Ramesh, News18, East Godavari
ప్రభుత్వం ఎక్కువగా వైద్య, విద్య పథకాలపైనే దృష్టి పెడుతోంది. రాష్ట్రంలో అందుకు తగ్గట్టుగా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉందనే చెప్పాలి. ఎందుకంటే విద్యాహక్కు చట్టం ప్రకారం కొన్ని షరతులకు లోబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా పథకాలు అమలు చేస్తుంటాయి. అలాంటి పథకాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడికి ప్రాధాన్యత కల్పిస్తోంది. దీంతోపాటు పౌష్టికాహరం అందించడంలోనూ ముందంజలోనే ఉందని చెప్పాలి.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందే పౌష్టికాహారం విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుతోంది. మెనులోనూ మార్పు తీసుకొచ్చింది. ఇక బాలింతలు, గర్భిణీలకు అందించే పౌష్టికాహారం విషయంలో కూడా అధికారులు వేగాన్ని పెంచారు. కాకినాడ జిల్లాలో ఉన్న అధికారులు కూడా పౌష్టికాహార విషయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణతో అంతా అప్రమత్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వరుసగా పాఠశాలలను సందర్శిస్తున్నారు. అక్కడ విద్యార్థులకు అందించే మెనూపై ఆమె దృష్టిపెట్టారు.
విద్యార్థులతో నేరుగా మాట్లాడుతున్న కలెక్టర్ ఫుడ్ అందించే విషయంలో మాత్రం రాజీపడటం లేదు. కొన్ని పాఠశాలల్లో ఆమె ఏకంగా విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్నారు. అయితే ఇటీవల ఓ పాఠశాలలో భోజనం చేసిన ఆమె భోజనం బాగుందని కితాబిచ్చారు. అదే సమయంలో నేను విజిట్ చేసానని ఇలా వండారా..రోజు ఇలా వండుతారా అనే ప్రశ్న సంధించడంతో అధికారులకు చెమటలుపట్టాయి. పాఠశాల ఉపాధ్యాయులు సైతం కంగారు పడ్డారు. ప్రతీ రోజు ఇలాగే భోజనం రుచిగా అందిస్తామని బదులివ్వడంతో ఆమె సంతృప్తి చెందారు. పౌష్టికాహారం అందించే విషయంలో మాత్రం రాజీపడొద్దని ఆమె చెప్పడంతో ఆదిశగా అడుగులు వేస్తున్నారు అధికారులు.
కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో పాఠశాలలో మనబడి- నాడు నేడు కార్యక్రమంపనులను పర్యవేక్షించిన సమయంలో కూడా అక్కడ పాఠశాల మెనునూ పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులకు బలమైన ఆహారం అందించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత తదితరాలను పరిశీలించి పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి కొద్దిసేపు గడిపారు.
పెద్దాడలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
పెద్దాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించి నాడు-నేడు కార్యక్రమం కింద 8 అదనపు తరగతి గదులు మంజూరుకాగా రెండు తరగతి గదులు పనులు మాత్రమే ప్రారంభమయ్యాయని మిగిలిన పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా పెద్దాడలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టరు కృతికా శుక్లా పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న డ్రగ్స్ స్టోరేజ్, లేబొరేటరీ, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్ తదితరాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వచ్చే నెల నుంచి ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఖాళీగా ఉన్న పాత పీహెచ్సీ భవనాన్ని గ్రామ సచివాలయం నిర్వహించుకునే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Local News