P Anand Mohan, News18, Visakhapatnam
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఆ ప్రాంతంలో చేపలు మత్స్యకారులకు (Fishermen) చిక్కడం లేదు. కనీసం చేపల జాడ కూడా తెలియడం లేదు. చెరువు చేపల విషయంలోనూ ఇదే జరుగుతోంది. చిన్న చిన్న గోదావరి కాల్వల్లో కూడా చేపల జాడ లేదు. కనీసం చేప పిల్లల్ని కూడా చూడలేకపోతున్నామని అక్కడి మత్స్యశాఖ అధికారులు అంటున్నారు. కారణం ఒకే ఒక్క చేప. అదే డెవిల్ ఫిష్. దెయ్యం చేపగా మత్స్యకారులు పేరు పెట్టారు. ఈ చేప అన్ని రకాల చేపజాతుల పాలిట మృత్యువుగా మారింది. ఒక్క చేపను కూడా వదలకుండా తినేయడం దీని స్పెషాలిటీ. ఇంతకీ ఆ చేపేంటి.. దాని కథేంటి..?
నిత్యం పాడిపంటలతో పచ్చగా కళకళలాడుతుంటాయి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు. గోదారమ్మ పరవళ్లు.. నిత్యం పిల్లకాల్వలు పంటపొలాలతో కనిపిస్తుంటుంది. అలాగే నదీ జలాల్లో, పంట కాల్వల్లో, చెరువుల్లో చేపల పెంపకం కూడా అక్కడి ప్రజల ప్రధాన జీవనాధారాల్లో ఒకటి. ఇలాంటి వైవిధ్యాల గల గోదావరి జిల్లాల్లో ఇప్పుడు ఓ చేప ఆందోళన రేపుతోంది. మత్స్యకారుల జీవితాలకే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అదే డెవిల్ ఫిష్ భారతదేశంలో అక్వారంగానికి తీరని నష్టం కలిగించే అతి భయంకరమైన, ప్రమాదకరమైన ఈ తక్కర్ రకం చేప రాజమండ్రి ప్రాంత గోదావరి జలాల్లో సంచరిస్తూ మత్స్యకారులను ఆందోళనకు గురిచేస్తోంది.
మొదట బంగ్లాదేశ్ నుండి అక్వేరియంలో పెంచుకునే ఆర్నమెంట్ ఫిష్ గా ఇది ఉండేదని మత్స్యశాఖ చెబుతోంది. మెల్లగా అక్కడ నుంచీ నదుల్లోకి.. అక్కడ్నించి సముద్రం ద్వారా భారతదేశానికి వచ్చిందంటున్నారు. ఇది ఉప్పునీరు, మంచినీరు ఏ నీటిలోనైనా బ్రతికేస్తుందట. నీటి నుంచీ బయటకు వచ్చిన చాలా సేపటి వరకూ బ్రతుకుతుంది. దాదాపు అరగంటపైనే ఇది ఆక్సిజన్ తీసుకుని బ్రతికిన వైనాన్ని మత్స్యకారులు కళ్లారా చూశారు. ఇంతేకాదు.. దీని నోటిలో పళ్లు కూడా అచ్చం పిరానా చేపకి ఉన్నట్టే ఉన్నాయి. ఈ ప్రమాదకరమైన కోరలతోనే ఎలాంటి చేపనైనా ఇది అంతం చేసేస్తుందని మత్స్యకారులంటున్నారు.
ఇది మత్స్యకార రైతులకు నష్టాన్ని కలిగిస్తూ సవాల్ విసురుతోంది. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంక, కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి సరిహద్దుల్లో ఇది కనిపించింది. ఇక్కడి తూర్పు డెల్టా ప్రధాన కాల్వలో వెటకు వెళ్లిన మత్స్యకారులకు ఎంత ప్రయత్నించినా చేపలు పడలేదు. కొన్నిచోట్ల వలకు ఈ డెవిల్ చేప చిక్కింది. అయితే మత్స్యకారులకు వింతగాను, భయంకరంగా కనిపించింది. వెంటనే వారు మత్స్యశాఖకి, మీడియాకు చూపించారు.
ఇది ప్రమాదకరమైన చేపని.. మిగిలిన చేపలపై దాడిచేసి వాటిని తనకు ఆహారంగా తీసుకుని రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇది విత్తన చేపలు ద్వారా రాష్ట్రం నలుమూలలకు విస్తరించిందని, ఆక్వా రంగానికి పెద్ద సమస్యగా తయారయిందని వివరించారు. చేపల పెంపకం రంగానికి ఇది చాలా ప్రమాదకర పరిణామంగా చెప్పారు. ఇదివరకు సముద్రంలో కనిపించిన ఈ చేపలు ఇప్పుడు చెరువులు, కాల్వల్లో కనిపించడం పై ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ చేపను అస్సలు బ్రతకనీయొద్దని మత్స్యశాఖ అంటోంది. చేపను దొరికినచోటే అంతం చేయాలని అంటున్నారు. ఇది వందలు వేల సంఖ్యలో గుడ్లు పెడుతుందని.. దీని సంతతి పెరిగితే మత్స్య సంపదకి తీవ్ర నష్టం కలిగిస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Fish, Fishermen