CYCLONE JAWAD MOVING TOWARDS VISAKHAPATNAM WATCH CYCLONE MOVEMENT HERE SK
Cyclone Jawad: జవాద్ ఇప్పుడు ఎక్కడుంది? తుఫాన్ గమనాన్ని లైవ్‌లో వీక్షించండి
జవాద్ తుఫాన్ (Image:Windy)
Cyclone Jawad: తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఒడిశాలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరిచింది.
జవాద్ తుఫాన్ (Cyclone jawad) తరుముకొస్తోంది. ఉత్తరాంధ్ర తీరాన్ని ముంచెత్తేందుకు వేగంగా దూసుకొస్తోంది. బంగాళాఖాతం (Bay Of Bengal)లో ఏర్పడిన తీవ్ర వాయుగుండం (Deep Depression) ఇవాళ ఉదయం 11.30 సమయంలో తుఫాన్‌గా బలపడిందని భారత వాతావరణ విభాగం కాసేపటి క్రితం తెలిపింది. ఇది మరికొన్ని గంటల్లోనే అతి తీవ్ర తుఫాన్‌గా బలపడుతుందని తెలిపింది. ఐంఎండీ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. ఇవాళ ఉదయం 11.30 గంటల సమయంలో జవాద్ తుఫాన్ విశాఖపట్టాణానికి (Visakhapattanam) దక్షిణ ఆగ్నేయ దిశగా 420 కి.మీ., ఒడిశాలోని గోపాల్పూర్ (Gopalpur)కు దక్షిణ నైరుతి దిశగా 530 కి.మీ, పారాదీప్ (Paradeep)కు 650 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. అది ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా గంటకు 25 కి.మీ. వేగంతో ఏపీ తీరం వైపు కదులుతోంది. తుఫాన్‌గా బలపడిన తర్వాత శనివారం ఉదయం నాటికి ఏపీ, ఒడిశా తీరం సమీపంలోకి వస్తుంది. అనంతరం మలుపు తీసుకొని ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తుంది. ఐతే ఖచ్చితంగా ఎక్కడ తీరం దాటుతుందో ఇప్పుడే చెప్పలేమని భారత వాతావరణశాఖ వెల్లడించింది.
తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఒడిశాలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరిచింది. ముఖ్యంగా ఏపీలోని విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు ఒడిశాలోని గజపతి, గంజా, పూరీ, నయాగఢ్, ఖుర్దా, కటక్, జగత్సింగ్పూర్, కేంద్రపారా జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఉంటుందని పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు 47 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఎన్డీఆర్ఎఫ్ డీజీ అతుల్ కర్వాల్ చెప్పారు. మరో 18 టీమ్‌ను స్టాండ్‌బైగా ఉంచామని చెప్పారు.
ఇవాళ ఉత్తరాంధ్ర తీరం అల్లకల్లోంగా మారుతుంది. పెద్ద ఎత్తున అలలు ఎగసిపడతాయి. గంటకు 95 కి.మీ.వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. రేపటికి ఈ గాలుల వేగం పెరుగుతుందని, గంటకు 120 కి.మీ. ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఏపీలోని మత్స్యకారులు ఇవాళ, రేపు సముద్రంలో చేపట వేటకు వెళ్లకూడదని తెలిపింది. భారీ వర్షం, ఈదురు గాలుల ధాటికి పూరిళ్లు, పాకలు దెబ్బతినవచ్చు. చెట్లు పూర్తిగా నేలకొరగడంతో పాటు కొమ్మలు విరిగిపోతాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల కారణంగా నదులు ఉప్పొంగే అవకాశముందని, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.