Cyclone Alert : ఎంత టెక్నాలజీ వచ్చినా వాతావరణాన్ని కచ్చితంగా అంచనా వెయ్యడం కష్టం. ముఖ్యంగా ఈ తుఫాన్లు కుదురుగా రావు. ఎటో వెళ్తుంది అనుకునే లోపు.. యూటర్న్ తీసుకొని మనవైపు వస్తాయి. ఒక్కోసారి భారీ వర్షాలు పడతాయి అని చెబితే.. ఎండ వస్తుంది. అందుకే వాతావరణ అధికారులు వేసే అంచనాలు కొన్నిసార్లు తప్పుతూ ఉంటాయి. తాజాగా బంగాళాఖాతంలో గుండ్రంగా తిరుగుతున్న వాయుగుండం నేడు తుఫానుగా మారి.. తీరం దాటబోతోంది. దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతం.. ముఖ్యంగా రాయల సీమపై పడబోతోంది. అక్కడ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) అధికారులు అంచనా వేశారు.
నిన్న సాయంత్రం వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఇవాళ సాయంత్రానికి తుఫానుగా మారుతుందని అధికారులు అంటున్నారు. ఐతే.. అది చెన్నై వైపుగా వస్తోంది. అది ఉత్తర తమిళనాడు - పుదుచ్చేరి దగ్గర్లో తీరం దాటవచ్చు అంటున్నారు. అందువల్ల ఇటు ఏపీ, అటు తమిళనాడు ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. తెలంగాణపైనా తుఫాను ప్రభావం ఉంటుంది గానీ.. ఆకాశం మేఘాలతో ఉంటుందనీ.. అక్కడక్కడా చిరు జల్లులు కురుస్తాయని తెలిపారు. అందువల్ల తెలంగాణపై మరీ ఎక్కువ ప్రభావం లేదు అనుకోవచ్చు. కాకపోతే.. తెలంగాణలో ఉష్ణోగ్రతలు కాస్త పెరుగుతాయి అంటున్నారు.
రాయలసీమపై ప్రభావం :
ఈ తుఫాను వల్ల రాయల సీమలో డిసెంబర్ 8, 9, 10 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది వచ్చిన తర్వాత రాయలసీమలో వాతావరణం బాగా చల్లబడుతుందనీ.. ఆ ప్రభావం మూడు రోజులు ఉంటుందని చెబుతున్నారు. తుఫాను దృష్ట్యా ఇటు ఏపీ, అటు తమిళనాడులో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ సందర్భంగా కోస్తా తీర ప్రాంతాల్లో జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ నిపుణులు కోరారు. ఎవరైనా వెళ్లి ఉంటే.. త్వరగా వెనక్కి వచ్చేయాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.