P.Ramesh, News18, Kakinada
తూర్పు గోదావరి (East Godavari) పేరు చెబితే చాలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మంచి విలువైన వనరుల కేంద్రంగా పిలుస్తారు. ఇక్కడ లభించే ఆహార ముడిసరకులకు గాని, పోషకాలతో కూడిన ఆహారానికి గానీ పెట్టింది పేరు. రంగు, రుచి, చిక్కదనం అన్నట్టుగా అన్ని కలగలిపిన గోదావరిలో ప్రతీది విశేషమే. అలాంటి ప్రత్యేకతలలో మొక్కజొన్న ఒక్కటి. తూర్పుగోదావరి-కాకినాడ పరిసర ప్రాంతాల్లో దొరికే మొక్కజొన్నకు మంచి గిరాకి ఉంది. ఇక్కడ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొన్ని గ్రామాల్లో పండే ఈపంట కోసం ప్రత్యేకంగా చెబుతారు. పెద్దాపురం మండలం దివిలి, పిఠాపురం మండలం విరవ, విరవాడ, జగ్గంపేటలోని కొన్ని గ్రామాలలో మొక్కజొన్న పంటను చాలా ఎక్కువగా పండిస్తున్నారు. ఈ మొక్కజొన్న ఎక్కువగా విశాఖపట్నం-కాకినాడ జాతీయ రహదారిపై కత్తిపూడి దాటిన తర్వాత నుండి రోడ్డుపక్కనే చాలా విరివిగా తక్కువ ధరకే విక్రయిస్తున్నారు.
సారవంతమైన నేలలే మూలం..!
ఎంతో రుచిగా ఉండే ఈ మొక్కజొన్న ఎక్కవ సారవంతమైన నేలలో పండిస్తారు. ఇక్కడి నేలలు కూడా ఈ పంటకు అనుకూలంగా ఉండటం కలిసొస్తుంది. 70 నుండి 80 రోజుల లోపులో పండే ఈ పంటను నిత్యం టన్నుల కొద్ది ఇతర జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎంతో పోషకాహరమైన ఈ మొక్క జొన్న తినడం ద్వారా ఫైబర్ కంటెంట్ శరీరానికి అందుతుందనేది నిపుణుల మాట. ఈ మొక్కజొన్న రుచిగా ఉండటం, మరోపక్క తక్కవ ధరకే మొక్కజోన్న పొత్తులు
అందుబాటులోకి రావడంతో గోదావరి వాసులు చాలా ఇష్టంగా తింటుంటారు.
ఏడాది పొడవునా వ్యాపారం..!
సాధారణంగా మొక్కజొన్న పొత్తులు వర్షాకాలంలో మాత్రమే గతంలో వ్యాపారం జరిగేది. కానీ ఇప్పుడు ఏడాది పొడవునా పండించడంతో సంవత్సరకాలంలో దాదాపుగా మొక్కజొన్న అందుబాటులో ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ మొక్కజొన్న పొత్తులో మరోరకంగా చెప్పే స్వీట్ కార్న్ పండిస్తున్నారు. ఎక్కువగా ఈ స్వీట్ కార్న్‌ను సినిమాహాళ్లు, మాళ్లలో విక్రయిస్తున్నారు. పట్టణాల్లో ఇదే స్వీట్ కార్న్ 200 రూపాయాల వరకూ విక్రయిస్తుంటారు. కాని అదే పొత్తు బయట ప్రాంతంలో రూ.20 కే దొరకుతుంది. రుచిగా ఉండటం వల్లే ఎక్కువగా ఇక్కడి పొత్తులే కొనుగోలు చేయడానికి మొక్కజోన్న ప్రియులు ఇష్టపడతారు.
విజయవాడ వెళ్లే మార్గంలో రాజమండ్రి, రావులపాలెంతోపాటు, ఇటు కాకినాడ పట్టణంలో మొక్కజోన్న పొత్తుల విక్రయాలు బాగా పెరిగాయి. ఇదిలా ఉంటే కాకినాడ పరిసర ప్రాంతాల్లో పండే ఈ మొక్కజోన్న పొత్తులనే కొనుగోలు చేసి, ఇతర ప్రాంతాల్లో విక్రయించేందుకు వ్యాపారులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కాకినాడ పరిసర ప్రాంతాలలో పంట పండించే గ్రామాలకు వచ్చి వ్యాపారం సాగిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.