P Ramesh, News18, Kakinada
రోజులు మరీ దారుణంగా ఉన్నాయి. ఉదయం లేచేసరికి ఎక్కడ నుండి ఎటువంటి వార్త వినాల్సి వస్తుందోననే ఆందోళన వెంటాడుతుంది. ఇటీవల కాలంలో కొంత మంది దుండగులు జనం మధ్యే తిరుగుతూ తెలిసిన వారిలా నటిస్తూ మాయమాటలతో నిలువు దోపిడి చేస్తున్నారు. కొద్ది రోజలు క్రితం కాకినాడ జిల్లాలో ఈతరహా దొంగతనాలు ఎక్కవుగా జరుగుతున్నాయి. వీధిలో పలానా ఇంటిలోకి అద్దెకు దిగామని చెప్పి మోసం చేయడం, అప్పులు ఇస్తున్నామని, ఎక్కువ వడ్డిలు ఇప్పిస్తామని నమ్మబలికి డబ్బును దోచుకునే ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల కోనసీమ జిల్లా (Konaseema District) లో జరిగిన ఘటన చూస్తే అంతా అవాక్కవాల్సిందే. ముమ్మిడివరం మండలం ఐ.పోలవరం వద్ద సత్యవతి అనే మహిళ ఇంటి బయట ఉండగా తెలిసిన వారిగా నటించిన ముగ్గురు యువకులు మహిళ మెడలో బంగారాన్ని లాక్కుని పోయారు. ఇంతలో తేరుకున్న ఆమె పెద్దగా కేకలు వేయడంతో స్థానికంగా అక్కడ ఉన్న యువకులు కొంత మంది వారిని వెంబడించారు. మెడలో గొలుసు లాక్కుపోతున్నారు పట్టుకోండని పెద్దగా కేకలు వేయడంతో గ్రామస్తులు కూడా పరుగులు తీసి దొంగలను పట్టుకుని చితకొట్టారు.
అయితే వీరిలో ఒకరు తప్పించుకోగా, మిగిలిన ఇద్దరిని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు దొరికిన దొంగలు ఎక్కడెక్కడ ఇలాంటి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారనే దానిపై కూపీ లాగుతున్నారు. ఇదే తరహా ఘటనలు కోనసీమలో ఎక్కువగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా యువకులు మత్తుకు బానిసై ఖర్చులకు డబ్బుల్లేక వృద్ధులను టార్గెట్ చేస్తున్నారు. పెద్ద వయస్సు గల మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. పాఠశాలల వద్ద చిన్నారులు, బ్యాంకుల వద్ద వృద్దులు వీరికి టార్గెట్. గత కొద్ది రోజుల క్రితం కాకినాడ జిల్లాలో ఈతరహా ఘటనలు జరిగాయి.
రాజమండ్రిలో ఓ ముఠా దారి మార్గంలో పోయే వారిని వదలడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే, వ్యక్తుల అవసరాలు దోపిడీ మార్గాలకు రాచబాట వేస్తున్నాయి. పోలీసులు పహారా అంటున్నారు తప్పితే, ఎవరిని ప్రశ్నించిన రాజకీయ నేతల ఒత్తిడికి తలొగ్గక తప్పడం లేదు. అందుకే ఒక సంఘటన జరిగినా.. మరలా పదే పదే అదే తరహా సంఘటనలు జరగడానికి మూలకారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.
కళాశాలలు, పాఠశాలలతోపాటు, ఖాళీగా విచ్చలవిడిగా తిరిగే వారిపై పోలీసులు నిఘా ఉంచాలి. ఇటీవల కాలంలో అమ్మాయిలు కూడా మోసాలకు పాల్పడటం చూస్తున్నాం. కేవలం అబ్బాయిలే కాదు, అమ్మాయిలలో కొంత మంది ప్రొఫెషనల్ దొంగలుగా మారుతున్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన తెలిసిన వారిగా నటించి దోచుకుంటున్నారు. ఇలా ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, కొత్త వ్యక్తులపై పోలీసులే కాదు, జనం కూడా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే జరిగే నష్టానికి బాధ్యులు కాక తప్పదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.