P Ramesh, News18, Kakinada
ఊహకందని ప్రకటన అది. ఎన్నో జీవితాలకు పూలబాటే. నిజంగా ఇంత కాలంగా ఏ ప్రభుత్వం తీసుకోని నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం (AP Government) పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు టీచర్లు. సుదీర్ఘంగా 24 ఏళ్ల పోరాట ఫలితంగా 1998 డీఎస్సీ బ్యాచ్‌కు చెందిన వారెందరో పాఠాలు చెప్పేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యింది. ఇక పోస్టింగ్‌లు ఇవ్వడమే తరువాయి. ఇందులో తూర్పుగోదావరి జిల్లాలో 560 మంది తాజాగా ఎస్జీటీ పోస్టుల విభాగంలో కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. ఇప్పటి వరకూ ఎక్కడెక్కడో పనిచేశారు. కొందరు ప్రైవేటు స్కూళ్లలో, మరికొందరు వ్యాపారాల్లో, ఇంకొందరు ప్రైవేటు పనుల్లో ఇలా నిమగ్నమైపోయారు. తీరా 1998 డీఎస్సీలో మీకు ఉద్యోగం వచ్చిందన్న శుభవార్తతో ఒక్కసారిగా ఆనందం. ఆశ్చర్యం. రెండు కలగలపి వచ్చేశాయి. ఇంకేముంది ఉన్న పని అమాంతంగా వదిలి టీచర్‌గా అవతారమెత్తేందుకు సిద్ధమయ్యారు. తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఇలా వారి సంసార సాగరంలో మునిగిపోయిన ఈ తరుణంలో మళ్లీ టీచర్లుగా పాఠాలు చెప్పడమంటే అదొక అద్భుతమనే చెబుతున్నారు.
ఆ ఒక్కటి ఇవ్వండి చాలు..!
దాదాపుగా చాలా మంది ఇందులో ఉద్యోగం పొందిన వారు మరికొద్ది నెలల్లో రిటైర్ కూడా కాబోతున్నారు. ఇంకొందరికి గట్టిగా రెండేళ్ల సర్వీసు కూడా లేదు. ఇలాంటి వారంతా తమను జగన్మోహన్ రెడ్డి ఆదుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే సర్వీస్ అంతా కోల్పోయామని , చేసిన ఫలితం ఉండాలన్న తమకు ముందున్న పెన్షన్ విధానాన్ని వర్తించి ఆదుకోవాలని కోరుతున్నారు. అలాగే దూర ప్రాంతాల్లో పోస్టింగ్‌లు కాకుండా, తమ వయస్సును దృష్టిలో ఉంచుకుని దగ్గర్లో పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నారు.
ఒక పక్క నవ్వులు..మరో పక్క ఏదో తెలియని ఆందోళన..!
దాదాపుగా రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్న వారంతా ఒక పక్క చాలా ఆనందంగానే ఉన్నప్పటికీ ఎక్కడో వారి మదిలో తెలియని ఆందోళన ఉందనేది స్పష్టమౌతోంది. ఈ వయస్సులో ఒక టీచర్‌గా ఉద్యోగం చేయాలంటే కాస్త సాహసమే. అందులో ఎస్జీటీ టీచింగ్ అంటే అదొక పెద్ద ప్రహసనమనే చెప్పాలి. 1 నుండి 5వ తరగతి పిల్లలకు పాఠాలు బోధించాలి. గట్టిగా చెబితే 6,7 తరగతులకు కొన్ని పాఠశాలల్లో అవకాశం కల్పిస్తారు.
ఏదైనా తాతాల వయస్సులో మనవళ్లతో పాఠశాలల్లో ఆడుకున్నట్లుగా ఉంటుందనే ఆందోళ ఉన్నప్పటికీ రాక రాక వచ్చిన అవకాశాన్ని వదులుకోవడానికి దాదాపుగా ఎవ్వరూ సాహసించడం లేదు. మరోపక్క క్వాలిఫైడ్ టీచర్లు అయినప్పటికీ వీరిని ఎమ్‌టిఎస్ కింద అంటే కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకోవడంపై మాత్రం కొంత గందరగోళంగా ఉందనే చెప్పవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Teacher jobs