P Ramesh, News18, Kakinada
ఆహార పదార్థాల్లో మనం ఎక్కువగా ఆకుకూరలు, కాయగూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పుకుంటాం. శాఖాహారుల్లో ఎక్కువ మంది కొన్ని కూరగాయాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి వాటిలో అందరూ మెచ్చే వంటకం బీరకాయ కూర. ఇప్పుడదే పంట గోదావరి జిల్లాలోని రైతులకు సిరులు కురిపిస్తోంది. బీరకాయ.., ఆ పంట కాకినాడ జిల్లాలో విరివిగా పండిస్తున్నారు. ఎక్కువ సారవంతమైన నల్లరేగడి నేలల్లో ఇది పండుతోంది. నీరు సదుపాయం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పండే ఈ పంటను, నీరు తక్కువగా లభించే ప్రాంతాల్లో సైతం అంతర పంటలుగా కూడా వేస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఎక్కువగా రైతులకు లాభాలు తెచ్చే పంటల్లోకి చేరిపోయింది బీరకాయ.
కాకినాడ జిల్లాలోనే ఎక్కువ ఉత్పత్తి..!
కాకినాడ జిల్లాలోని విరవ, విరవాడ, దివిలి, పిఠాపురం, నరసింగపురం, జములపల్లి, గోకివాడ వంటి గ్రామాల్లో ఎక్కువగా బీర పంటను పండిస్తున్నారు. ఈ పంటకు పెట్టుబడి కూడా తక్కువ. 45 రోజుల నుండి 60 రోజుల్లోపు పంట చేతికొస్తుంది. మరలా మరో 65 రోజులు ఇలా ఏడాదిలో ఎక్కువగా రెండు విడతలుగా చల్లదనం ఉండే రోజుల్లో బీరపంట దిగుబడి ఎక్కువగా వస్తుంది.
తక్కువ స్థలం ఎక్కువ లాభం..!
తక్కువ స్థలంలో అల్లికల ద్వారా ఈ పంట పండుతుంది. అంటే పాదు రూపంలో దీన్ని పండించవచ్చు. ఈ పంట వేసిన చోట పందిరిలా కడతారు. పాదుపైకి వెళ్లి బీర కాయలు వేలాడతాయి. అయితే ఇదే ప్రాంతంలో మరో అంతర పంట కూడా వేసుకునే అవకాశం ఉంది. పందిరి పంట కావడంతో, నేలఖాళీగా ఉంటుంది. దీంతో ఇక్కడ ఖాళీ స్థలంలో బీరకాయ పంటను వేస్తారు.
ఇతర ప్రాంతాలకు ఎగుమతి..!
ఈ పంటను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ రైతు బజారులో పండుతున్న పంట దాదాపుగా పిఠాపురం పరిసర ప్రాంతాల్లో పండించే పంట. ఇక్కడ ప్రాంతంతో పాటు రాజమండ్రి, తుని ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. మరోపక్క విజయవాడ వైపుగా ఎక్కువగా ఇక్కడ నుండి బీరకాయలను ఎగుమతి చేయడం ఇటీవల ఎక్కువగా జరుగుతోంది.
ఆరోగ్యకరమైనది బీరకాయ..!
సాధారణంగా అనారోగ్యంగా ఉన్నవారు బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎక్కువగా బీరకాయకే ప్రాధాన్యత ఇస్తారు. శరీరంలో ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో బీరకాయకు ఉన్న గుణం ఏ కూరకు లేదంటారు. పీచు పదార్థం ఎక్కువగా ఉండటంతో మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. అజీర్తి, గ్యాస్ సమస్యలకు బీరకాయ ఓ వరంగా చెబుతారు. బీరకాయ తొక్కలను ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Farmer, Local News