DISCUSSION OVER PRIME MINISTER NARENDRA MODI COMMENTS ON ANDHRA PRADESH BIFURCATION ISSUE FULL DETAILS HERE PRN GNT
AP Politics: విభజనపై మోదీ వ్యాఖ్యల వెనుక వ్యూహం ఇదేనా..? వైసీపీ ప్రశ్నించకపోవడానికి కారణం ఇదేనా..!
ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విభజన గురించి పార్లమెంట్ (Parliament) లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేసిన ప్రసంగంపై తీవ్ర చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విభజన గురించి పార్లమెంట్ (Parliament) లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేసిన ప్రసంగంపై తీవ్ర చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే. ఐతే ఇన్నాళ్లూ విభజన సమస్యలపై పెద్దగా మాట్లాడని మోదీ.. ఉన్నట్లుండి విభజన అంశాన్ని, అది జరిగిన తీరును రాజకీయ సభలో కాకుండా ఏకంగా పార్లమెంటులో ప్రస్తావించడం రాజకీయంగా కలకలం రేపింది. అసలు ప్రధాని ఉద్దేశమేంటి.. ఆయన ఎందుకు ఈ కామెంట్స్ చేశారనేదానిపై అందరూ చర్చించుకుంటున్నారు. కానీ దీనిపై ఏపీలో అధికార పార్టీ నేతలు పెద్దగా రియాక్ట్ అవలేదు. లోక్ సభలో ప్రధాని నరేంద్రమోడీ తన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీనీ ఇరుకున పెట్టాలని చేసిన ప్రయత్నంలో భాగంగా విభజన సమయంలో కాంగ్రెస్ ఏపీకి అన్యాయం చేసిందని, తామేదో మేలు చేస్తున్నామనే విధంగా ఆయన ప్రసంగం సాగింది.
ఐతే గడచిన ఏడెనిమిదేళ్లుగా విభజన హామీల విషయంలో కేంద్రం ఏపీకి పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదు. ఏపీ గురించి గానీ,రాష్ట్రానికి రావలసిన విభజన హామీలు, ప్రత్యేక హోదా వంటి అంశాల గురించిగానీ పట్టించుకోలేదు. సాక్ష్యాత్తూ తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రమాణంచేసి మరీ మాటతప్పిన మోదీ ఇప్పుడు పార్లమెంటులో మాట్లాడటంపై ప్రజల నుంచి ఒకింత ఆగ్రహమే వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లూ రాష్ట్రాన్ని పట్టించుకోని వ్యక్తి ఇప్పుడు ఉన్నట్లుండి విభజన సమస్యలు ప్రస్తావించడం వెనుక మర్మమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఐతే పార్లమెంట్ లో ఇంత జరిగినా ఏపీకి చెందిన వైసీపీ ఎంపీలు మాత్రం మిన్నకుండిపోయారు. బడ్జెట్ పై విమర్శలు, ఇతర అంశాలను ప్రస్తావించారే తప్ప.. మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ వేయలేదు. ఇన్నాళ్లకు ఏపీ విభజన సమస్యలపై స్పందించిన మీరు.. ఇకనైనా న్యాయం చేయాలని అడగలేకపోయారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజల అభీష్టానికి విరుద్ధంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ కు ఏపీలో నామరూపాల్లేకుండా చేశారు ఏపీ ప్రజలు.. ఇప్పుడు హామీల నెలవేర్చకుంటా కాంగ్రెస్ పై నెపం నెట్టి రాష్ట్రానికి అన్యాయం చేస్తే కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పట్టిస్తామని కూడా హెచ్చరిస్తున్నాయి.
గత రెండున్నరేళ్ళుగా బీజేపీ - వైసీపీ మధ్య ఆరోగ్యకరమైన స్నేహం ఉందనే చెప్పాలి. కొన్ని కీలక అంశాల్లో పార్లమెంట్ లో బీజేపీ.. వైసీపీ సహకరిస్తూ వస్తోంది. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పెద్దగా ఒరగబెట్టిందేమీ లేకపోయినా.., సీఎం జగన్ గానీ, వైసీపీ ఎంపీలు, నేతలు గానీ కేంద్రాన్ని పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు. సీఎం మాత్రం అప్పుడప్పుడు ప్రధాని, హోంమంత్రి, కేంద్ర మంత్రులు కలిసి వినతి పత్రాలు ఇవ్వడం తప్ప.. విభజన హమీల గురించి గట్టిగా నిలదీసిన సందర్భాలు లేవు.
వైసీపీ వైఖరిపై ఏపీలోని ప్రతిపక్షాలు మాత్రం మరో అర్ధం చెబుతున్నాయి. కేంద్రాన్ని వైసీపీ నాయకులు ఎందుకు నిలదీయడంలేదో ప్రతిఒక్కరికీ తెలుసునని, సీఎం జగన్ పై ఉన్న కేసులలో ఎక్కడ ఇబ్బందిపెడతారోననే భయంతోనే వైసీపీ నేతలు మిన్నకుండిపోతున్నారని టీడీపీ లాంటి ప్రతిక్షాలు ఆరోపిస్తున్నాయి. ఐతే తమను రెచ్చగొట్టి కేంద్రంతో తెగదెంపులు చేసుకునేలా చేసి తమ స్థానంలో టీడీపీనే.. బీజేపీ పంచన చేరాలని చూస్తుందని అందుకే తాము కేంద్రంతో ఆచితూచి వ్యవహరిస్తున్నామనేది వైసీపీ నేతలు వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి బీజేపీ-వైసీపీల మధ్య బంధం నువ్వు కొట్టినట్లు నటించు నేను ఏడ్చినట్టు నటిస్తా అనే విధంగా ఉందని రాజకీయ విశ్లేషకులంటున్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.