P Ramesh, News18, Kakinada
కార్తీకమాసం (Karthika Masam) అంటే చాలు శివునికి ఎంతో ప్రీతికరమైన మాసంగా చెబుతారు. తెల్లవారు జామున నిద్ర లేచి తలంటు స్నానమాచరించి, దీపారాధనలు చేస్తారు. సాధారణంగా ప్రతీ ఇంట్లో మహిళలు ఎక్కువగా చేసే పూజ దీపారాధన. అయితే ఇదే మాసంలో మరో విశిష్టమైన పూజ కూడా ఉంది. మన దేశంలో అయ్యప్ప దీక్ష (Ayyappa Deeksha) కు చాలా విశిష్టత ఉంది. కార్తీకమాసం ప్రారంభంలోనూ, ధనుర్మాసంలోనూ ఎక్కువగా చేపట్టే ఈ దీక్ష దాదాపుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. ఈ అయ్యప్ప దీక్ష పేరు చెబితే చాలు నల్లని దుస్తులు దర్శనమిస్తాయి. మెడలో పూసల దండలు, నుదిటి నుండి, కాళ్ల వరకూ విబూది రాసుకుని నిత్యం దీక్షలో మునిగి తేలుతారు. మండల దీక్ష, అర్థమండల దీక్షలతో నిత్యం తెల్లవారు జామునే స్నానమాచరించి అయ్యప్పస్వామి మంత్రాలు జపిస్తూ రెండు గంటలకుపైగా పూజ చేస్తారు.
మూడుపూట్ల స్నానం
అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులు మూడు పూట్ల తలంటు స్నానమాచరిస్తారు. ముఖ్యంగా చిన్న వయస్సు నుండి, పెద్దలు వరకూ ఈ దీక్షకు పూనుకుంటారు.మధ్యస్థ వయసు గల మహిళలు, యువతులు అయ్యప్ప దీక్ష వేయరు. అంతటి నియమనిష్టతలగల దీక్ష అయ్యప్ప దీక్ష. స్నానమాచరించి మడికట్టు కట్టి భోజనం ఆరగిస్తారు. కేవలం అరిటాకు, లేదా విస్తరాకు, ఏదైనా చెట్ల ఆకులపైనే భుజిస్తారు. భిక్షమంటూ జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవుతారు. ఇక్కడ ప్రత్యేకమైన వంటకాలు కేవలం స్వాములకు మాత్రమే వడ్డిస్తారు.
ఉల్లిపాయ, కారం, మసాలాలకు దూరం
దీక్ష చేపట్టిన 41 రోజుల పాటు ఉల్లిపాయతోపాటు, కారం, మసాలా, అధిక ఉప్పు వంటి ఉత్ప్రేరక పదార్థాలకు పూర్తిగా దూరమవుతారు. ఇతర వ్యాపకాలు ఉన్నవారు ఈ 41 రోజులు అన్నింటికి దూరంగా ఉండాల్సింది. దీక్ష అనంతరం అయ్యప్ప కొండకు వెళ్లి విరుముడి చేస్తారు. అయ్యప్ప భక్తులు. ఆర్థికంగా ఇబ్బందులున్నవారు, ఆయా ప్రాంతాల్లో ప్రముఖ క్షేత్రాల్లో విరుముడి చేస్తారు. ఇలా అన్ని రకాలుగా అయ్యప్పమాల విశిష్టత ఉంది. ప్రత్యేక మంత్రాలు జపిస్తూ మాలధారణ రోజులన్ని పుణ్య కార్యక్రమాలకే సమయాన్ని వెచ్చిస్తారు.
పడిపూజ ఎంతో ప్రత్యేకం
అయ్యప్ప మాలాధారణ భక్తులు నిర్వహించే అత్యంత విశిష్టత కలిగిన పడిపూజ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈపూజ ఒక్కొక్క భక్తుడు ఒక్కొసారి నిర్వహిస్తారు. దాదాపుగా వందల మంది స్వాములు ఒకే చోటకు చేరుకుని పడిపూజ నిర్వహిస్తారు. అరటి బోదెలు, డొప్పలతో అయ్యప్ప కొండ నిర్మిస్తారు. 18 మెట్లు ఉండేటట్లు ఈకొండ నిర్మాణం ఉంటుంది. అక్కడకు అయ్యప్ప ప్రతిమను ఉంచి మూడు గంటలకుపైగా అయ్యప్పను జపిస్తూ పూజ చేస్తారు. మంత్రాలు, అయ్యప్ప నినాదాలతో అక్కడ పూజ జరిగినంత సేపు ఆధ్యాత్మికతతో ఒళ్లంతా పులకరిస్తోంది. భక్తులు తన్మయత్వం పొందుతారు. కేవలం రాత్రి సమయంలో మాత్రమే ఈపూజ జరుగుతుంది. వచ్చిన భక్తులందరికీ అక్కడే భిక్ష ఉంటుంది. అయ్యప్ప మాలాధారణలో పడిపూజకు ఉన్న విశిష్టత మరే ఏ పూజకు ఉండదు. అంత నియమ నిష్టతలతో జరిగే ఈపూజకు అయ్యప్ప మాలాధారణ భక్తులు విధిగా హాజరుకావాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ayyappa mala, East godavari, Local News