ఏపీ వైపు దూసుకొస్తున్న భీకర తుఫాన్.. విశాఖ నిశ్శబ్దం..

దూసుకొస్తున్న ఎంఫాన్ తుఫాన్ (Photo : IMD Website)

ఏపీకి తుఫాన్ గండం పొంచి ఉంది. రాష్ట్రం వైపు భీకర తుఫాన్ దూసుకువస్తోంది.

  • Share this:
    తుఫాన్ వచ్చే ముందు ఎంత నిశ్శబ్ధం అలుముకుంటుందో.. అలాంటి వాతావరణం విశాఖలో కనిపిస్తోంది. అప్పటి వరకు భగభగ మండిన సూర్యుడు ఒక్కసారిగా చల్లగా మారిపోయాడు. ఈదులు గాలులుతో నగరం అంతా ప్రశాంతంగా కనిపిస్తోంది. ఇది ఆహ్లాదం కాదు.. ముందస్తు భారీ హెచ్చరిక. అవును..! ఏపీకి తుఫాన్ గండం పొంచి ఉంది. రాష్ట్రం వైపు భీకర తుఫాన్ దూసుకువస్తోంది. బంగాళాఖాతంలో అండమాన్‌కు దక్షిణ దిశగా ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారబోతోందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 8వ తేదీ నాటికి ఆ అల్పపీడనం మరింత బలపడి తీవ్రమైన తుఫాన్‌గా మారుతుందని అభిప్రాయపడుతోంది. ఎంఫాన్‌ అన్న పేరు పెట్టుకున్న ఈ తుఫాన్.. ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌పై భారీ ప్రభావం చూపుతుందని అధికారులు చెబుతున్నారు.

    యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ (ఈసీఎండబ్ల్యూఎఫ్‌) ప్రకారం.. ఈ నెల 13వ తేదీ నాటికి మయన్మార్ వద్ద తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ తుఫాన్ ఎఫెక్ట్‌తో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తగా మత్స్యకారులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చేపల వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర, ఒడిసా తీర ప్రాంత జిల్లాల్లో వచ్చే 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొన్నారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: