Home /News /andhra-pradesh /

DRONE SURVEY IN NALLAMALA FOREST AREA OF PRAKASAM FOR URANIUM SK

నల్లమలలో యురేనియం అలజడి..అభయారణ్యంలో అసలేం జరుగుతోంది?

నల్లమల ఫారెస్ట్

నల్లమల ఫారెస్ట్

నల్లమల భూగర్భంలో ఉన్న యురేనియం నిక్షేపాలను తవ్వి తీయడానికి ప్రైవేటు సంస్థలు రంగంలోకి దిగాయనే వార్తలు నల్లమలను ఆనుకుని ఉన్న ఏపీ, తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి.

  (డి. లక్ష్మీ నారాయణ, ప్రకాశం కరెస్పాండెంట్, న్యూస్ 18)

  మానవ పరిణామ క్రమంలో అభివృద్ధి కోసం ఎన్నో జీవజాతులు, అడవులు మాయమైపోయాయి. ఇప్పుడా పరిస్థితి దేశంలోనే ఎంతో ప్రత్యేకమైన నల్లమలకు వచ్చిందా అనే అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. నల్లమల భూగర్భంలో ఉన్న యురేనియం నిక్షేపాలను తవ్వి తీయడానికి ప్రైవేటు సంస్థలు రంగంలోకి దిగాయనే వార్తలు నల్లమలను ఆనుకుని ఉన్న ఏపీ, తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి.

  జీవ వైవిద్యానికి పుట్టినిల్లు నల్లమల..!
  నల్లమల పేరు చెప్పగానే మొదటి వినిపించేది ఎంతో పవిత్రమై శైవ క్షేత్రాలైన శ్రీశైలం, భైరవకోన. వీటితో పాటు భారతదేశంలో అత్యంత పెద్దదైన రాజీవ్ అభయారణ్యం కూడా నల్లమలలోనే ఉంది. ఇక్కడ పులులు ఆశ్రయం పొందుతున్నాయి. వీటితో పాటు.. చిరుతపులులు, ఎలుగుబంట్లు, రకరకాల అడవిజంతువులు, కృష్ణ సర్పాలు, నల్లమలలో మాత్రమే దొరికే ఔషధమొక్కలకు కొదవే లేదు. అడవినే నమ్ముకుని జీవిస్తున్న చెంచులకు, గిరజనలకు ఈ అడవే ఆధారం. కానీ, ప్రైవేటు సంస్థలు నల్లమలలో లక్షల కోట్ల విలువైన యురేనియంను కనుగొన్నాయని... త్వరలోనే ఈ అడవిలో తవ్వకాలు ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వనుందనే వార్తలు ప్రకాశం జిల్లాలో తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి.

  జీవ జాతులు, చెంచుల పరిస్థితి ఏమిటి..?
  ప్రకాశం, కడప, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, మహబూబ్ నగర్ పరిధిలోని 9500 చ.కి.మీ విస్తీర్ణంలో నల్లమల విస్తరించి ఉంది. ఇందులోనూ 3,568 చ.కి.మీ చదరపు కిలోమీటర్ల రాజీవ్ పులల అభయారణ్యం విస్తరించి ఉంది. ఈ అభయారణ్యంలో బెంగాల్ పులి, ఇండియన్ చిరుత, స్లోత్ ఎలుగుబంటు, ఉస్సూరి ధోలే, చిటా, సాంబార్ డీర్, ఇండియన్ పైథాన్ వంటి ఎన్నో జాతులు ఉన్నాయి. నల్లమల అభయారణ్యంలో 200 గ్రామాలు ఉంటే.. అభయారణ్యం కేంద్రప్రాంతంలో 24 గ్రామాలు ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు యురేనియం తవ్వకాలకోసం జరుగుతున్న సర్వే ఫలితాలు అనంతరం.. ఇక్కడ తవ్వకాలకు అనుమతి ఇస్తే ఇక్కడ నివసించే చెంచులు, గిరిజనుల, జీవ జాతుల పరిస్థితి ఏమిటి అనేది అర్థం కావడం లేదు. నల్లమలలోనే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటిగా మరియు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన.. శ్రీశైలం పుణ్యక్షేత్రం ఉంది.

