డిజిటలైజేషన్ దిశగా దక్షిణ మధ్య రైల్వే పరుగులు.. విజయవాడలో లోకో పైలట్లకు ట్యాబ్ లు

Indian Railways | దక్షిణ మధ్య రైల్వే సమాచారమంతా ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీలో భద్రపరిచి లోకో పైలట్లకు ఇవ్వాలని నిర్ణయించింది.

news18-telugu
Updated: October 20, 2019, 8:26 PM IST
డిజిటలైజేషన్ దిశగా దక్షిణ మధ్య రైల్వే పరుగులు.. విజయవాడలో లోకో పైలట్లకు ట్యాబ్ లు
విజయవాడలో ట్యాబ్‌ను వినియోగిస్తున్న లోకో పైలెట్
  • Share this:
స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం అమలుతో దేశవ్యాప్తంగా రైల్వేల రూపురేఖలు మారుస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు డిజిటలైజేషన్ అమలు దిశగా అడుగులు వేయిస్తోంది. మిగతా జోన్లతో పోలిస్తే ఎన్నో విభాగాల్లో ముందున్న దక్షిణ మధ్య రైల్వే డిజిటలైజేషన్ ప్రక్రియనూ వేగంగా అమలు చేస్తోంది.
రైలు ప్రయాణంలో కీలకమైన లోకో పైలట్లకు ట్యాబ్ లు, ఇతర సాంకేతిక పరికరాలు అందించడం ద్వారా వారిపై పని భారాన్ని తగ్గించడంతో పాటు సామర్ధ్యాన్ని పెంచేందుకు కసరత్తు చేస్తోంది.రైళ్ల నిర్వహణలో లోకో పైలట్ల పాత్ర ఎంతో కీలకమైనది. సాధారణంగా లోకో పైలట్లను నియమించే ముందు వారికి డ్రైవింగ్ తో పాటు సిగ్నల్ అమరికలోని విభాగాలకు సంబంధించిన సాంకేతిక, భద్రతా నియమాలు, ఎలక్ట్రిక్, డీజిల్ ఇంజిన్లు పనిచేసే పద్ధతి, వాటిలో లోపాలు తలెత్తినప్పుడు పరిష్కరించే విధానం, రైలు మార్గంపై అవగాహన, పట్టాల స్ధితి, కాషన్ ఆర్డర్ లు, వేగ నిబంధనలపై కఠోర శిక్షణ ఇస్తారు. రైలు నడుపుతున్నప్పుడు ప్రతీ లోకో పైలట్ రూల్ బుక్స్ తో పాటు సమస్యలు తలెత్తిప్పుడు పరిష్కరించే సూచనల మాన్యువల్, ఆక్సిడెంట్ మాన్యువల్, వర్కింగ్ టైం ట్యాబ్, వివరాలు రాసుకునేందుకు రఫ్ జర్నల్ వంటివి తమతో పాటు ఉంచుకోవాలి. అత్యవసర పరిస్ధితుల్లో వీటిని అధ్యయనం చేసి తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ మాన్యువళ్లు అన్నీ కలిపి దాదాపు 10 కేజీల బరువు ఉంటాయి. దీంతో నిత్యం వాటిని తమతో పాటు తీసుకెళ్లడం, అత్యవసర సమయాల్లో ఉపయోగించడం కష్టసాధ్యంగా మారుతోంది. సమయం కూడా వృథా అవుతోంది.

విజయవాడలో ట్యాబ్‌ను వినియోగిస్తున్న లోకో పైలెట్లు


దీంతో దక్షిణ మధ్య రైల్వే ఈ సమాచారమంతా ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీలో భద్రపరిచి లోకో పైలట్లకు ఇవ్వాలని నిర్ణయించింది. లోకో పైలట్లు తమకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు కమాండ్ కంట్రోల్ కు అందించడానికీ వీలు కలుగుతుంది. నామినేటెడ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు ఈ ట్యాబ్ లలో సమాచారాన్ని అప్ డేట్ కూడా చేస్తున్నారు. లోకో పైలట్ క్రూ లాబీ వై-ఫై జోన్ లోకి రాగానే ఈ ట్యాబ్ ఆటో మేటిక్ గా కంట్రోల్ కు కనెక్ట్ కావడమే కాకుండా సమచారం కూడా అప్ డేట్ అవుతుంది. దీంతో లోకో పైలట్లకు తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు వీలు కలుగుతుంది. లోకో పైలట్లు సమాచారాన్ని ట్యాబ్ లలో ఎంటర్ చేసేందుకు వీలుగా ‘ఈ-రఫ్ జర్నల్’ కూడా ట్యాబ్‌లో అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం విజయవాడ డివిజన్ లో మెయిల్, ఎక్స్ ప్రెస్, పాసింజర్ రైళ్లలో పని చేస్తున్న లోకో పైలట్లకు ఈ ట్యాబ్ లు ఇచ్చారు. దీంతో జోన్ అంతటా దీన్ని అమలు చేసేందుకు రైల్వే అధికారులు సిద్ధమవుతున్నారు.

రైల్వేల ప్రధాన బలం లోకో పైలట్లే. వీరి పనితీరు మెరుగుపరిచేందుకు విజయవాడ జోన్ తీసుకున్న చర్యలను అభినందిస్తున్నా. రైలింజన్లలో క్రమంగా ఎయిర్ కండీషనింగ్ సదుపాయం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో ఈ సదుపాయాలన్నీ జోన్ మొత్తం విస్తరిస్తాం
గజానన్ మాల్యా, జీఎం, దక్షిణ మధ్య రైల్వే


లోకో పైలట్లు అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు వీలుగా కామన్ మినీ లైన్ బాక్సులను కూడా విజయవాడ జోన్ లో పంపిణీ చేశారు. టూల్ కిట్ లను వివిధ రకాల పెట్టెల్లో తీసుకెళ్లడం లోకో పైలట్లకు ఇబ్బందిగా మారినందున ఒకే పెట్టెలో వాటిని కలిపి కామన్ మినీ లైన్ బాక్స్ ( సీఎంఎల్) గా మార్చారు. దీంతో పైలట్లపై మరో భారం తగ్గినట్లయింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆరు డివిజన్లలోనూ వీటిని లోకో పైలట్లకు అందుబాటులోకి తెచ్చారు. తక్కువ స్ధలం అక్రమించేలా రూపొందించిన ఈ బాక్సుల రూపకల్పన వల్ల గతంలోలా వీటి నిర్వహణకు అదనపు సిబ్బంది అవసరం ఉండదు. దీంతో ఏటా రైల్వే జోన్ కు కోటి రూపాయల మేర డబ్బు కూడా ఆదా అవుతోంది. రైల్వే బోర్డు స్దాయిలో ఉత్తమ ఆవిష్కరణల్లో ఈ కామన్ మినీ లైన్ బాక్స్ కూడా ఒకటిగా అధికారులు చెప్తున్నారు.(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)

మా చెల్లి మీద చెయ్యేస్తావా అని యువకుడిని చీల్చీ చెండాడిన యువతి
Published by: Ashok Kumar Bonepalli
First published: October 20, 2019, 8:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading