P Ramesh, News18, Kakinada
ఆరుగాలం కష్టపడి పంట పండి చేతికొచ్చే సమయంలో రైతులు పడుతున్న కష్టం చూస్తే కన్నీళ్లే మిగులుతోంది. ఉభయగోదావరి జిల్లాలో రైతుల ధైన్యంగా మారింది. తేమ ఆరని ధాన్యం అమ్ముడవక నానా అవస్థలు పడుతున్న రైతన్నకు తాజాగా మరో ఉపద్రవం ముంచుకొచ్చింది. వాన వణుకు పుట్టిస్తోంది. అందుకు కారణం ఏపీలోని ధాన్యం సేకరణ తీరే అంటున్నారు అన్నదాతలు. ధాన్యం సేకరణ మొదలుపెట్టిన ప్రభుత్వం ఆ డబ్బులెప్పుడిస్తారనేది మాత్రం స్పష్టం చేయడం లేదు. ధాన్యం సేకరణలో ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా నిర్వాహణ చేస్తోంది. నేరుగా మిల్లర్లకు అమ్మే పరిస్థితి లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసి, ఆపై రైతులకు సరియైన ధర ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయంతో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు.
రైతుల దగ్గర నుండి ఆర్బికేల ద్వారా ధాన్యం కొనుగోలులో నిబంధనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం ధాన్యంలో ఉన్న తేమ శాతం లెక్కింపుతో రైతులకు తలనొప్పిగా మారింది. ఇదిలా ఉంటే గత మూడు రోజులుగా ఉభయగోదావరి జిల్లాలో కురుస్తున్న చిరు జల్లులు, రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
కళ్లాలోనే ధాన్యం
ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ, కాకినాడ జిల్లాలోని చాలా మండలాల్లో రైతులు పంటను కోశారు. వరి పంట చేతికి రావడంతో, తాము పండించిన ధాన్యం మంచి ధర పలకాలని, అందుకోసం ప్రభుత్వం పెట్టిన తేమ నిబంధనలు సడలిపోవాలంటే ఆరబోత పెట్టారు. తీరా చూస్తే గత మూడు రోజులుగా చిరు జల్లులు కురస్తూ, మంచు ధాటికి ధాన్యం తడిసిపోయింది. కోనసీమలో కురిసిన వర్షానికి ఏకంగా ధాన్యం మొలకలు వచ్చేశాయి. ఈప్రభావంతో రైతులు తడిసిన ధాన్యాన్ని ఏలా అమ్మాలో తెలియక తీవ్రంగా నష్టపోతున్నారు.
ఇదీ చదవండి : మార్గశిర మాసంలో మహాలక్ష్మి పూజ ఎందుకు చేస్తారు.. విశిష్టత ఏంటంటే?
తేమ పోతుందని ఆరబోస్తే..ఇప్పుడు మొలకలు
మొన్నటి వరకూ తేమ కోసం కంగారు పడితే, ఇప్పుడు ఏకంగా ధాన్యం మొలకలు రావడంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. ధాన్యం చేతికొచ్చిన వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తే బాగుండేది. ఇప్పుడేమో ఏకంగా వర్షం దాటికి మొలకలు వచ్చేశాయి. తేమతో పోతుందని ఆరబోస్తే మొలకలు వచ్చేశాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తమకు శరాఘాతంగా మారాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : ముద్రగడ మళ్లీ యాక్టివ్ అవుతున్నారా.. వైసీపీ ఇచ్చిన ఓపెన్ ఆఫర్ ఏంటి..?
మరోపక్క ధాన్యం తేమ శాతంలో తేడాలు కనిపించడంతో రైతులకు డబ్బులు వచ్చే అంశంలో కూడా భారీగా తేడాలు వస్తుండటంతో ఆందోళన మరింత పెరిగింది. పెట్టుబడులు ఎక్కువ పెట్టేయడంతో ఇప్పుడు అసలు డబ్బులైనా వస్తాయో రావో అనే గందరగోళంలో రైతులకు కంటిమీద కునుకు పట్టడం లేదు. ప్రభుత్వం స్పందించి రైతుల పట్ల ఏదోక నిర్ణయం ప్రకటించకపోతే తీవ్ర నష్టం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని రైతు సంఘాల నేతలు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist, Farmers, Heavy Rains, Local News