P Ramesh, News18, Kakinada
సాంకేతికరంగం కొత్త పుంతలు తొక్కుతుంది. ఒకేసారి పదుల కొద్ది రాకెట్ల ప్రయోగం. దేశం సాంకేతికంగా విజయాల బాట, ఇలా చూస్తే అసలు మనం పాశ్చాత్య దేశాలతో దాదాపుగా పోటీ పడుతూ ముందు సాగిపోతున్నాం. అందుకే భారతదేశం (India) అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముందుంది. ఇలా సాగిపోతున్న తరుణంలో సాంకేతిక రంగాన్ని కొంత మంది కేటుగాళ్లు స్వార్థానికి ఉపయోగిస్తూ ప్రజలనునానా బాధలు పెడుతున్నారు. ఉదయం లేస్తే ఎక్కడొ ఒక చోట సైబర్ నేరాలు (Cyber Crimes) జరుగుతూనే ఉన్నాయి. బ్యాంకుకు వెళ్లక ముందు ఉండే నగదు, వెళ్లి చూసాక ఉండే నగదు లెక్కల్లో తేడాలు ఉంటున్నాయి. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువగా సైబర్ నేరాలకు గురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఆన్లైన్ బ్యాంకింగ్ కొంపముంచుతుందా..!
ప్రస్తుతం అన్ని చోట్ల ఆన్లైన్ బ్యాంకింగ్ (Online Banking) ద్వారానే నగదు లావాదేవిలు జరుగుతున్నాయి. వీటితో పాటు పోన్‌పే-జిపే లతోపాటు, పేటీయం వంటి యాప్ ల ద్వారా నగదు లావాదేవిల వేగం బాగా పెరిగింది. ఇలాంటి వాటి ద్వారా సులువైన లావాదేవిల్లో కేటుగాళ్లు ఆసరాగా తీసుకుంటున్నారు. చిన్న పాటి నిర్లక్ష్యంతో మొబైల్‌కి వచ్చే ఓటీపీల ద్వారా ఖాతాల్లో నగదు దోచేస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకుల వద్ద ఏటీఎమ్‌ల పిన్ నెంబర్లను ఎవరికీ చెప్పొద్దని ఒక పక్క బ్యాంకుల వారు మొత్తకుంటున్నా, కనీసం జాగ్రత్తలు పాటించకుండా, నగదు డ్రా చేసేటప్పుడు కొంత మంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను పసిగట్టి పిన్ నెంబర్లను వేరే వ్యక్తులకు చెప్పడం ముప్పు తెచ్చిపెడుతోంది.
అవగాహనతోనే సైబర్ నేరాల అదుపు
సైబర్ నేరాలను అదుపు చేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంది. ఆర్బిఐ సూచనలతోపాటు, కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు ఇస్తున్న ఆదేశాలతో ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) లో కెనరా బ్యాంకు ప్రత్యేక కళాజాతా ప్రదర్శనల ద్వారా వినియోగ దారులను అప్రమత్తత చేస్తుంది. మ్యాజిక్ షోల వంటి వాటిని ఏర్పాటు చేసి, నిరక్ష్యరాసులకు, చిరు వ్యాపారులకు నగదు లావా దేవిలు జరిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలను నిర్వర్తిస్తోంది.
ఖాతాదారులకు ఎవరు ఫోన్ చేస్తున్నారు..
ముఖ్యంగా సైబర్ నేరాలపై లోతైన విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో కొంత మంది ముఠాగా తయారై నెట్ వర్క్‌గా మారి, కొన్ని నగదు ఖాతాలను గుర్తిస్తున్నారు. వీటితో పాటు చదువుకోని వారిని తెలివిగా ఫోన్లో ట్రాప్ చేసి, తక్కువ వడ్డీలతోరుణాలు ఇప్పిస్తామని మభ్యపెట్టి ముంచేస్తున్నారు. ఏటీఎమ్ టైమ్ అయిపోతుంది, అప్డేట్ చేయించుకోవాలనే సమాచారం ఇస్తున్నట్లుగా నటించి ఖాతాలలో నగదును సులువగా లాగేస్తున్నట్లుగా గుర్తించారు. అందుకే ముఖ్యంగా నిరక్ష్యరాసులకు ఎక్కువగా అవగాహన కల్పించాలని, కళాజాతాలను ప్రదర్శిస్తూ జానపద విధానంలో అవగాహన కల్పిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Cyber crimes, East godavari, Local News