హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Farmers: ఆంధ్రా అన్నపూర్ణకి విత్తనాల కొరత..! క్రాప్ హాలిడేతో సగానికి పైగా సాగుపై సందిగ్ధం..!

AP Farmers: ఆంధ్రా అన్నపూర్ణకి విత్తనాల కొరత..! క్రాప్ హాలిడేతో సగానికి పైగా సాగుపై సందిగ్ధం..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) లో వరి సాగు ప్రారంభమైంది.. డెల్టా కాలువలకు సాగునీరు విడుదల కావడంతో పాటు వర్షాలు కూడా ఆశాజనకంగా ఉండటంతో రైతన్న నారుసాగు ప్రారంభించారు. ఇదంతా బానే ఉన్నా వ్యవసాయశాఖ సూచిస్తోన్న వరి రకం విత్తనాలకు.. రైతులు ఆశిస్తోన్న రకాల మధ్య గందరగోళం నెలకొంది.

ఇంకా చదవండి ...

P Anand Mohan, News18, Visakhapatnam

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) లో వరి సాగు ప్రారంభమైంది.. డెల్టా కాలువలకు సాగునీరు విడుదల కావడంతో పాటు వర్షాలు కూడా ఆశాజనకంగా ఉండటంతో రైతన్న నారుసాగు ప్రారంభించారు. ఇదంతా బానే ఉన్నా వ్యవసాయశాఖ సూచిస్తోన్న వరి రకం విత్తనాలకు.. రైతులు ఆశిస్తోన్న రకాల మధ్య గందరగోళం నెలకొంది. దీంతో ఒక పక్క క్రాప్ హాలిడేతో సగానికి పైగా సాగుపై సందిగ్ధం కొనసాగుతుండగా.. విత్తనాల వ్యవహారంతో ఖరీఫ్ సాగు పై అస్పష్టత ఏర్పడింది. ఆంధ్రా అన్నపూర్ణగా ప్రసిధ్ది చెందిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వరి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.. ఈ ఏడాది కాలువలకు నీరు ముందుగా విడుదల చేసినా రైతులకు సాగుకు అనుకూలమైన పరిస్థితులు కనిపించడం లేదని వాపోతున్నారు.

ప్రధానంగా కోనసీమ జిల్లాలో పది మండలాలకు పైగా క్రాప్ హాలిడే ప్రకటించగా ఇప్పటి ఆ సమస్య కొలిక్కి రాలేదు.. అయితే మిగతా మండలాల్లో సాగు చేపట్టాలంటే ఏ రకం వరి విత్తనాలు వేయాలనేది ఇప్పుడు రైతుల ముందు సమస్యగా మారింది.. వ్యవసాయశాఖ అధికారులు ఒక రకం విత్తనాలు సాగు చేయాలని సూచిస్తుంటే రైతులు మరొక రకం విత్తనాలు కోరుతున్నారు.. డెల్టా ప్రాంతంలో తొలకరి సాగులో ఎంటియూ 7029 (స్వర్ణ), 1061, 1064 రకాలను వినియోగిస్తే ప్రభుత్వం ప్రణాళికల ప్రకారం కోతలు అక్టోబర్ నాటికి పూర్తవుతాయని అంచనా. అయితే కొందరు రైతులు మాత్రం బిపిటి 5204 (సాంబమసూరి) పిఎల్ఏ 1100, ఆర్పీ బయో రకం విత్తనాలతో పాటు ప్రైవేట్, హైబ్రీడ్ రకాల వరి విత్తనాలను సాగు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వం సూచిస్తోన్న రకాల వరి విత్తనాలను రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు అధికారులు.. అయితే రైతులు కోరుతున్న రకాలు మాత్రం ప్రైవేట్ డీలర్ల వద్ద కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.. దీంతో ప్రభుత్వం ఇచ్చే రాయితీని ఇతర రకాలు సాగు చేయాలని భావిస్తోన్న రైతులు నష్ట పోతున్న పరిస్థితి నెలకొంది.

ఇది చదవండి: ఏడారిలా గోదారి.. ఆ రెండు జిల్లాలకు భవిష్యత్తులో కష్టాలు తప్పవా..?


