(Ramesh Babu, News18, East Godavari)
సచివాలయాలను సీఎం జగన్ (CM YS Jaganmohan Reddy) మానస పుత్రిక అంటారు. ప్రస్తుతం ఏపీలో గ్రామ/ వార్డు సచివాలయాలకే (AP village secretariat) అధిక ప్రాధాన్యత. దాదాపుగా అన్ని పనులు అక్కడే జరగాలి ఇది ప్రభుత్వం నిర్ణయం. ఇటీవల ఆస్థి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా సచివాలయాలకే లింక్ చేశారు. భూసర్వే దగ్గర నుండి, ఎటువంటి సర్టిఫికెట్ కావాలన్నా వార్డు/ గ్రామ సచివాలయాన్నే సంప్రదించాలి. వీరికి అనుసంధానంగా వలంటీర్లు కూడా పనిచేస్తున్నారు. మొత్తం మీద స్వయం ప్రతిపత్తి సంస్థల్లా సచివాలయాలు మారిపోయాయి. జగన్ సర్కార్ పాలన చేపట్టిన తర్వాత అత్యంత భారీ స్థాయిలో సచివాలయాల ఉద్యోగులను నియమించింది. ప్రస్తుతం ఉన్నవారిలో దాదాపుగా 60 శాతం పైగా ప్రొబిషన్ డిక్లరేషన్ కూడా జరిగిపోయింది. పర్మినెంట్ ఉద్యోగుల ఖాతాలో చేరిపోయారు. వీరికి ప్రభుత్వం ద్వారా అందే పీఆర్సీ, హెల్త్ సౌకర్యాలతోపాటు, దాదాపు అన్నింటిలోనూ ప్రభుత్వ ఉద్యోగులలో భాగస్వాములను చేశారు.
ప్రస్తుతం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కూడా సచివాలయ ఉద్యోగాలను ఆధారం చేసుకునే జరుగుతుంది. ఆయా ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే వలంటీర్లను, సచివాలయాల సిబ్బందిని వెంట పెట్టుకుని ప్రతీ ఇంటికి తిరుగుతున్నారు. కనీసం ఒకరికి పెన్షన్ మంజూరు కావాలి అన్నా సచివాలయమే ప్రదాన కేంద్రంగా ఉండటంతో మొత్తం పాలన వ్యవహారాలకు సచివాలయాలు చిరునామాగా మారిపోయాయి.
అయితే పని ఒత్తిడి తట్టుకోలేక కొంత మంది, ఇంతకన్నా మెరుగైన ఉద్యోగాలు సాధించి కొంత మంది సచివాలయాల ఉద్యోగాలకు రాజీనామా చేశారు. దీంతో దాదాపుగా ఏపీలో 14 వేలకు పైగా సచివాలయాల ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడ్డాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఖాళీలు అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో కాకినాడ కలెక్టర్ సచివాలయాల ఉద్యోగాల ఖాళీలపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లాలో దాదాపుగా 800 వరకూ ఖాళీలున్నట్లు తెలుస్తోంది. ఈసంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
Visakhapatnam: బీఆర్ఎస్‌లోకి 70 మంది ఏపీ నేతలు..? విశాఖ వేదికగా రెండో సభ..
అయితే ఇటీవల కాలంలో కారుణ్య నియామకాల కింద కొన్ని పోస్టులను భర్తీ చేశారు. ఇంకా డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ప్లానింగ్ సెక్రటరీ పోస్టులు ఎక్కువగా ఖాళీలున్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నట్లు సమాచారం. గతంలో ఈపోస్టులను అభ్యర్థులకు అర్హత లేకపోవడంతో గతం నుండి ఖాళీగా వదిలేశారు. ఈసారి సైన్సు గ్రూప్(బైపీసీ) ఆధారంగా పోస్టులను భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది.
మొత్తం మీద ఏప్రిల్ నెలాఖరునాటికి పోస్టులకు సంబంధించి ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అధికారులు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఖాళీల వివరాలను ప్రభుత్వానికి పంపించారు. అతి త్వరలోనే ఈ పోస్టుల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ వస్తుందని అధికారులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap jobs, East Godavari Dist, Local News