సంక్రాంతి సెలవుల సందర్భంగా తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు ఇతర రాష్ట్రాల భక్తులు వెంకన్నను భారీగా దర్శించుకుంటున్నారు. తిరుమల పురవీధులన్నీ వెంకన్న, గోవింద నామ స్మరణతో మార్మోగిపోతోంది. దాదాపు 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో.. వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా, తిరుమలలో (కొండపైన) గదుల బుకింగ్ విధానంలో మార్పులు-చేర్పులూ చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవాస్థానం (టీటీడీ) తెలిపింది. దాని ప్రకారం... అద్దె గదులను ముందుగా బుక్ చేసుకునే భక్తులు కాషన్ డిపాజిట్ చెల్లించే విధానాన్ని తెచ్చింది. దీని ప్రకారం ఎన్ని గదులు బుక్ చేసుకుంటే అన్ని గదులకు ఎంత కాషన్ డిపాజిట్ (గదికి ఉండే అద్దెకు తగ్గట్టు) చెల్లించాలో.. అంత మొత్తాన్ని ఆన్లైన్లో టీటీడీ ఖాతాకు చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు గదిని ఖాళీ చేసే సమయంలో డిపాజిట్‌ను తిరిగి వెనక్కి ఇవ్వనున్నట్లు టీటీడీ తెలిపింది.
ఈ విధానాన్ని ఈ నెల చివరికల్లా ఆఫ్ లైన్ బుకింగ్ విధానంలో కూడా అమల్లోకి తేవనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అందువల్ల ఇప్పటికైతే... ఆన్లైన్లో గదులు బుక్ చేసుకునేవారికి... ఈ కాషన్ డిపాజిట్ విధానం అమల్లోకి వచ్చినట్లైంది.
Published by:Shravan Kumar Bommakanti
First published:January 16, 2020, 09:30 IST