ఉత్తరాంధ్ర, ఒడిశావైపు దూసుకొస్తున్న ఫణి తుఫాను... 10,00,00,000 మందిపై ప్రభావం...

ఫణి తుఫాను వచ్చేస్తోంది...

Cyclone Fani Live Updates : తీరానికి దగ్గరయ్యే కొద్దీ... భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు గంటకు 175 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు.

  • Share this:
Cyclone Fani Live Updates : బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుఫాను అత్యంత తీవ్రాతి తీవ్ర తుఫానుగా మారింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఒడిశాలో పూరి దగ్గర మే 3న తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. అత్యంత తీవ్రాతి తీవ్ర తుఫాను ప్రభావం ఉత్తర కోస్తా, ఒడిశా తీరాలపై ఉంటుందనీ, భారీ విధ్వంసం సృష్టించే ప్రమాదం పొంచి ఉందని అంచనా వేశారు. ఆ సమయంలో తుఫాను వల్ల సముద్ర తీరం దగ్గర గంటకు 175 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, ఏపీపై అంతగా ప్రభావం ఉండదని తెలుస్తున్నా... తుఫాను కాబట్టి... జాగ్రత్త పడటం మంచిదని సూచిస్తున్నారు. అసలే తుఫాన్లు వస్తే చిగురుటాకులా వణికిపోయే ఒడిశా... ఇప్పుడు మరోసారి ఆందోళన చెందుతోంది. ఆ రాష్ట్రంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్... సహాయ చర్యలు చేపట్టేందుకు ప్రిపేర్ అయ్యింది. తీర ప్రాంతం దగ్గర ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. మొత్తం పది కోట్ల మంది ప్రజలపై తుఫాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఫణి తుఫాను విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 500 కిలోమీటర్ల దూరంలో, పూరీకి 700 కిలోమీటర్ల దూరంలో ఉంది. అత్యంత తీవ్రాతి తీవ్ర తుఫాను మరింత బలపడి... తీరానికి దగ్గరయ్యే కొద్దీ... భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు గంటకు 175 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు.

అత్యంత తీవ్రాతి తీవ్ర తుఫాను మే 1 నుంచీ తూర్పు ఈశాన్యం వైపు దిశ మార్చుకుంటుందనే అంచనా ఉంది. అది ఒడిశాలోని గోపాల్‌పూర్, చాంద్ బాలి వైపు పయనిస్తుందని లెక్కలు కట్టారు. దాని ప్రభావంతో మే 2న ఉత్తర కోస్తా, ఒడిశాలో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. మే 3న కూడా ఒడిశాలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ఉంటాయంటున్నారు. దాదాపు 20 సెంటీమీటర్ల వర్షం పడుతుందని ముందుగానే హెచ్చరిస్తున్నారు. సముద్రంలో అలలు 1.5 మీటర్ల ఎత్తుకు లేస్తాయని అంచనా. ఒడిశాలోని గంజాం, ఖుర్దా, పూరీ, జగత్‌సింగ్ పూర్ ప్రాంతాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు. మే 4న బెంగాల్‌ వంతు. అక్కడ కూడా భారీ వర్షాలు పడతాయట. తీరం వెంట గాలులు బాగా వీస్తాయంటున్నారు.


ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం ఎంత : మే 2న ఉత్తర కోస్తా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులో ఐదో నెంబర్ ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. జాలర్లు ఈ నాలుగు రోజులూ సముద్రంలో వేటకు వెళ్లొద్దనీ, ఆల్రెడీ వెళ్లిన వాళ్లు ఈ రోజు మధ్యాహ్నం లోపు వెనక్కి వచ్చేయాలని హెచ్చరించారు.

ఫణి తుఫానును ఎదుర్కొనేందుకు తూర్పు నౌకా దళం రెడీ అయ్యింది. విశాఖపట్నం, చెన్నై పోర్టుల్లో 3 యుద్ధ నౌకల్ని సిద్ధంగా ఉంచింది. వీటిలో అదనపు డైవర్లు, డాక్టర్లు, మందులు, టెంట్లు, దుస్తులు, ఆహార పదార్ధాల్ని ఉంచారు. తుఫాను విరుచుకుపడిన చోటికి వాటిని వెంటనే తరలిస్తారు. క్షణాల్లో రంగంలోకి దిగేలా అరక్కోణం ఎయిర్ బేస్‌లో ఐఎన్‌ఎస్ రాజాలి సిద్ధంగా ఉంది. చెన్నై, ఏపీ, పుదుచ్చేరి ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు నౌకాదళ అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది.

 

ఇవి కూడా చదవండి :

లక్ష్మీస్ ఎన్టీఆర్‌కి ఏపీలో మళ్లీ బ్రేక్... నిషేధం ఉందన్న ఈసీ... విడుదల అవుతుందన్న రాంగోపాల్ వర్మ

EVMలపై రాంగ్ కంప్లైంట్ ఇస్తే 6 నెలల జైలు... ఇలాంటి రూల్ కూడా ఉంది తెలుసా...
First published: