వద్ద సత్యనారాయణ అనే రైతుకు చెందిన పాడి రైతు చనిపోయింది.
గతంలో రాష్ట్రంలో ఆవుల అందాల పోటీల్లో ఈ ఆవు ప్రథమ స్థానంలో నిలిచిన ఘన చరిత్ర ఉంది. అయితే ఇటీవల అనారోగ్యం పాలవడంతో ఆవు చనిపోయింది. కానీ మనిషికి ఏవిధంగా అంత్యక్రియలు చేస్తారో అదే స్థాయిలో ఈ ఆవుకి అంత్యక్రియలు నిర్వహించారు. చనిపోయిన ఆవుని అందంగా ముస్తాబు చేసారు. గ్రామంలో పొలాల్లో గోయ్యి తీసి అందులో ఉప్పువేసి పూడ్చారు. అంతకముందు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. తమకు ఆవుతో ఉన్న అనుబంధాన్ని మరచిపోలేక ఇంత ఘనంగా ఆవుకి అంత్యక్రియలు చేసామన్నారు రైతు సత్యనారాయణ. స్థానికంగా ఆవు అంత్యక్రియలు ఘనంగా జరగడం చాలా సంతోషకరమన్నారు ఆ గ్రామప్రజలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Local News