కాలం మారింది. ఒకప్పుడు మానవ సంబంధాలకు ఎంతో విలువ ఇచ్చేవారు. కానీ ఇప్పుడంతా డబ్బు మయం. బంధాలు.. అనుబంధాలన్నీ.. డబ్బులతోనే ముడిపడి ఉన్నాయి. చివరకు కన్నతల్లి దండ్రులను కూడా కాసులతోనే కొలుస్తున్నారు. ఆస్తి ఇస్తేనో.. డబ్బులు పంచితేనో.. తప్ప.. వారిని పోషించడం లేదు. బాగా చూసుకోవడం లేదు. అందరూ ఇలా ఉండరు. కానీ కొందరు మాత్ర ఇలాగే ఉంటున్నారు. ఆస్తి చేతుల్లోకి వచ్చాక.. కన్నవారిని కాదనుకుంటున్నారు. కొందరైతే అదే కాసుల కోసం.. కన్నవారిని కడతేర్చుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో హృదయ విదాకరక ఘటన చోటుచేసుకుంది. తండ్రి చనిపోతే.. కొడుకు తలకొరివి పెట్టేందుకు రాలేదు. డబ్బులు ఇస్తేనే తలకొరివి పెడతానని కండిషన్ పెట్టాడు. దిక్కుతోచని పరిస్థితుల్లో... కూతురే తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించింది.
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడుకు చెందిన గింజుపల్లి కోటయ్య (80) ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. ఐతే ఆస్తి విషయంలో అతడికి కొడుకుతో తరచూ గొడవలు జరుగుతుండేవి. చివరకు కోటయ్య తన భూమిని విక్రయించగా.. కోటి రూపాయలు వచ్చాయి. అందులో రూ.30 లక్షలు తన వద్ద ఉంచుకొని.. మిగతా 70 లక్షలను కుమారుడికి ఇచ్చేశాడు. ఆ డబ్బుతో కొడుకు సంతృప్తి చెందలేదు. మొత్తం డబ్బు కావాలని తండ్రితో గొడవ పడేవాడు. నిత్యం వేధించేవాడు. డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించేవాడు. ఒక్కోసారి కొట్టేవాడు కూడా..! కొడుకు టార్చర్ భరించలేక కోటయ్య, అతని భార్య కొన్ని రోజుల క్రితం..గుమ్మడిదుర్రులోని తమ కూతురు విజయ లక్ష్మి ఇంటికి వెళ్లారు. అప్పటి నుంచి కూతురి వద్దే ఉంటున్నారు.
తండ్రి వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్నా కుమారుడు పట్టించుకోలేదు. కూతురే తమ స్థోమత మేరకు చికిత్సను అందించింది. క్రమక్రమంగా కోటయ్య ఆరోగ్యం విషమించి.. శుక్రవారం రాత్రి చనిపోయాడు. తండ్రి మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యులు... అతడి కుమారుడికి చెప్పారు. ఐతే తన తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి ఖర్మకాండలు చేసేందుకు కుమారుడు నిరాకరించాడు. తండ్రి వద్ద ఉన్న డబ్బును ఇస్తేనే అంతిమసంస్కారాలు చేస్తానని తెగేసి చెప్పాడు. డబ్బు ఇవ్వకుంటే.. అంతిమ సంస్కారాలు చేయబోనని స్పష్టం చేశాడు. అంతేకాదు.. కనీసం తండ్రిని ఆఖరిసారి చూసేందుకు కూడా రాలేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో.. కూతురు విజయలక్ష్మే తన తండ్రికి అంతిమ సంస్కారాలను నిర్వహించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Local News, Vijayawada