P Ramesh, News18, Kakinada
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు గతంలో ఏ ప్రభుత్వం చేసిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రిగా జగన్ (YS Jagan) ప్రమాణ స్వీకారం నాటి నుండి పథకాల వరద పారుతూనే ఉంది. అయితే రాను రాను జగన్ తీసుకున్న నవరత్నాలు మసకబారుతున్నాయి. అనుకున్నది ఒక్కటి, జరుగుతుంది మరొక్కటిగా మారిపోయింది. పథకాల లబ్ధిదారులు అనూహ్యంగా తగ్గిపోతుంటే, కొన్ని పథకాలు మాటల్లో చెప్పినంత వేగంగా చేతల్లో జరడం లేదు. నవరత్నాల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా సామాజిక వర్గాల లబ్ధిదారులకు వివిధ పథకాల కింద నగదును ఖాతాల్లో జమ చేస్తోంది. ఈబీసీ నేస్తం పేరుతో 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన అగ్రవర్ణాల పేద మహిళలకు ఒక్కొరికి ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్లలో రూ .45 వేలు జమ చేయనున్నట్టు చెప్పింది.
అగ్రవర్ణ పేదల సంక్షేమం పేరుతో ప్రత్యేకంగా కాలమాన పట్టికను విడుదల చేయడంతో పాటు నిర్ణీత తేదీల్లో నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమచేస్తామని తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరా నికి సంబంధించి తొలి విడతగా గత ఏడాది జనవరిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కు చెందిన 55 వేల మందికి రూ.122.51 కోట్ల మేర నగదును లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ అంటే.. 2022-23ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆపథకం ఊసే లేకపో యింది. సంక్షేమ క్యాలెండర్ ప్రకారం నిధులు విడుదల కాకపోవడంతో లబ్ధిదారుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో ఏం చేయాలో తెలియక ఆందోళన పడుతున్నారు లబ్ధిదారులు.
ఇదిలా ఉంటే స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంక్ లింకేజీ రుణాల మాఫీ నిమిత్తం ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన సుమారు 6 లక్షల మంది మహిళలకు ప్రస్తుతం మూడో పథకం విడత అమలు కింద రూ.500 కోట్ల మేర జమ చేయాల్సి ఉంది. కాలమాని ప్రకారం ఈ ఏడాది జనవరి నెలలోనే అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఈ నెల 25 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. అయినా ఇంతవరకు డీఆర్డీఏకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు.
మార్చి నెల గడిచిపోతున్నా ఈబీసీ నేస్తం పథకం అమలుకు పాత లబ్దిదారుల పునర్నమోదుతో పాటు, కొత్తగా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించారు. తూర్పు గోదావరి జిల్లాలో 58వేల మంది మహిళలను అర్హులుగా గుర్తించి తుది జాబితా ప్రకటించారు. వీరికి రూ.15 వేలు చొప్పున రూ.87 కోట్ల మేర నగదు జమ చేయాల్సి ఉంది. గత ఏడాది నవంబర్ లోనే మొదట ఇస్తామని, ఆపై డిసెంబరుకు వాయిదా వేశారు. 2023 జనవరి నెలాఖరున అమలు చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం మార్చి నెల సగం గడిచినప్పటికీ ఆ ఊసే లేదు. ఎంపికైన లబ్ధిదారులు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నగడు ఎప్పుడు జమ అవుతాయోనంటూ అగ్రవర్ణ పేద మహిళలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలులో మాత్రం జాప్యం అనూహ్యంగా జరగడం ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు ఆర్థిక నిపుణులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Local News, Navaratnalu