DISCUSSION OVER GOVERNMENT STRATEGY ON CAPITAL CITY AMARAVATI AFTER HIGH COURT VERDICT FULL DETAILS HERE PRN GNT
AP Capital: రాజధానిపై తర్వాతి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి..? జగన్ సర్కార్ వ్యూహం ఏంటి..?
ప్రతీకాత్మకచిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతి (Capital Amaravati)కి అనుకూలంగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ వ్యూహమేంటన్నది ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతి (Capital Amaravati)కి అనుకూలంగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ వ్యూహమేంటన్నది ఆసక్తికరంగా మారింది. భూములను సి.ఆర్.డి.ఏ చట్ట ప్రకారం రాజధాని అభివృద్ధికి మాత్రమే వాడాలి తప్ప ఆయా భూములను తనఖాలపెట్టడానికి వీలులేదని, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు మూడునెలలలోగా స్థలాలు కేటాయించాలని,ఆయా స్థలాలను ఆరునెలలలోగా మౌళికవసతుల ఏర్పాటు చేయాలని,సదరు ఏర్పాట్లపై తమకు నెలవారీ నివేదిక ఇవ్వాలంటూ ఏ.పి హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం సి.ఆర్.డి.ఏ చట్టాన్ని మరియు రాజధాని మాస్టర్ ప్లాన్ ను మార్చటానికి వీల్లేదని ఉన్నది ఉన్నట్లుగా మాస్టర్ ప్లాన్ ను అమలు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.దీంతో రాజధాని ప్రాంత రైతులు హైకోర్టు తీర్పును స్వాగతించారు.
ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హైకోర్ట్ తీర్పు పై స్పందిస్తూ ఇది ఐదుకోట్ల మంది ఆంధ్రుల విజయం అని,ఇకనైనా జగన్ సర్కార్ అమరావతి అభివృద్ధిపై ధృష్టిపెట్టాలని సూచించారు. మొదటి నుండి అమరావతి ని రాజధానిగా కొనసాగించడం ఇష్టంలేని అధికార వైసీపీ పెద్దలకు హైకోర్టు తీర్పు సహజంగానే రుచించకపోవచ్చు. అందుకే ప్రస్తుతానికి మిన్నకుండిపోయినా 307 పేజీల సుధీర్ఘమైన తీర్పును పరిశీలించిన తర్వాత అందులోని లొసుగులతో తదుపరి చర్యలకు ఉపక్రమించే ప్రయత్నం చేయవచ్చు.దీనికి తోడు రాజధాని అంశంపై కొత్తచట్టం చేయడానికి గానీ, సి.ఆర్.డి.ఏ చట్టంలో ఎటువంటి మార్పులూ చేయటానికి వీలులేదంటూ తీర్పులో పొందుపరచిన విషయం వాస్తవం.
ఐతే అధికార పార్టీ ప్రధానంగా ఇదే అంశంపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. చట్టాలు చేయడంకోసం రాజ్యాంగబద్దంగా ఏర్పడిన చట్టసభలను కోర్టులు కట్టడిచేయడంపై అధికారపార్టీ ప్రధానంగా దృష్టిసారించవచ్చు. అదే గనుక జరిగితే శాసనవ్యవస్థ మరియు న్యాయవ్యవస్థల మధ్య అంతరం ఏర్పడే పరిస్థితులు ఏర్పడతాయనేది మేధావుల మాట.
ఇప్పటికే కోర్టు తీర్పుపై సీఎం జగన్ అందుబాటులో ఉన్న మంత్రులు, సలహాదారులు మరియు మాజీ న్యాయమూర్తులతో సమావేశం నిర్వహించారని సమాచారం. కోర్టు తీర్పుపై స్పందించిన సీనియర్ మంత్రి బొత్స సత్యన్నారాయణ హైకోర్టు తీర్పుపై సుప్రీమ్ కోర్టుకు వెళ్ళవలసిన అవసరం లేదని తాము భావిస్తున్నామని, తీర్పుపై లోతుగా విశ్లేషించుకుని తరువాతి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని పార్లమెంటులో కేంద్రప్రభుత్వం చేసిన ప్రకటనను ఆయన గుర్తుచేశారు. కోర్టు తీర్పు పై విస్తృతస్థాయి చర్చ జరగవలసిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
తమ ప్రభుత్వం మూడూ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, అభివృద్ది వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానం, దానికి కట్టుబడి ఉన్నాం.రైతులకు చేయాల్సినవన్నీ చేస్తున్నాం. రైతులకు సీఎం జగన్ ఎందుకు క్షమాపణ చెప్పాలి..? అని బొత్స ప్రశ్నించారు. మేమెక్కడా రాజధాని భూములను ఇతర అవసరాల కోసం తనాఖా పెట్టలేదన్నారు. శాసనసభ సమావేశాల్లో బిల్లు పెడతామో లేదో అనేది మీరే చూస్తారు కదా అంటూ మంత్రి బొత్స అన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న సి.ఆర్.డి.ఏ చట్టాన్ని తాము ఉల్లంఘించలేదని, రాజధాని విషయంలో అన్ని అడ్డంకులనూ దాటుకుని అందరికీ ఆమోదయోగ్యమైన బిల్లును త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఆయన స్పషఅటం చేశారు.
ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టుకు మధ్య వాతావరణం వేడెక్కే సూచనలు కనపడుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తంగా రాజధాని రైతులు,రాష్ట్రప్రభుత్వం పంతాలకు పోయి అమరావతి రాజధాని అభివృద్ధిని ప్రశ్నార్ధకం చేస్తున్నారంటున్నారు సామాన్య ప్రజలు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.