P Ramesh, News18, Kakinada
ప్రభుత్వ పథకమంటే ప్రస్తుతం బోలేడు నిబంధనలు.. ఏదైనా పథకం అందివ్వాలంటే సవా లక్ష షరతులు. పథకాలు బాగున్నా వాటి విధానం మాత్రం పేదలకు సృసించడం లేదు. మరోపక్క నిత్యవసర ధరలు మండిపోతున్నాయి. ఇదిగో తగ్గిస్తాం.. అదిగో తగ్గిస్తాం అనే మాటలు తప్పితే పాలకుల పనితీరు మాత్రం మారడం లేదు. దీంతో పేదలకు ఆకలి పెరుగుతుంది. తప్ప తగ్గడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో ఉప్పు, పప్పు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక నూనె ధరకూడా శల శలా మరుగుతోంది. ఇంతిలా జరుగుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అందించే పేదలకు సరుకులు పంపిణీ కూడా అగమ్యగోచరంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉచిత సరుకుల పంపిణీకి భారీగా కోతలు పెడుతున్నారు.
కాకినాడ జిల్లా (Kakinada District) లో ఈపరిస్థితి మరింత ఘోరంగా మారింది. సకాలంలో ఇవ్వాల్సిన సరుకులు రావడం లేదు. కేవలం బియ్యం మాత్రమే ఎమ్డీయూ వాహనాల ద్వారా అందిస్తున్నారు. ఉచిత రేషన్ అనేది పేరుకు తప్పితే అమలు మాత్రం సాధ్యపడటం లేదని విమర్శలొస్తున్నాయి. అధికారులు మాత్రం తామేమి చేయగలమని, సరుకులు వస్తే ఇస్తాం తప్పితే తమ చేతుల్లో లేదని బదులిస్తున్నారు.
పూర్తిగా నిలిచిపోయిన కందిపప్పు
కందిపప్పు సరఫరా పూర్తిగా నిలిపివేశారు. వాస్తవానికి పోషకాహారానికి ప్రధానమైన కందిపప్పు రేషన్ దుకాణా ద్వారా సబ్సిడీ పై అందించేవారు. కాని గత రెండు నెలలుగా కందిపప్పు ఊసే లేదు. కొన్ని ప్రాంతాలకు మాత్రం పంచదార ఇస్తున్నారు. కొన్ని ఏరియాల్లో ఈసారి పంచదారకు కూడా బ్రేక్ పెట్టారు. కేవలం బియ్యం ఒక్కటే అందిస్తున్నారు. ఈప్రభావంతో ఈనెలలో కూడా పూర్తిస్తాయిలో ఏ ఒక్క సరుకు పేద వాడికి అందని పరిస్థితి నెలకొంది. బహిరంగా మార్కెట్లో కందిపప్పు, పంచదార ధరలు ఎక్కువగా ఉండటంతో వాటి కోసం ఎదురుచూస్తున్నారు పేదలు.
లెక్క 641 టన్నులు.. ఇచ్చింది 18 టన్నులు
జిల్లాలో ఈ నెలకు 641 టన్నుల కందిపప్పు లెక్కకు ఇవ్వాలి. కానీ కేవలం 18 టన్నుల కందిపప్పు మాత్రమే వచ్చింది. 331 టన్నుల పంచదార కేటాయింపు జరగాలి. కానీ 59 టన్నుల మాత్రమే జరిగింది. 9,280 టన్నుల బియ్యం కేటాయించగా , ఇందులో 7,800 టన్నుల బియ్యం మాత్రమే సరఫరా చేయాల్సి ఉంది. ప్రతీ నెల 25 వ తేది నుండి సరుకులు సరఫరా చేయాల్సి ఉండగా, అయితే కేవలం ఇప్పటి వరకూ 10 శాతం కూడా సరఫరా చేయలేని దుస్థితిలో పౌరసరఫరాల శాఖ ఉంది.
ఇదీ చదవండి : యమలోకానికి షార్ట్ కట్స్ ఇవే..! డేంజర్ అని తెలిసినా.. అధికారులకు పట్దదా..?
అయితే ఎమ్ ఎల్ ఎస్ పాయింట్ల వద్ద ఉన్న నిల్వలను పరిగణలోకి తీసుకోవాలని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రస్తుతం వచ్చిన సరుకులు, నిల్వ ఉంచిన సరుకులు పంచినా 50 శాతం కూడా దాటేలా లేదు. దీంతో పాటు,అంత్యోదయ, అన్నపూర్ణ వంటి కార్డులకు రాయితీలు ఇస్తుంటారు. ఈసారి సరుకులు లేకపోవడం వల్ల వారికి రాయితీపై సరుకులు ఇచ్చే పరిస్థితిపై క్లారిటీ లేదు. సరుకులు పంపిణీ తేదిలు పూర్తయే నాటికి పూర్తిగా అందిస్తామని చెబుతున్నప్పటికీ, సరుకులు ఎప్పుడొస్తాయో, ఎప్పుడిస్తారోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
17లోగా పూర్తి చేస్తారా..!
అధికారులు ఇస్తున్న వివరణ ప్రకారం. ఈనెల 17వ తేదిలోపు దాదాపుగా పూర్తిస్థాయిలో సరుకులు ఇచ్చేస్తామని అంటున్నారు. నిల్వలు చూస్తే సరిపోవడం లేదు. కొత్తగా సరకులు రావడం లేదు. ఇతర జిల్లాల నుండి వస్తున్న కందిపప్పు కోసం కళ్లు కాయలు కాచేలా చూడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న 100 టన్నుల కందిపప్పు ఏలా సరిపెడతారు. 85 శాతం వరకూ సరుకులు రేషన్ దుకాణాలకు వెళ్లాయన్న అధికారుల వాదనకు, పేదలు పడిగాపులకు పొంతన లేదు. మొత్తానికి ఈనెల 17వ తేదిలోపు సరుకులు పంపిణీ పూర్తవుతుందన్నది మాత్రం ఎంత నిజమో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Kakinada, Local News