P Ramesh, News18, Kakinada
అక్కడ పంట విరామ ఉద్యమం ఆలయాల ఆదాయానికి గండికొడుతోంది .శిస్తు ఎలాగైనా రాబడతామంటూ దేవాదాయ శాఖ చెబుతుంటే.. కట్టేది లేదంటూ రైతులు తేల్చిచెబుతున్నారు. మరి ఈ పరిస్థితి ఎటువైపు దారితీస్తోందో..? రైతులంటే దేశానికి వెన్నెముక.. వారి లేనిదే అసలు మనం లేమనే చెప్పాలి. ఎందుకంటే ఆరుగాలాలు కష్టపడి పండించిన పంటనే మనం తింటాం. మనం కొనుక్కొని తిన్నా ఆ క్రెడిట్ మొత్తం రైతుకే దక్కుతుంది. ఎందుకంటే అసలు పంటే లేకపోతే మనం ఏం కొంటామనేది ఆలోచించాలి. అయితే రైతులు ఆ పంట పండించడం కోసం పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా కోనసీమ జిల్లా (Konaseema District) లో పరిస్థితి దయనీయకరంగా మారింది. ఇక్కడ ఈ ఏడాదీ ఖరీఫ్ లో కోనసీమ రైతులు ఎక్కువ మంది తమకు జరుగుతున్న అన్యాయం పట్ల పంట విరామం ప్రకటించారు.
ఇందుకు ముఖ్య కారణాలు చాలానే ఉన్నాయి. పంటకు సాగునీరు అందడం లేదని, కాల్వల ఆధునికీకరణ, ధాన్యం రేటు పెంపు తదితర అంశాలతో ఉద్యమం చేశారు. ఈ సమయంలో వారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేవాదాయశాఖకు తగిలింది. అదేలా అంటే అక్కడ కొన్ని మండలాల్లో దేవాదాయ శాఖకు చెందిన భూములు లీజుకు తీసుకున్న రైతులు పంట విరామంలో పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం పంట విరామంతో తమకు సంబంధం లేదని లీజు సొమ్ము చెల్లించాలని రైతులకు నోటీసులు జారీ చేసింది దేవాదాయశాఖ.
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఐ.పోలవరం మండలంలోని మురమళ్ల శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయానికి 90 ఎకరాల వరకూ సేద్యపు భూమి ఉంది. ఈ భూమిని లీజుకు ఇచ్చారు. దీనిపై ఏటా రూ.10 లక్షల వరకూ ఆదాయం వస్తుంది. ఈ భూమి గల రైతులు పంట విరామంలో పాల్గొన్నారు. తాము పంట పండించలేని కారణంగా తమకు మినహాయింపు ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు. ఇదే మండలంలో తిళ్లకుప్పలో ఇదే పరిస్థితి. ఇక్కడ దేవత తిళ్లాలమ్మ ఆలయానికి రూ.లక్ష వరకూ ఏటా ఆదాయం వస్తుంది. ఈ ఏడాది పంట విరామం ప్రభావంతో దూప దీప నైవేద్యాలకు ఇబ్బందులు తప్పడం లేదు.
కోనసీమలో దాదాపుగా 1.87 లక్షల విస్తీర్ణంలో సాగు చేయాల్సి ఉండగా 40 వేల ఎకరాల్లో ఈ ఏడాది సాగు శూన్యం కావడంతో ఆదాయం లేదు. మొత్తం మీద ఇక్కడ జిల్లాలోని 804 ఆలయాలు, 58 సత్రాలకు కలిపి రావాల్సిన ఆదాయానికి పూర్తిగా గండి పడటంతో దాదాపుగా కోటిన్నర ఆదాయ రాబడి కష్టాలు ఎదురయ్యాయి.
శిస్తు చెల్లించాల్సిందే..!
ఇదిలా ఉంటే దేవాదాయశాఖ శిస్తు రాని భూముల లీజు దారులందరికీ నోటీసులు జారీ చేస్తుంది. వేలం పాటలో నిబంధనల ప్రకారం నష్టం ఉన్నా, లాభం ఉన్నా తమకు సంబంధం లేదని పాట పాడుకున్నప్పుడు ఉన్న నిబంధనలే లీజు దారులందరికీ వర్తిస్తాయని చెబుతోంది. ఈ మేరకు ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లింది. ఒక పక్క రైతులు తాము పంట పండని దానికి సొమ్ములు కట్టలేమని మినహాయింపు ఇవ్వాలని చెబుతుంటే, ఎలాగైనా పాత బకాయిలు చెల్లించకపోతే ఇబ్బందులు తప్పవని అంటుంది దేవాదాయశాఖ. ఈ నేపథ్యంలో భవిష్యత్తుల్లో కోట్లాది రూపాయాల ఆదాయం రాబడతారా.. రాయితీ ఇస్తారా అనేది కాలమే నిర్ణయించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Local News