ప్రభుత్వం సూచిస్తోన్న వరి విత్తనాలు సాగు చేయడానికి పలు కారణాలను.. గతానుభావాలను కూడా చెబుతున్నారు రైతులు.. గత ఏడాది రబీ సీజన్ లో 1121 రకం విత్తనాలను సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచించారు. అయితే దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. అధికారులు వద్దని చెప్పిన బొండాలు రకం దిగుబడి బావుందని చెబుతున్నారు కోనసీమ రైతులు. అయితే ప్రభుత్వం ఆర్బీకేల్లో విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నప్పటికి అవసరానికి తగినంతగా ఉండటం లేదని ఆరోపిస్తున్నారు రైతులు. ఇక కోనసీమ జిల్లాలో ఇప్పటికే పంట కాలువలు.. డ్రైనేజీల పూడిక వల్ల సాగు నీరందక పలు మండలాల్లో క్రాప్ హాలిడే ప్రకటించగా మిగతా మండలాల్లో సాగు చేయాలన్నా విత్తనాలపై నెలకొన్న సందిగ్ధం రైతలను అయోమయానికి గురిచేస్తోంది.

ఇది చదవండి: ఏపీలో ఇక సినిమా చూడటం కష్టమేనా..? ఎంఓయూపై థియేటర్ల అభ్యంతరం..!


ప్రతీ ఏటా తుఫానులు.. వరదల నుంచి రైతులు పంట కాపాడుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.. అందులో భాగంగా ఈ ఏడాది జూన్ 1 న డెల్టా కాలువలకు సాగు నీటిని విడుదల చేసింది. ప్రభుత్వ ప్రణాళికల ప్రకారం జూన్ 30 నాటికి వరి నాట్లు పూర్తయితే మూడు నెలల పంట కాలం పూర్తయ్యే సరికి అంటే అక్టోబర్ నాటికి కోతలు పూర్తవుతాయి. కాని జూన్ చివరి వారం వచ్చిన కోనసీమ జిల్లాలో పది శాతం కూడా వరి నార్లు పోసిన దాఖలాలు కనిపించడం లేదు.. తూర్పు మధ్య డెల్టా ప్రాంతంలో ప్రభుత్వం ప్రణాళికలకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మేజర్.. మైనర్ ఇరిగేషన్.. డ్రైయినేజ్ ల పరిస్థితి ఆధ్వాన్నంగా మారడంతో వరదలు సంభవించే సమయంలో పంట నష్టపోతున్న పరిస్థితి గత రెండేళ్ల నుంచి ఎక్కవగా ఉంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న వనరులతో సాగు చేద్దామని భావించినా విత్తనాల విషయంలో నెలకొన్న గందరగోళం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. గత రెండేళ్లుగా సరిగ్గా కోతల సమయంలో పంటలు వర్షార్పణం కావడంతో రైతులు విత్తనాలను సేకరించిన పరిస్థితి లేదు. వర్షాల సమయంలో యంత్రాలతో వరి కోతలు చేపట్టడంతో విత్తనాలను రైతులు ఒబ్బిడి చేసుకోలేకపోయారు.

ఇది చదవండి: మరింత పటిష్టంగా ఆరోగ్యశ్రీ.. ఇకపై వైద్యం మరింత ఈజీ.. సీఎం జగన్ కీలక ఆదేశాలు..


అయితే అర్బీకేల్లో సమృద్ధిగా విత్తనాలు అందుబాటులో ఉండటం లేదని ఆరోపిస్తున్నారు అన్నదాతలు.. మరోవైపు గత రబీ సీజన్ లో ధాన్యం సొమ్ములు ఇప్పటికి రైతులకు అందకపోవడంతో అప్పులు చేసి సాగు చేయాలా అని అన్నదాతలు ఆలోచనలో పడ్డారు.. దీంతో కోనసీమ జిల్లాతో పాటు తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లోనూ నాట్లు వేసే ప్రక్రియలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది.. గంపెడాశతో తొలకరి సాగు చేద్దామనుకున్న రైతన్నలకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి.. దీంతో ఈ ఏడాది వరి సాగు పై ఆంధ్రా అన్నపూర్ణగా ప్రసిధ్ది చెందిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రైతుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది.

First published:

Tags: Andhra Pradesh, East Godavari Dist, Farmers

ఉత్తమ కథలు