మరో పదిరోజుల్లో పెళ్లి. అన్ని పనులు చకచక జరుగుతున్నాయి. ఇంతలో ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ.. అకస్మాత్తుగా వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో చోటుచేసుకుంది. తన పెళ్లికి ఇంకా పది రోజులు మాత్రమే సమయం ఉందనగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఇంటి పుష్పవతి నాల్గో కుమారుడు హరీష్ బాబు (33) ఢిల్లీలోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు.
అతనికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. పెద్దలంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి ఇంటికి వచ్చిన హరీష్ బాబు అప్పటినుంచి ఇక్కడే ఉంటూ పెళ్లి పనులు చూసుకుంటున్నారు. ఈనెల 16న వివాహం జరగాల్సి ఉండగా శనివారం పెళ్లి బట్టలు కొనేందుకు తల్లితో కలిసి ఏలూరు వెళ్లాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఉదయం అతడు ఇంట్లోని ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు.
కొద్దిసేపటికి తల్లి వచ్చి తలుపు తట్టగా హరీష్ ఎంతకు బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆమె తల్లి కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలగొట్టగా హరీష్‌బాబు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. కిందకు దింపి చూడగా అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి సుధీర్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Suicide, West Godavari