CYCLONE JAWAD SAUDI ARABIA NAMES TO JAWAD CYCLONE HERE IS THE LIST OF UP COMING CYCLONES IN ARABIA AND BAY OF BENGAL SK
Cyclone Jawad: దూసుకొస్తున్న జవాద్.. తుఫాన్లకు పేర్లు ఎవరు పెడతారు? రాబోయే తుఫాన్లు ఇవే
ప్రతీకాత్మకచిత్రం
Cyclone Jawad: 2014లో ఏపీని అతలాకుతలం చేసిన హుద్ హుద్ తుఫాన్‌కు..ఆ పేరును పాకిస్తాన్ పెట్టింది. తిత్లీతో పాటు ఇటీవల వచ్చిన గులాబ్ తుఫాన్‌కు కూడా పాకిస్తానే నామకరణం చేసింది. జవాద్ తర్వాత ఏదైనా తుఫాన్ వస్తే దానికి ఆసాని, ఆ తర్వాత వచ్చే దానికి సిత్రాంగ్ పేర్లను పెడతారు
ఏపీ తీరం వైపు జవాద్ తుఫాన్ (Cyclone Jawad) దూసుకొస్తోంది. వేగంగా ముందుకు కదులుతూ ఉత్తరాంధ్ర వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా ఉన్నప్పటికీ.. మరికొద్ది గంటల్లోనే తుఫాన్‌గా బలపడుతుందని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. గురువారం రాత్రి 11.30 నిమిషాలకు ఐఎండీ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. వాయుగుండం ప్రస్తుతం విశాఖపట్టణానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 770 కి.మీ.దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం గంటకు 32 కి.మీ. వేగంతో పశ్చియ వాయువ్య దిశగా పయనిస్తోంది. ఇవాళ సాయంత్రం 6 గంటల నాటికి తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా బలపడుతుందని ఐఎండీ తెలిపింది. అది రేపటి ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని హెచ్చరించింది. ఇవాళ అర్ధరాత్రి ఏపీ, ఒడిశా తీరానికి అతి సమీపంలోకి వస్తుందని వెల్లడించింది. ఆ తర్వాత ఈశాన్య దిశగా పయనిస్తూ పశ్చిమ బెంగాల్ వైపు కదిలే అవకాశముందని పేర్కొంది. తుఫాన్ తీరం దాటే సమయంలో భారీ వర్షాలతో పాటు భీకరమైన ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. గంటకు 120 వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని హెచ్చరించింది.
ఐతే హుద్ హుద్, తిత్లీ, గజ, పెథాయ్, అమ్ఫున్, నిసర్గ, గతి, నివర్, బురేవి, యాస్, గులాబ్...తుఫాన్లకు ఈ పేర్లకు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు తుఫాన్లకు పేర్లు ఎందుకు పెడతారు?
అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతాల్ల వచ్చే తుఫాన్లకు 1953 నుంచే పేర్లు పెడుతున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ఈ పని చేస్తుంది. కానీ దక్షిణాసియా, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో తుఫాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయం 2004 నుంచి ప్రారంభమైంది. అంతకు ముందు హిందూ. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో పుట్టిన ఎన్నో తుఫాన్లకు పేర్లు లేవు. అవన్నీ అనామకంగానే మిగిలిపోయాయి.
తుఫాన్లకు పేర్లు పెట్టకపోవడం వల్లే వాటి గురించి వార్తల్లో రాయాలన్నా, చర్చించాలన్నా ఇబ్బందికర పరిస్థితుల తలెత్తుతాయి. పలానా సంవత్సరం అని చెప్పినా అందులో స్పష్టత ఉండదు. ఇక ఒకే సంవత్సరంలో రెండు మూడు తుఫాన్లు వస్తే మరింత గందరగోళం ఉంటుంది. తుఫాన్ల సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలోనూ సమస్యలు ఎదురవుతాయి. ఈ క్రమంలోనే తుఫాన్లకు పేర్ల పెట్టాలని పలు దేశాలు నిర్ణయించాయి. 2004లో WMO (World Meteorological Organization) ఆధ్వర్యంలో హిందూ, బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీరాల పరిధిలోని దేశాలు సమావేశమయ్యాయి. ఆ సమావేశంలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, శ్రీలంక, థాయిలాండ్ పాల్గొని ఒక్కో దేశం 8 పేర్లను సూచించాయి. మొత్తం 8 దేశాలు తలో 8 పేర్లను సూచించడంతో మొత్తం 64 పేర్లతో జాబితాను రూపొందించారు. ఆ తర్వాత 64 తుఫాన్లు రావడంతో ఆ జాబితాలోని పేర్లన్నీ పూర్తయ్యాయి.
ఈ నేపథ్యంతో గత ఏడాది ఏప్రిల్‌లో WMO కొత్త జాబితాను విడుదల చేసింది. 13 దేశాలు 13 పేర్ల చొప్పున సూచించడంతో.. మొత్తం 169 పేర్లు వచ్చాయి. ఈ జాబితాలో ఇప్పటికే రెండు పేర్లను వాడారు. బంగ్లాదేశ్ సూచించిన నిసర్గ, భారత్ సూచించిన గతితో పాటు నివార్, బురేవి, తౌక్టే, యాస్, గులాబ్ తుఫాన్లు ఇప్పటికే వచ్చి వెళ్లాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో కల్లోలం రేపుతున్న జవాద్ తుఫాన్ పేరును సౌదీ అరేబియా సూచించింది.
రాబోయే తుఫాన్ల జాబితా
భారత్ సూచించిన తుఫాన్ల పేర్లు:
గతి, తేజ్, మురసు, ఆగ్, వ్యామ్, ఝర్, ప్రొబాహొ, నీర్, ప్రభంజన్, ఘుర్ని, అంబుద్, జలధి, వేగ.
కాగా, 2014లో ఏపీని అతలాకుతలం చేసిన హుద్ హుద్ తుఫాన్‌కు..ఆ పేరును పాకిస్తాన్ పెట్టింది. తిత్లీతో పాటు ఇటీవల వచ్చిన గులాబ్ తుఫాన్‌కు కూడా పాకిస్తానే నామకరణం చేసింది. జవాద్ తర్వాత ఏదైనా తుఫాన్ వస్తే దానికి ఆసాని, ఆ తర్వాత వచ్చే దానికి సిత్రాంగ్ పేర్లను పెడతారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.