P Ramesh, News18, Kakinada
రైతులు పండించిన ధాన్యంపై మిల్లర్లు మాత్రమే కొనుగోలు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కళ్లాల వద్దకు వెళ్లి ధాన్యం తీసుకుని ఆడించి రేషన్ దుకాణాలకూ వాళ్లే సరఫరా చేసే అడ్డగోలు విధానాన్ని అమలు చేసేందుకు రంగం సిద్దం చేస్తోంది. ధాన్యం బకాయిలు సక్రమంగా ఇవ్వకుండా అన్నదాతలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఇప్పుడు సేకరణ బాధ్యతల నుంచి తప్పుకొని మిల్లర్లకే సర్వాధికారాలు కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకుంటుంది. ఈ ఏడాది రబీ సీజన్ నుండే ఇది మొదలు కానుంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం కాకినాడ జిల్లాలో 5 మండలాలను ఈ ధాన్యం సేకరణపై ప్రాజెక్టు మండలాలుగా ఎంపిక చేసింది. టెండర్లు ఖరారు చేసి 65 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వీరికి కట్టబెట్టేం దుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా బియ్యాన్ని ఆడించి, ప్యాకింగ్ చేసి, విదేశాలకు కూడా పంపించేందుకు అవకాశాలు కల్పిస్తోంది. ఇప్పటి వరకూ జిల్లాలో ప్రతీయేటా ఖరీఫ్, రబీ సీజన్ లో వచ్చే ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తోంది.
ధాన్యాన్ని బ్యాంకు గ్యారెంటీల ద్వారామిల్లులకు అందించి తద్వారా సీఎంఆర్ స్కీమ్ కింద తిరిగి బియ్యం తీసుకుంటుంది. ఈ బియ్యాన్ని గౌడౌన్లకు తరలించి బియ్యం తీసుకుని వాటిని రేషన్ బియ్యం కింద పంపిణీ చేస్తోంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ విధానం స్థానం లో పూర్తిగా మిల్లర్లకే రైతు ధాన్యంపై పెత్తనం కట్టబెట్టేలా కొత్త విధానం అమలుకు దారులు తెరచింది. ఇందులో భాగంగా జిల్లాలో ఐదు మండ లాలను ఎంపిక చేసి అక్కడ ధాన్యం మొత్తాన్ని మిల్లర్ల చేతికే అప్పగించబోతోంది. ఈవిధంగా రెండేళ్ల వ్యవధిలో రూ.100 కోట్ల టర్నోవర్ ఉన్న మిల్లుల యజమానులు ఈ టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించింది.
వచ్చేనెల నుంచి ప్రారంభం కానున్న రబీ ధాన్యం సేకరణ ప్రక్రియలో నేరుగా రైతుల వద్దకు వెళ్లి ధాన్యం తీసుకోవాలి. అక్కడినుంచి సొంత రవాణా వాహనంలో అర్జీకే కేంద్రం వద్దకు తెచ్చి తూకం వేయించుకుని మిల్లుకు తీసుకువెళ్లాలి. ఆనక అక్కడ మర ఆడించి నేరుగా అధికారులు చెప్పిన రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేయాలి. ఇప్పటికే కొందరు జిల్లా మిల్లర్లు ఈ ధాన్యం దక్కించుకోవడానికి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో టెండర్లు దాఖలు చేశారు. విమర్శలకు తావిస్తున్న ఈ కొత్త విధానం కింద జిల్లాలో తొలిదశ కింద పిఠాపురం, సామర్లకోట, కాజు లూరు, పెదపూడి, కరప మండలాలను అధికారులు ఎంపిక చేశారు.
పిఠాపురం మండలంలో 9వేల మెట్రిక్ టన్నులు, సామర్లకోట 18వేలు, కాజు లూరు 14, పెదపూడి 12, కరపలో 12వేల మెట్రిక్ టన్నుల చొప్పున మొ త్తం 65 వేల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని టెండర్ల ద్వారా మిల్లర్లకు కట్టబెట్టనున్నారు. వాస్తవానికి వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న రబీ దాన్యం సేకరణ కింద రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని జిల్లా పౌరసరఫరాల సంస్థ లక్ష్యం విదించుకుంది. ఇందులో 65వేల మెట్రి క్ టన్నులు నేరుగా కాంట్రాక్టు దక్కించుకున్న మిల్లర్లే సేకరించనున్నారు. ఈమొత్తం వ్యవహారం వెనుక కాకినాడకు చెందిన ఓ కిలక నేత పావుల కదిపి మిల్లర్లకే అవకాశాలు కల్పించారని ప్రచారం జరుగుతోంది. ధాన్యం సేకరణలో భాగంగా నాణ్యత లేని ఇతర రాష్ట్రాల ధాన్యాన్ని సేకరించి సాధారణ ధాన్యం విధానంలో చూపించి, అక్రమాలకు పాల్పడేందుకు అవకాశాలకు ప్రభుత్వం దారులు తెరవడం తీవ్ర విమర్శలొస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.