హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

లాక్‌డౌన్‌లోనూ శ్రీవారి హుండీకి కానుకలు.. ఎంతొచ్చాయంటే..

లాక్‌డౌన్‌లోనూ శ్రీవారి హుండీకి కానుకలు.. ఎంతొచ్చాయంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రూ.50 లడ్డూను రూ.25కే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ తెలిపింది. టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కల్యాణ మంటపాల్లో లడ్డూ విక్రయాలు జరుగుతున్నాయని.. ప్రత్యేక ఆర్డర్‌పైనా స్వామి వారి లడ్డూలు పంపిణీ జరుగుతుందని అధికారులు చెప్పారు.

ఇంకా చదవండి ...

కరోనా లాక్‌డౌన్‌తో తిరుమలలో భక్తుల దర్శనాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. దాదాపు 2 నెలలుగా దర్శనాలను నిలిపివేసి శ్రీవారికి ఏకాంత పూజలు నిర్వహిస్తున్నారు. వేంకటేశ్వరుడి అర్చకులు నిత్య కైంకర్యాలు, సేవలు చేస్తున్నారు. ఐతే భక్తులకు అనుమతి లేనప్పటికీ శ్రీవారి హుండీకి మాత్రం భారీగా ఆదాయం వస్తోంది. వెంకన్నను దర్శించుకొని నేరుగా కానుకలు సమర్పించుకోలేని నేపథ్యంలో చాలా మంది ఆన్‌లైన్ ద్వారా ఈ-హుండీలో కానుకలు వేస్తున్నారు. ఈ-హుండీ ద్వారా ఏప్రిల్ నెలలో 1.97 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. గత ఏడాది ఏప్రిల్‌లో రూ.1.79 కోట్ల ఆదాయం రాగా.. ఈసారి అంతకు మించి విరాళాలు అందజేశారు.

కాగా, తిరుమలలో దర్శనాలు ఎప్పుడు పున: ప్రారంభమవుతాయో ఇప్పట్లో చెప్పలేమని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఐతే భక్తులపై వెంకన్న ఆశీస్సులు అందించాలన్న ఉద్దేశంతో లడ్డూ ప్రసాదాలను విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. రూ.50 లడ్డూను రూ.25కే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కల్యాణ మంటపాల్లో లడ్డూ విక్రయాలు జరుగుతున్నాయని.. ప్రత్యేక ఆర్డర్‌పైనా స్వామి వారి లడ్డూలు పంపిణీ జరుగుతుందని అధికారులు చెప్పారు. మరింత సమాచారం కోసం ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌ (9849575952), పేష్కార్‌ శ్రీనివాస్‌ (9701092777)ను సంప్రదించాలని ఆయన సూచించారు.

మే 31 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉంది. మతపరమైన కార్యక్రమాలకు అనుమతి లేదని కేంద్రం స్పష్టం చేయడంతో.. తిరుమలో ఇప్పట్లో భక్తులను అనుమతించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. వెంటనే దర్శనాలను ప్రారంభించేందుకు టీటీడీ మాత్రం అన్ని ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లు, లడ్డూ కౌంటర్లలో అధికారులు మార్కింగ్‌ చేయించారు. ఐతే 31 తర్వాతే టీటీడీ దర్శనాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

First published:

Tags: AP News, Lockdown, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Tirupati

ఉత్తమ కథలు