ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కొత్త జిల్లాలు (AP New District) ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ నియోజకవర్గాలు, బౌగోళిక పరిస్థితుల ఆధారంగా కొత్త జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడున్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 వచ్చి చేరాయి. కొత్త జిల్లాలకు ప్రాంతాలు, అక్కడి ప్రముఖుల ఆధారంగా నామకరణం చేశారు. పార్వతీపురంకు మన్యం జిల్లాగా, అరకు జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా, అమలాపురంకు కోనసీమ, నరసరావుపేటకు పల్నాడు, రాజంపేటకు అన్నమయ్య, తిరుపతికి శ్రీ బాలాజీ జిల్లాగా నామకరణం చేశారు. అలాగే కృష్ణాజిల్లాను రెండుగా విభజించి విజయవాడకు ఎన్టీఆర్ జిల్లాగా పేరుపెట్టింది ప్రభుత్వం. అన్ని జిల్లాల సంగతి పక్కనబెడితే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాపైనే రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
కృష్ణా జిల్లా లో మచిలీపట్నం, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. అందులో మచిలీపట్నం పార్లమెంట్ కృష్ణాజిల్లాలోకి వెళ్లగా.. విజయవాడను ఎన్టీఆర్ జిల్లాగా ప్రకటించారు. ఐతే ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు ప్రస్తుతం పామర్రు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. గతంలో అది గుడివాడ పరిధిలో ఉండేది. గతంలో ఎన్టీఆర్ కూడా గుడివాడ, హరికృష్ణ కూడా గుడివాడ నుంచి పోటీ చేశారు. కానీ నిమ్మకూరు మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉంది. పైగా పాదయాత్ర సమయంలో నిమ్మకూరులో పర్యటించిన సీఎం జగన్.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరుపెడతామని ప్రకటించారు. కానీ అందుకు భిన్నంగా విజయవాడను ఎన్టీఆర్ జిల్లాగా ప్రకటించారు.
ఎన్టీఆర్ స్వగ్రామం మచిలీపట్నం పరిధిలో ఉన్నా.. విజయవాడకు ఆయన పేరు పెట్టడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీనిపై టీడీపీ మాత్రం సైలెంట్ గానే ఉంది. విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టడం వెనుక వైసీపీ వ్యూహాత్మక రాజకీయం చేస్తోందన్న చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ మచిలీపట్నంకు చెందిన విజయవాడ పార్లమెంట్ పరిధిలో కమ్మ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారని.. అందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. విజయవాడ పరిధిలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే టీడీపీని కూడా రాజకీయంగా సైలెంట్ చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెరపైకి రంగా పేరు..
ఐతే విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ముఖ్యంగా రంగా అభిమానులు, కాపు సామాజిక వర్గానికి చెందిన వారు రంగా పేరు పెట్టాలని కోరుతున్నారు. వైసీపీ కొత్త జిల్లాల ప్రతిపాదన తెచ్చిన సమయంలోనే విజయవాడకు వంగవీటి రంగా జిల్లాగా నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుటు విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై వారు పెదవి విరుస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP new districts, NTR, Vangaveeti Radha