Pulichintala: పులిచింతల ప్రాజెక్టు సమీపంలో భూ ప్రకంపనలు.. మూడు సార్లు కంపించిన భూమి

ప్రతీకాత్మక చిత్రం

Pulichintala Earth tremors: పులిచింతల ప్రాజెక్టుతో పాటు తెలంగాణలో పరిధిలోని చింతల పాలెం, మేళ్లచెరువు మండలాల్లోని పలుచోట్ల కూడా భూ ప్రకంపనలు వచ్చినట్లు వెల్లడించారు

  • Share this:
    గుంటూరు జిల్లా పులిచింతల సమీపంలో ఆదివారం ఉదయం భూప్రకంపనలు వచ్చాయి. ఉదయం 7.15 గంటల నుంచి 8.20 గంటల మధ్య మూడు సార్లు భూమి కంపించింది. పులిచింతల ప్రాజెక్టు సమీప గ్రామాలతో పాటు సూర్యాపేట చుట్టుపక్కల పలు చోట్ల కూడా భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు కూడా దీన్ని ధృవీకరించారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.0, 2.7, 2.3గా నమోదైనట్లు భూభౌతిక పరిశోధన శాస్త్రవేత్త శ్రీనగేష్ చెప్పారు. పులిచింతల ప్రాజెక్టుతో పాటు తెలంగాణలో పరిధిలోని చింతల పాలెం, మేళ్లచెరువు మండలాల్లోని పలుచోట్ల కూడా భూ ప్రకంపనలు వచ్చినట్లు వెల్లడించారు. గత వారం రోజులుగా భూప్రకంపనలు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. వరుస ప్రకంపనలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఐతే ఇవి స్వల్ప తీవ్రత కలిగినవి మాత్రమేనని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

    కాగా, మూడు రోజుల క్రితం పులిచింత ప్రాజెక్టు 16న నెంబర్ గేటు కొట్టుకపోయి విషయం తెలిసిందే. ఎగువ నుంచి నీటి ఉద్ధృతి పెరగడంతో ఒత్తిడి పెరిగి ఆ గేటు కొట్టుకుపోయింది. దాంతో ప్రాజెక్టులో నుంచి వరద నీరు వృథాగా పోయింది. గేటు ఊడిన చోట ఒత్తిడి పెరగకుండా ఉండేందుకు మరో 8గేట్లను కూడా కూడా తెరిచి నీటిని వదిలిపెట్టారు. ఈ నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టు దాదాపుగా ఖాళీ అయింది. ఐతే గేట్ కొట్టుకుపోయిన చోట స్టాప్ లాక్‌ గేట్‌ను ఇంజినీర్లు బిగించారు. రెండు రోజుల పాటు శ్రమించి 11 ఎలిమెంట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిగా మూతపడడంతో జలాశయంలో మళ్లీ నీటి నిల్వ ప్రారంభమయింది. ఇక కొట్టుకుపోయిన గేటు శనివారం దొరికింది. ప్రాజెక్టు నుంచి 500 మీటర్ల దూరంలో లభ్యమయింది. దానికి తాళ్లను కట్టి మత్స్యకారుల సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వను ప్రారంభించినప్పటికీ.. ఎగువ నుంచి నీటి ప్రవాహం తగ్గడంతో, జలాశయం పూర్తిగా నిండేందుకు చాలా సమయం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

    ఇవి కూడా చదవండి:

    కొట్టుకుపోయిన పులిచింతల గేటు దొరికింది.. అడుగంటిన జలాశయం.. రాజకీయ దుమారం

    BJP Vs YCP: జగన్ బెయిల్ ఎప్పుడైనా రద్దు కావొచ్చు..! మంత్రులకు బీజేపీ కౌంటర్

    Published by:Shiva Kumar Addula
    First published: