పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించిన భూసేకరణ అంశంలో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ అంశంలో రాష్ట్ర ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని మైనింగ్ భూములను ఇతర అవసరాలకు కేటాయించొద్దని ఆదేశించింది. మైనింగ్ భూములపై కేంద్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పలు చోట్ల మైనింగ్ భూములను ఇళ్ల పట్టాల కోసం కేటాయించారని దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. దీనిపై స్టే ఇచ్చింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మరోవైపు ఏపీలో ఈ నెల 15న జరగాల్సిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పష్టత ఇచ్చారు. ఇళ్ల పట్టాల పంపిణీ కచ్చితంగా ఉంటుందని..అయితే ఆగస్టు 15న కాకుండా మరో రోజున ఉండొచ్చని సంకేతాలు ఇచ్చారు. నిజానికి జులై 8న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావించింది. అయితే అప్పటికీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15కు వాయిదా వేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కార్యక్రమం మరోసారి వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.