(Ramesh, News18, East Godavari)
గోదావరి యువకుల ఆలోచనే సెపరేటు..కొంత మంది తల్లిదండ్రులు చేసే వ్యాపారాల్లో సహకరిస్తే, మరికొందరు వ్యవసాయంలో కూడా వారికి చేదోడుగా నిలుస్తున్నారు. అలాంటి ఆలోచనలున్న ఓ యువకుడు ఏకంగా పువ్వులు పండిస్తూ లక్షల్లో వ్యాపారం చేస్తున్నాడు. మీరు చూస్తున్న ఈ పువ్వులను ఆర్కెడ్ పువ్వులు అంటారు. వీటిని ఎక్కువగా ఫంక్షన్లలలో అలంకరణ కోసం ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లలతోపాటు, బర్త్‌డే వేడుకలకు ఉపయోగించే ఈ పువ్వులు చాలా అందంగా ఉంటాయి. సాధారణంగా ఇతర దేశాలలో వీటి గిరాకీ కూడా ఎక్కవే. వీటి పెంపకం ఇక్కడ ప్రాంతాలు అనుకూలంగా ఉండవు. కానీ వాటిని పెంచుతూ ఆ యువకుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.
ఈ యువకుడి పేరు జవ్వాది వీరబాబు. ఇతడు 10వ తరగతి వరకూ చదువుకున్నాడు. చిన్నప్పటి నుండి వ్యవసాయం మీద మక్కువ ఎక్కువ. సాధారణంగా తనకున్న మూడెకరాల పొలాన్ని వివిధ పంటలకు ఉపయోగిస్తున్నాడు. అలాంటి వీరబాబు ఆలోచన ఒక్కసారిగా మారింది. ఎప్పుడూ వేసే పంటలతో అరకొర లాభాలు సరిపోవడం లేదని వేసే పంటను మార్చాలనుకున్నాడు. కొత్తగా ఆర్కెడ్ పూల సాగు చేద్దాం అని డిసైడ్ అయ్యాడు. ఇంకేముంది అనుకున్నదే తడువుగా పంట ప్రారంభించాడు.
బ్యాంకాక్ నుండి దిగుమతి..!
బ్యాంకాక్‌లో ఎక్కువగా లభించే ఆర్కెడ్ పూల మొక్కలను ఒక మొక్క రూ.80 చొప్పన ఏకంగా 60 వేల మొక్కలను దిగుమతి చేసుకున్నాడు. కాకినాడ దగ్గరలోని కత్తిపూడి వెళుతుండగా మార్గమధ్యంలో ఉండే నరసింగపురం అనే గ్రామంలో అర ఎకరంలో ఆర్కెడ్ మొక్కలను వేశాడు. వాటికి పూర్తిగా కావాల్సిన చల్లదనం వాతావరణాన్ని సృష్టించాడు. బిందు సేద్యం విధానంలో నీటిని మొక్కలకు చల్లుతూ పూర్తిగా చల్లటి వాతావరణంలో ఆర్కెడ్ పెరిగేలా చేశాడు యువ రైతు వీరబాబు. వీటి రక్షణ కోసం ప్రత్యేక షెడ్ల నిర్మాణం చేపట్టిన రైతు, దాదాపుగా 40 లక్షల రూపాయాలను పెట్టుబడిగా పెట్టాడు.
కొలంబియా జాతీయ పుష్పమైన ఆర్కెడ్ ఎక్కువగా థాయ్‌లాండ్‌లో పెరుగుతోంది. ఇది ఇక్కడ పెంచడానికి రైతు వీరబాబు పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావు. ఒకపక్క లక్షల పెట్టుబడి, మరోపక్క ఆదాయం వస్తుందో రాదోనన్న అలజడి వెరసి విజయం వైపు అడుగులు వేస్తున్నాడు.
ఎక్కడెక్కడి నుండో ఆర్డర్లు..!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతోపాటు, మహారాష్ట్ర, కర్ణాటక నుండి ఇక్కడకు ఆర్డర్లు వస్తున్నాయని రైతు చెబుతున్నాడు. పంట లాభాలవైపు మళ్లడంతో మరిన్ని రకాలు పండించేందుకు రైతు ప్రయత్నాలు మొదులపెట్టాడు. ప్రభుత్వం కూడా ఇటువంటి ఉద్యానవన పంటలపై సబ్సిడీ 50 శాతం ఇవ్వడంతో పెట్టుబడిపై ఆందోళన పడనక్కర్లేదని చెబుతున్నాడు యువ రైతు వీరబాబు.
రకరాల పుష్పాలు..!
ఆర్కెడ్ రకాల్లో ప్రధానంగా పలు రకాల పుష్పాలు కూడా ఉన్నాయి. వీటలో కార్నేషియన్, గ్లాడియోలెస్, హైబ్రీడ్ గులాబీ, కటిఫ్లవర్ చామంతి, ట్యూబ్ రోజ్ వంటివి ఎక్కువుగా వినియోగిస్తుంటారు. ఏషియాటిక్ లిల్లీ ఆర్కిడ్ పూలకు ఎక్కువ గీరాకి ఉంది.
అత్యంత ఖరీదైన పాలిహౌస్‌లో మొక్కల కొనుగోలుకే రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షల వరకూ వెచ్చించాల్సి ఉంటుంది. ఇంత ఖరిదైన మొక్కలు పెంపకం అంటే తీసుకునే జాగ్రత్తలకు అదే స్థాయిలో డబ్బులు ఖర్చులు చేయాల్సి ఉంటుంది. అయితే ఎంత చేస్తే అంత లాభం అన్నట్టుగా ఫలితాలివ్వడంలోనూ ఈ మొక్కలకు సాటిలేదని చెబుతున్నారు ఉద్యానవనశాఖ అధికారులు.
ఫోన్ నెంబర్ : 9951177799, రైతు వీరబాబు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kakinada, Local News