కాంగ్రెస్ ఉచ్చులో చిక్కుకుంటే.. ఖతమే: చంద్రబాబుకు రాజ్‌నాథ్ హెచ్చరిక

ప్రత్యేక హోదా అనే పదాన్ని పట్టుకుని ప్రజల కళ్లలో మట్టికొట్టాలని చూడొద్దని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. తిత్లీ తుఫాన్ వల్ల ఎంత నష్టం వాటిల్లిందో మెమోరాండం పంపిస్తే కేంద్రం నుంచి వీలైనంత సాయం చేస్తామని చెప్పారు.

news18-telugu
Updated: October 16, 2018, 11:06 PM IST
కాంగ్రెస్ ఉచ్చులో చిక్కుకుంటే.. ఖతమే: చంద్రబాబుకు రాజ్‌నాథ్ హెచ్చరిక
గుంటూరులో బీజేపీ రాష్ట్ర కార్యాలయ శంకుస్థాపనలో పాల్గొన్న కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రస్తుతం నలుగురు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ.. రాబోయే రోజుల్లో మరింత మంది బీజేపీ ప్రజాప్రతినిధులను చూడాలన్నారు. గుంటూరులో బీజేపీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి రాజ్‌నాథ్‌సింగ్ శంకుస్థాపన చేశారు. బీజేపీ దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దేశంలోని మూడింట రెండు వంతుల రాష్ట్రాలను బీజేపీ పాలిస్తోందన్నారు. దేశంలో మిగిలిన రాజకీయ పార్టీలు కేవలం మోదీని ఆపడమే పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు.

చంద్రబాబునాయుడి మీద కూడా రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో చిక్కుకుంటే... ఆ పార్టీ పని ఖతమైపోవడమే కానీ.. కోలుకోవడం ఉండదన్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను చూస్తే తెలుస్తుందన్నారు. చంద్రబాబు ఎందుకు ఎన్డీయేను వీడారో ఇప్పటి వరకు తనకు అర్థం కాలేదన్నారు. ఏపీ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎంతవరకు వీలుంటే అంతా చేస్తుందని స్పష్టం చేశారు. ఏపీ విభజన చట్టం 2014ను కచ్చితంగా అమలు చేస్తామని రాజ్‌నాథ్‌ మరోసారి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం రూ.2లక్షల 6వేల కోట్లు నిధులు ఇచ్చిందన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఎనిమిది రిజర్వ్ బెటాలియన్లు ఇచ్చామన్నారు. తెలంగాణకు నాలుగే ఇచ్చినట్టు రాజ్‌నాథ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను కూడా అత్యంత ప్రాధాన్యంతో వారిని పంచామన్నారు. అమరావతి కోసం రూ.1500 కోట్లు, గుంటూరు - విజయవాడ కోసం రూ.1000 కోట్లు అదనంగా ఇచ్చామన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన రూ.7158 కోట్లలో రూ.6.764 కోట్లు కేంద్రం రిలీజ్ చేసిందని చెప్పారు. ప్రాజెక్టు కొత్త అంచనాల మీద ప్రస్తుతం చర్చ జరుగుతోందన్నారు. వెనుకబడిన జిల్లాల కోసం రూ.1050 కోట్లు రిలీజ్ చేశామన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 16, 2018, 9:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading