P.Ramesh, News18, Kakinada
ఆమెకు.. ఆమె శత్రువైందా..ఆ అధికారిణి లంచం (Bribe) అడిగింది ఎవరినో తెలిస్తే ఖంగుతినాల్సిందే.. సమాజం మారుతున్నా కొంత మందిలో ఇంకా మార్పురావడం లేదు. కాలం ఎంత మారుతున్నా చాలా మందికి అవినీతి జాడ్యం పోవడం లేదు. ప్రభుత్వాలు ఒక పక్క ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నా.. మరోపక్క హెచ్చరిస్తున్నా అవినీతి అంతం కాదని కొంత మంది అధికారులు నిరూపిస్తూనే ఉన్నారు. ఇక్కడ మనం చెప్పుకునే అధికారి కూడా దాదాపుగా అదే కోవకు చెందవచ్చు. చాలా మంది అధికారులు కాంట్రాక్టర్ల వద్దనో, లేక ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయించాడానికి చేయి చాపుతారు. కొన్ని కార్యాలయాల్లో నేటికి చేయి తడపందే పనికావడం లేదు. అయితే కోనసీమ (Konaseema District) లో ఓ అధికారి మాత్రం విభిన్నంగా లంచం తీసుకుంది.
ఏకంగా ఓ గ్రామ ఉపసర్పంచిని లంచం డిమాండ్ చేసింది. ప్రజలకు పనికి వచ్చే అభివృద్ధి పనులకు మండల సాధారణ నిధులు వెచ్చించేందుకు ఆ అధికారిణికి చేయి తడపాల్సి వచ్చింది. చివరకు విసుగెత్తిన ఉపసర్పంచి ఏసీబీ అధికారులను ఆశ్రయించి అధికారిని బండారం బయట పెట్టింది. రూ. 50 వేలు లంచం అడిగితే తొలుత రూ.10 వేలు అందించి, రెండోసారి రూ.40 వేలు ఇస్తూ పట్టించింది.
కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎంపీడీవోగా ఉన్న కేఆర్ విజయ రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఏసీబీ అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. ఆమె డిమాండ్ చేస్తే పూర్తిగా లంచం డబ్బులు ఇచ్చే వరకూ ఏ పని ముందుకు కదలనీయరని గుర్తించారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు రావాలంటే, మ్యాచింగ్ గ్రాంట్లు అవసరమవుతుంటాయి. ఇలాంటిదే అక్కడ రాజులపాలెం గ్రామ అభివృద్ధికి అవసరమైన ఎంపీ నిధులు రావడానికి మ్యాచింగ్ గ్రాంటు అవసరమైంది. కానీ నిధులు రాకుండా, పనులు జరగకుండా, నిధులు రావడానికి కూడా లంచం తీసుకోవడంపై ఏసీబీ అధికారులను విస్మయానికి గురి చేసింది.
ఏసీబీకి ఎంపీడీవో దొరకడంతో అందరూ ఆమె ఏదో కాంట్రాక్టర్ వద్ద డబ్బులు ఆశించి దొరికిపోయిందనుకన్నారు. కానీ పి.గన్నవరం దగ్గర రాజుల పాలెం గ్రామ ఉపసర్పంచి నంబూరి విజయలక్ష్మీని లంచం అడిగి దొరికిందని తెలుసుకుని విస్తుపోయారు. సాధారణంగా ఓ మహిళా ఎంపీడీవో ఓ మహిళా గ్రామ ప్రజాప్రతినిధి నుండి లంచం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
నిత్యం మండల ప్రజా పరిషత్ కార్యాలయం(ఎంపీడీవో)తో ప్రజా ప్రతినిధులకు పనులు ఉంటాయి. ప్రతీ రోజు ప్రజాప్రతినిధులు అధికారులు కలిసే ఉంటారు. వీరిద్దరూ కలిసి అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్‌తో సత్సంబంధాలు కలిగి ఉంటారు. చాలా చోట్ల కాంట్రాక్టర్లు అధికారులను పట్టించడం చూశాం..అయితే ఇక్కడ ఓ గ్రామ ప్రజాప్రతినిధి, వారికి అనుబంధశాఖ అధికారిని పట్టించడం కోనసీమలో ఇప్పుడు చర్చనీయాంశమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ACB, Andhra Pradesh, East Godavari Dist, Local News