గుంటూరు అర్బన్ కాప్స్ ఫేస్బుక్ ఖాతా నుంచి ఎవరికీ రిక్వెస్ట్లు పంపరని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. గుంటూరు అర్బన్ కాప్స్ ఖాతా నుంచి ఎవరైనా రిక్వెస్టులు పెట్టారంటే, అది ఖచ్చితంగా సైబర్ నేరగాళ్ల పనిగా తెలుసుకోవాలని చెప్పారు.
ఇటీవల ఫేస్బుక్ వేదికగా కొత్త తరహా మోసాలు జరుగుతున్నాయి. ఒక వ్యక్తి పేరిట నకిలీ ఖాతా సృష్టించి, వారి మిత్రులకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించి, అనంతరం డబ్బులు అడుగుతున్న కేసులు ఇటీవల పెరిగుతున్నాయి. తమకు తెలియకుండానే.. తమ పేరిట డబ్బులు అడుగుతున్నారని చాలా మంది షాక్ అవుతున్నారు. తమ పేరిట ఇంకో ఖాతా ఎలా వచ్చిందో తెలియన తలలు పట్టుకున్నారు. ఐతే సాధారణ ప్రజలే పోలీసులు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి. సైబర్ నేరాల్లో వారు కూడా బాధితులుగా మారుతున్నారు. గుంటూరులో ఇలాంటి ఘటనే జరిగింది.
గుంటూరు ట్రాఫిక్ ఎస్సై కొట్టే శ్రీహరి ఫేస్బుక్ ఖాతా పేరిట గుర్తు తెలియని వ్యక్తులు కొత్త ఖాతా సృష్టించారు. అదే పేరు, అదే ఫొటోతో అకౌంట్ క్రియేట్ చేశారు. అనంతరం అతడి మిత్రులందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు. ఎస్సై శ్రీహరే పంపించాడని చాలా మంది యాక్సెప్ట్ చేశారు. అనంతరం ఇటీవల ఎస్ఐ శ్రీహరి ఫేస్ బుక్ ఖాతా నుంచి ఆయన మిత్రులకు సందేశాలు వెళ్తున్నాయి. అత్యవసర వైద్య ఖర్చుల కోసం డబ్బులు పంపించాలని అడుగుతున్నారు. నిజంగానే ఎస్ఐ ఇబ్బందుల్లో ఉన్నాడేమోనని చాలా మంది పంపించారు. కానీ వాస్తవానికి అది ఎస్ఐ ఖాతా కాదు. సైబర్ నేరస్తులు ఇలా నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు.
ఆ తర్వాత ఏకంగా అర్బన్ పోలీసు శాఖ ఫేస్బుక్ ఖాతాపై సైబర్ నేరస్తుల కన్ను పడింది. ఎస్పీ స్థాయి అధికారి ఫొటోతో ఉండే గుంటూరు అర్బన్ కాప్స్ ఫేస్బుక్ ఖాతాకు నకిలీ ఐడీ సృష్టించారు. ఆ ఖాతా నుంచి పోలీసుల పేరుతో ప్రజలకు సందేశాలు వెళ్తున్నాయి. డబ్బులు పంపించాలని విజ్ఞప్తులు అందుతున్నాయి. ఈ విషయాన్ని కొందరు వ్యక్తులు పోలీస్ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన గుంటూరు అర్బన్ ఎస్పీ.. ఈ విషయాన్ని సైబర్ అనాలసిస్ నిపుణుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వారు ఆ నకిలీ ఖాతాను తొలగించారు.
గుంటూరు అర్బన్ కాప్స్ ఫేస్బుక్ ఖాతా నుంచి ఎవరికీ రిక్వెస్ట్లు పంపరని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. గుంటూరు అర్బన్ కాప్స్ ఖాతా నుంచి ఎవరైనా రిక్వెస్టులు పెట్టారంటే, అది ఖచ్చితంగా సైబర్ నేరగాళ్ల పనిగా తెలుసుకోవాలని చెప్పారు. దీనిపై ఎవరికైనా సందేహాలు ఉంటే డయల్ 100కు, 8688831568కు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఇటీవల ఇలాంటి నేరాలు పెరిగిపోయాయి. పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ఎవరికైనా ఇలాంటి రిక్వెస్ట్ వస్తే.. క్రాస్ చెక్ చేసుకోవలని పోలీసులు సూచిస్తున్నారు. డబ్బులు పంపేముందు మీ మిత్రుడి ఫోన్కు కాల్ చేసి, ధృవీకరించుకోవాలని చెబుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.