P Ramesh, News18, Kakinada
అమరావతి (Amaradvathi) రైతుల పాదయాత్ర (Amaravati Farmers Padayatra) పలు పార్టీలకు పెద్ద వరంగా మారిందనే చెప్పాలి. రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి కూడా ఇదొక వేదికగా మారుతోంది. వాస్తవానికి గత మూడున్నరేళ్లపైబడి అధికారంలో ఉన్న వైసీపీ (YCP) మినహా దాదాపుగా అన్ని పార్టీలు అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతిస్తున్నాయి. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత నిరసన కార్యక్రమాలు చేయడానికి కూడా కొన్ని పార్టీలు ముందుకు రాలేదు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించడంతో మిగిలిన పార్టీలకన్నా టీడీపీ (TDP) ముందున్నప్పటికీ, ఆశించిన ఫలితం రాలేదనే చెప్పాలి.
ఓపక్క భయమో.. లేక నిర్లక్ష్యమో తెలియదు కానీ వైసీపీ ప్రభుత్వంలో నిరసన తెలిపేందుకు మాత్రం ఎవ్వరికీ అవకాశం లేకుండాపోయింది. పలు మార్లు ఇలా ప్రయత్నాలు చేసిన జనసేనకు కూడా దెబ్బ తగిలిందని చెప్పాలి. కాకినాడలో జనసేన కార్యకర్తలు... వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటికి వెళ్లిన సందర్బంలో తరిమి తరిమి కొట్టిన సందర్బాలున్నాయి. ఈసమయంలో పోలీసుల సహాకారం జనసేకు లేకుండా పోయింది. అప్పట్లో పవన్ కూడా ఆచి తూచి అడుగులు వేశారు. బీజేపీ నేతలు సైతం కేవలం ప్రసంగాలతో విమర్శలు చేస్తూ కాలం గడిపేశారు.
కానీ ప్రస్తుతం అమరావతి పాదయాత్రకు తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ, పార్టీలతో పాటు జనసేన , బిజెపి కూడా మద్దతిస్తున్నాయి. వారికి స్వాగత ఏర్పాట్ల దగ్గర నుండి ఆయా నియోజకవర్గం వీడే వరకూ పూర్తి సహకారం అందిస్తున్నాయి. వైసీపీ మాత్రం అమరావతి విషయంలో పూర్తిగా విరుద్ధంగా ఉంది. అమరావతికి వ్యతిరేకంగా రాజధాని వికేంద్రీకరణ పోరాటంతో ఎక్కడికక్కడ బలోపేతం చేయడానికి ప్రణాళికలు వేస్తోంది.
ఈనేపథ్యంలోనే అమరావతి పాదయాత్రను అడ్డుకునేందుకు ఆయా ప్రాంతాల వైసీపీ నాయకులు ముందుంటూ అధినేత ఆదేశాలు తూచా తప్పమనే సందేశాన్నిస్తున్నారు. ఇక్కడ జగన్ మెప్పుకోసం కూడా కొంత మంది తప్పని పరిస్థితుల్లో అమరావతికి వ్యతిరేకంగా వ్యవహరించడం తప్పని పరిస్థితి. ఈవిషయంలో జగన్ మాటే శాసనంగా మారిపోయిందని చెప్పాలి.
ఆటంకాలు వెనుక అసలు రాజకీయం
తూర్పుగోదావరిలో అమరావతి రైతుల పాదయాత్ర ప్రారంభమైన వెంటనే గోదావరి రైల్ కమ్ రోడ్డు వంతెనను మూసివేశారు. దీంతో వాహనాలు రాకపోకలు ఆగిపోయాయి. ఇది కేవలం అమరావతి పాదయాత్రకు బ్రేక్ పెట్టేందుకేనని ప్రభుత్వంపై విమర్శలొచ్చాయి. ఒక పక్క ధ్వంసమైన రోడ్ల మరమ్మతులు చేయని సర్కారు కావాలనే రైల్వే వంతెన పనులు ప్రారంభించిందని ఆరోపించాయి పార్టీలు.
రాజమండ్రి దేవిచౌక్ దగ్గర రైతుల పాదయాత్రను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. ఇక్కడ రాజమండ్రి ఎంపీ భరత్ నేరుగా అమరావతి పాదయాత్ర రైతులపై తన అక్కస్సు వెళ్లగక్కడం వెనుక జగన్ మెప్పుపొందాలని చూశారనే ఆరోపణలు బలంగా వినిపించాయి. ఇదే సందర్భంలో టిడిపి, జనసేన నాయకులు కూడా ఆయా నేతల మెప్పుకోసం గలాటలో జోరుగా ఊపందుకున్నారు. వాస్తవానికి అమరావతి పాదయాత్ర రైతులు మాత్రం వారి నడక వారు నడుస్తూనే ఉన్నారు. అయితే పార్టీలు మాత్రం వారి యాత్రను వేదికగా చేసుకుని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
మరోవైపు రాజకీయంగా ముందుకు రావాలని ఉత్సాహంతో ఉన్న యువ నాయకులంతా పాదయాత్రను వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. పాదయాత్రలో అధినేతల ఆదేశాలతో ద్వితీయస్థాయి నేతలు రంగంలోకి దిగారు. కొన్ని మీడియా సంస్థల అనుకూల నేతలు కూడా ప్రత్యక్షంగా మద్ధుతు పలకడం చూస్తుంటే అమరావతి యాత్ర కొందరు వ్యక్తులకు రాజకీయ పునాదిగా కూడా మారిపోయిందనే చెప్పాలి. మొత్తం మీద అమరావతి పాదయాత్ర మాత్రం కొత్త తరం నేతలకు, పాత తరం పెద్దలకు ఒక అవకాశంగా మారిందనడంలో సందేహం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravathi, Andhra Pradesh, Local News, Rajahmundry