P.Ramesh, News18, Kakinada
అక్షరాలు దిద్దడం మొదలుపెట్టినప్పటి నుంచే స్విమ్మింగ్ వైపు అడుగులు వేసింది. ఆ తర్వాత జిమ్నాస్టిక్స్ వైపు ఆసక్తి పెంచుకుంది. క్రమంగా మల్టీ టాలెంటెడ్ కిడ్‌గా రన్నింగ్, రైఫిల్ షూటింగ్‌లలోనూ రఫ్ఫాడించింది. ఆమె ప్రతిభను చూసిన కోచ్‌కు ప్రత్యేక శ్రద్ధ పెట్టి శిక్షణ ఇచ్చారు. ఐదారేళ్లు తిరిగే సరికి అంతర్జాతీయ స్థాయిలో దేశం తరుపున ఆడేందుకు సెలక్ట్ అయ్యింది ఆ చిన్నారి. ఇంతకీ ఎవరా చిచ్చరపిడుగు..? ఇంత చిన్న వయస్సులో అంతర్జాతీయ స్థాయికి ఎలా వెళ్లింది తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే..! ఆటలంటే అందరికి ఇష్టమే కానీ ఆ ఇష్టంతో ఇంకొంచెం కష్టపడితే ఆ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అలాంటి అద్భుతాలు సృష్టిస్తున్న ఓ చిన్నారి తూర్పు గోదావరి (East Godavari District) లో పతకాల పంట పండిస్తోంది. కాకినాడ (Kakinada) కు దగ్గరలో ఉన్నటువంటి పెద్దాపురం మండలం ఆర్.బి.పట్నానికి చెందిన మన్యం పల్లవి(8) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతుంది.
చిన్ననాటి నుండి ఆమెకు క్రీడల పట్ల ఆసక్తి ఏర్పడింది. ఒకటవ తరగతి నుండే స్విమ్మింగ్ చేయడం మొదలుపెట్టింది. మెరుపువేగంతో చేపపిల్లలా స్మిమ్మింగ్ చేసేది. క్రమేపి జిమ్నాస్టిక్స్, రన్నింగ్, రైఫిల్ షూటింగ్‌లలో ఆరితేరింది. కోచ్‌ల శిక్షణకు తోడు తన పట్టుదలతో అన్నిటిలోనూ రాణించడం మొదలుపెట్టింది. ఇంకేముంది ఎక్కడికి వెళితే అక్కడ పతకాలు సాధించడం పరిపాటిగా మారిపోయింది.
చిన్నతనంలోనే క్రీడలపై పల్లవి ఆసక్తిని చూసిన తండ్రి ఆ చిన్నారిని ప్రోత్సహించాడు. ఆడపిల్ల అయితేనేం ఆడపులిలా మార్చాలని నిశ్చయించుకున్నాడు. వాళ్లదేమో పక్కా పల్లెటూరు ఎలాంటి సౌకర్యాలు ఉండవు.. కానీ తన కుమార్తెకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించాలనే ఉద్దేశంతో కాకినాడలో స్పోర్ట్స్ అథారిటీలో చేర్చించాడు.
అక్కడే ఆమెకు తగిన శిక్షణ ఇప్పించాడు. ప్రతీరోజు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మరి కాకినాడకు కూతురుని తీసుకెళ్లి స్విమ్మింగ్, రన్నింగ్, జంపింగ్‌లతోపాటు జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ ఇప్పించాడు. పల్లవి తన పట్టుదలతో అన్నిటిలోనూ మెళకువలు నేర్చుకుంది. మెరికలా రాణించడం మొదలుపెట్టింది.
పెద్దాపురం టూ ఈజిప్టు వరకు చిన్నారి ప్రయాణం..!
గ్రామంలో కబడ్డి పోటీలు జరుగుతుంటే చూడటానికి వెళ్లినప్పుడు క్రీడల పట్ల పెరిగిన ఆసక్తే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని పల్లవి చెబుతోంది. 2019లో కాకినాడలో జరిగిన జోనల్ స్థాయి రోలర్ స్కేటింగ్‌లో ప్రథమస్థానంలో నిలిచిన పల్లవి, 2022లో జిల్లా స్థాయిలో జిమ్నాస్టిక్స్ లో కూడా తొలి స్థానం దక్కించుకుంది.
విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన పోటీల్లోనూ పాల్గొని విజేతగా తిరిగొచ్చింది. ప్రస్తుతం జిమ్నాస్టిక్స్ లో దేశం తరుపున ఆడేందుకు సిద్ధమైంది.., అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు ఎంపికైంది. అక్టోబర్ లో ఈజిప్టులో జరిగే పోటీలకు అండర్-9 కేటగిరిలో పాల్గొననుంది. అందుకోసం ప్రతిరోజు కఠోర శ్రమతో సిద్ధమవుతోంది. ఇంటర్నేషనల్ లెవల్‌లో తన సత్తాచాటుతానంటోన్న చిన్నారి పల్లవికి ఆల్ ది బెస్ట్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kakinada, Local News