  ప్రకాశం జిల్లా పరిధిలోని నల్లమలలో ఫ్లైట్ల ద్వారా సర్వే...!
  ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు , కొమరోలు , రాచర్ల , అర్దవీడు , యర్రగొండపాలెం , పుల్లలచెరువు , దోర్నాల మండలాలలో అటవీ ప్రాంతం కొన్ని నెలల నుంచి ద్రోన్ల ద్వారా కొన్ని ప్రైవేటు సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. నల్లమలలలో యునేనియం , ధోరియం , ట్రాన్షియం , బెరీటీస్ , నిక్షేపాలు ఉన్నాయనే అంచానలు వేస్తున్నారు. గతంలోనూ నల్లమల విస్తరించి ఉన్న... గుంటూరు జిల్లాలోని గురజాల , రెంటచింతల , దాచేపల్లి ప్రాంతాలలో థోరియం, ట్రాన్షియం వంటి రేడియో దార్మిక ఖనిజాలు లభించాయి. దీంతో నల్లమలలో యురేనియం తవ్వకాలకోసం ప్రైవేటు సంస్థలు ప్రయత్నిస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎలక్ట్ర్రో మాగ్రటిక్ తంరంగాలను భూమిలోకి పంపి భూమిలోని ఖనిజాలు ఎక్కడ ఎంతలోతులో నిక్షిప్తం అయినాయో తెలుసుకుంటారు. ఆ తరువాత ఆయా ప్రాంతాలలో సర్వేలు నిర్వహించడం ప్రైవేటు సంస్థల పాలసీలో భాగం. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో జరుగుతున్న తవ్వకాలకు ఎవియేషన్ శాఖ నుంచి అనుమతి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోనే.. కాకుండా తమిళనాడు , కర్నాటకా రాష్ట్రాలలో కూడా అటవీ ప్రాంతం ఉండటంతో ఈ అడవుల్లో ఖనిజాల కోసం వేట సాగుతోంది. ముఖ్యంగా నల్లమల అడవిలో రేడియో ధార్మిక ఖనిజ నిక్షేపాలు అధికంగా ఉన్నట్లుగా చెబుతున్నారు.

  అన్వేషణ రెండు దశాబ్దాల క్రితమే ప్రారంభం అయిందా..?
  ప్రస్తుతం నల్లమలలో ఎక్కువగా ద్రోన్ల తిరుగుతుండటం వల్ల ఆ ప్రాంతంలోని సర్వేలపై ప్రజలకు తెలిసింది. కానీ, అసలు నల్లమలలో విలువైన ఖనిజాల అన్వేషణ రెండు దశాబ్దాల క్రితమే ప్రారంభమైందనే వాదన బలంగా వినిపిస్తోంది. గతంలో నక్సల్ ఉద్యమం తీవ్రంగా ఉండటం వల్ల ప్రైవేటు సంస్థలు నల్లమల వైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో నక్సల్ ఉద్యమం బలహీనపడింది. దీంతో ప్రైవేటు సంస్థలు ఖనిజాలకోసం నల్లమలలో అన్వేషణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

  అణు విద్యుత్తే అన్నింటికీ పరిష్కారమా...?
  అమెరికా, రష్యా, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు... అణు విద్యుత్తును పక్కనపెట్టి సంప్రదాయ ఇంథన వనరుల ద్వారా విద్యుత్తు ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తుంటే.. మన ప్రభుత్వం మాత్రం అణు విద్యుత్తు వైపు మొగ్గుచూపుతుండటం... నల్లమలలో అలజడిని రాజేస్తోంది. గతంలో శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణువిద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయాలనే నిర్ణయంతో ఆ జిల్లా అంత రణరంగంగా మారింది. ఇప్పుడు ఆ దుస్థితి ప్రకాశం జిల్లాలోనూ ఏర్పడుతుందనే వాదన వినిపిస్తోంది.

  నల్లమల టైగర్ రిజర్వు ఫారెస్టు. చెంచులు, ఆదివాసీలు బతుకుతున్న ప్రాంతం. యురేనియం తవ్వకాల అనంతరం వచ్చే వ్యర్థాల వల్ల.. అడవి, నీరు, గాలి కలుషితం అయి ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దీనిపై ఎలాంటి ప్రకటనా చేయకపోవడం కూడా చర్చకు దారితీస్తోంది. ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం దొనకొండ విమానాశ్రయం అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం కూడా అనుమానాలు బలపరుస్తోంది. నల్లమలలో యురేనియం తవ్వకాలపై అన్వేషణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇస్తేగానీ.. దీనిపై స్పష్టత వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, Nallamala forest, Prakasam

  తదుపరి వార్తలు